Telangana: తెలంగాణలో శాసన సమర సన్నాహాలు.. వేగంగా పావులు కదుపుతోన్న పొలిటికల్ పార్టీలు..

Telangana: అమిత్ షాతో సభ నిర్వహించే ఆలోచనలో కాషాయదళం

Shekhar G
Published on: 19 Aug 2023 7:26 PM IST
Preparations For Legislative Battle In Telangana
X

Telangana: తెలంగాణలో శాసన సమర సన్నాహాలు.. వేగంగా పావులు కదుపుతోన్న పొలిటికల్ పార్టీలు

Telangana: తెలంగాణలో ఎన్నికల సమర సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. రోజురోజుకూ పవర్ గేమ్‌లో వేగంగా పావులు కదుపుతున్నాయి ప్రధాన పార్టీలు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను బరిలోకి దింపి.. ప్రచారాల దూకుడు పెంచేందుకు అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. అభ్యర్థుల ప్రకటనతో పాటు భారీ బహిరంగ సభలతో ఎన్నికల శంఖారావం పూరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు నేతలు.

టికెట్ల ఖరారులో కారు పార్టీ టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. రేపో మాపో అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈనెల 21న గులాబీ దళపతి అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తారంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. దీంతో పాటు వరంగల్‌లో రికార్డు స్థాయిలో సభ ఏర్పాటు చేసి కదన భేరి మోగించేందుకు సిద్ధమవుతోంది గులాబీ దళం.

మరోవైపు హస్తం పార్టీ కూడా అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. వీలైనంత వేగంగా కారు స్పీడ్‌ను అందుకొని తమ పార్టీని ప్రచారంలో నిలపాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఆగస్టు నెలాఖరుకు లిస్ట్ సిద్ధం చేసి ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో చేవెళ్లలో భారీ సభకు ప్లాన్ చేస్తోంది.

ఇక కాషాయదళం కూడా శాసన సమరానికి సై అంటోంది. సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి విడతగా అభ్యర్థులను ప్రకటించేందుకు కమలం అగ్రనేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సభ నిర్వహించాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ పెంచిన బీజేపీ అధిష్టానం.. ఇతర రాష్ట్రాల నుంచి 119 మంది ఎమ్మెల్యేలను రాష్ట్రానికి పంపుతోంది.

Shekhar G

Shekhar G

Next Story