telangana: సర్కారు దవాఖానాల్లో జొరానికి పొద్దంతా వైద్యం!

telangana: సర్కారు దవాఖానాల్లో జొరానికి పొద్దంతా వైద్యం!
x
Highlights

తెలంగాణా రాష్ట్రంలో వేగంగా ప్రబలుతున్న విష జ్వరాల పై సమావేశమైన వైద్య శాఖ ఉన్నతాధికారులు ప్రత్యెక నిర్ణయాలు తీసుకున్నారు. సర్కారు దవాఖానాల్లో జ్వరాలతో బాధపడుతున్న వారికి వైద్య సదుపాయాలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవలాని నిర్ణయించారు.

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు విరుచుకు పడుతుండడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవల్ని విస్తరించాలని నిర్ణయించారు. ఇక ఉదయం సాయంత్రం కూడా అవుట్ పేషెంట్ విభాగంలో సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు పెద్దఎత్తున నమోదు అవుతున్నాయి. దీంతో అప్రమత్త్యమైన అధికారులు మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విషజ్వరాలను ఎదుర్కోవడానికి పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా వ్యాధుల నమోదును కచ్చితత్వంతో చేయాలని సిబ్బందికి స్పష్టం చేశారు. దానివలన ఎక్కడ ఏవిధమైన వ్యాధుల తీవ్రత ఎక్కువుందో గుర్తించి తగిన సేవలు రూపొందించవచ్చని సిబ్బందికి తెలిపారు. వైద్యసేవలను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉదయం సాయంత్రం ఓపీ నిర్వహించడంతో పాటు, రెండో శనివారం, ఆదివారం కూడా వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. జ్వరాలు తగ్గుముఖం పట్టేవరకూ వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఓపీ నమోదు కేంద్రాల సంఖ్యను అన్ని ఆసుపత్రుల్లోనూ పెంచాలనీ, నిర్ధారణ పరీక్షలకు రక్త, మూత్ర నమూనాలను స్వీకరించే కేంద్రాలనూ పెంచాలనీ, 100 శాతం నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయాలనీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికీ ఆదేశాలు జారీ చేశారు.

కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ డాక్టర్‌ యోగితారాణా, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్‌ ఉన్నతాధికారి డాక్టర్‌ అశోక్‌, రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖరరెడ్డి, ఐపీఎం సంచాలకులు డాక్టర్‌ శంకర్‌, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, ఇతర వైద్యశాఖ అధికారులు హాజరయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories