తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు..

తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు..
x
Highlights

తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి...

తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 8న నిలిపివేసింది. ధరణి పోర్టల్‌ ద్వారా నవంబర్‌ 2న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. తాజాగా ఇవాళ్టి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు షురూ కానున్నాయి. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు.

అయితే రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన పాతవెబ్‌ పోర్టల్‌ ద్వారానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలకమైన కొత్త అంశాలను జోడించింది. రిజిస్ట్రేషన్‌ ఫీజుల విషయంలో సబ్‌ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలను రద్దు చేసింది. ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆస్తి పన్ను సంఖ్య తప్పనిసరి చేశారు. ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రోజుకు 24 స్లాట్లనే కేటాయించారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా అత్యంత పారదర్శకంగా, సులభతరంగా ఉండే విధంగా భూముల రిజిస్ట్రేషన్ చేపట్టనున్నారు.

ఇక వ్యవసాయేతర ఆస్తులు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్‌ అండ్‌ బీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన సబ్‌కమిటీ నియమించారు సీఎం కేసీఆర్. మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని, హోంమంత్రి మహమూద్‌అలీని సభ్యులుగా చేర్చారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని సబ్‌ కమిటీని సీఎం ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories