మహారాష్ట్ర టు నిజామాబాద్: సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్

Arun Chilukuri
Published on: 25 Feb 2021 3:15 PM IST
మహారాష్ట్ర టు నిజామాబాద్: సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్
X

మహారాష్ట్ర టు నిజామాబాద్: సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్

మహారాష్ట్రలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. దీంతో సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర హై అలర్ట్‌ ప్రకటించారు నిజామాబాద్‌ జిల్లా అధికారులు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు చేయాలని, జిల్లా వాసులెవరైనా మహారాష్ట్రకు వెళ్లొస్తే క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న సాలూరా - సలాబాత్ పూర్ చెక్‌ పోస్టుల దగ్గర కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కరోనా ఉధృతి పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చే ప్రధాన దారులైన సాలూరా, మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు చేసిన తర్వాతనే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. టెస్టులో పాజిటివ్ తెలితే వెనక్కి పంపిస్తున్నారు. కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు అధికారులు.

ఇటు నిజామాబాద్‌ జిల్లాలోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతిరోజు 10 నుంచి 20 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 15 వేల 780 కరోనా కేసులు నమోదవగా కామారెడ్డి జిల్లాలో 13 వేల 624 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ శాతం బాధితులు హోం క్వారంటైన్‌ ద్వారా కోలుకున్నారు. మరోవైపు గత రెండు నెలలుగా జిల్లాలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరోవైపు కరోనా కట్టడికి ఇప్పటి నుంచే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లా వాసులు. కరోనా సెకండ్‌ వేవ్‌ రాష్ట్రంలోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story