మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు వేగం

మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు వేగం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌...

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం వార్డులు/డివిజన్ల విభజన ప్రక్రియకు సంబంధించిన 14 రోజుల షెడ్యూల్‌ను ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో వార్డులు/డివిజన్ల విభజన కోసం కేవలం 7 రోజుల షెడ్యూల్‌ మాత్రమే ప్రకటించి హడావుడిగా చేసిందని, ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరించేందుకు కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఇచ్చారని. దాంతో ఇందులో లోపాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో మున్సిపల్‌ ఎన్నికలు నిలిచిపోయాయి.

ఈ క్రమంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో వార్డుల విభజనకు 14 రోజుల సమయం ఉండాలని అలాగే ప్రజలనుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు వీలైనంత ఎక్కువ సమయం ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెల్లడించడంతో తాజాగా షెడ్యూల్‌ను పురపాలక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం మున్సిపాలిటీలు వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదాను మంగళవారం ప్రకటించాయి.

ఇందులో భాగంగా ఈ నెల 3 నుంచి 9 వరకు ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్టు అరవింద్‌కుమార్‌ తెలిపారు. అభ్యంతరాలను ఈలోపు పరిష్కరించి ఈ నెల 17న వార్డుల విభజనకు సంబంధించిన తుది ప్రకటనను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. వార్డుల క్రమసంఖ్య వరుసగా ఉత్తరం నుంచి ప్రారంభమై తూర్పు, దక్షిణం, పశ్చిమ దిశల వారీగా ఉండేలా మున్సిపాలిటీల మ్యాపుల రూపకల్పన చేయాలనీ రాష్ట్రంలోని మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ప్రకారం వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించి ఉండకూదని కండీషన్ ఉంచింది.

అలాగే ఇక కీలకమైన రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొత్త వార్డులు/డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభాను లెక్కించనున్నారు. ఇందుకోసం గరిష్టంగా 5 రోజుల సమయాన్ని కేటాయించారు. జనాభా గణన పూర్తయ్యాకే మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం మున్సిపాలిటీల వార్డు, చైర్‌పర్సన్‌ స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.

వార్డు/డివిజన్‌ స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటిస్తూ స్థానిక జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ వార్డుల విభజన ముగిసిన తర్వాతే చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్‌ వార్డులలోనే కాక కార్పొరేషన్లలో కూడా జనాభా దామాషా ప్రకారం ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తుండగా ఎస్సీ, ఎస్టీల కోటా పోగా మిగిలిన స్థానాలను బీసీలకు రిజర్వు చేస్తారు. ఈ ఎన్నికల్లో ఖరారు చేసే రిజర్వేషన్లనే మరో రెండు సాధారణ ఎన్నికల వరకు కొనసాగించనున్నారు.

అయితే చైర్‌పర్సన్, మేయర్‌ స్థానాల రిజర్వేషన్లను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. వార్డులు/డివిజన్ల విభజన, రిజర్వేషన్లు డిసెంబర్ లో పూర్తయితే జనవరిలో ఎన్నికలను జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త మున్సిపల్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సాధారణ మున్సిపల్‌ ఎన్నికలు కావడంతో కొత్త రోస్టర్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ను అమలు చేస్తున్నారు. గతంలో అమలు చేసిన రోస్టర్‌ను ఈ ఎన్నికల్లో కొనసాగించరని తెలుస్తోంది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories