Medaram Jatara: నేటి నుంచి మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర

Medaram Jatara: ఇవాళ గద్దెలపై కొలువుదీరనున్న సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు

Jyothi
Published on: 21 Feb 2024 7:55 AM IST
Medaram Maha Jatara from today
X

Medaram Jatara: నేటి నుంచి మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర

Medaram Jatara: తనువెల్లా భక్తితో తల్లులను కొలిచే తరుణం ఆసన్నమైంది. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంబురం రానేవచ్చింది. అడవి ఒడిలో మహాజాతరకు చెట్టూపుట్టా ముస్తాబైంది. వీరగడ్డ మేడారంలో నేటి సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ రాకతో అపూర్వ.. అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరునాడు సమ్మక్క రాక ఆద్యంతం ఉద్విగ్నభరితంగా కొనసాగనుండగా ప్రపంచమంతా మేడారంవైపే ప్రణమిల్లనుంది. కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు నేటి సాయంత్రం మేడారం చేరుకోనుండగా అమ్మవార్ల దర్శనానికి జన ప్రవాహం ఇప్పటికే పోటెత్తుతున్నది.

నేటి నుంచి 24వరకు మేడారం మహా జాతర కొనసాగనుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపైకి చేరుతుంది. మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి సారలమ్మ వడ్డెలు మేడారంలోని గద్దెలకు వచ్చి ముగ్గులు వేసి మళ్లీ కన్నెపల్లిలోని పూజా మందిరానికి చేరుకుంటారు. అక్కడ రెండు గంటల పాటు అత్యంత గోప్యంగా పూజలు చేసి సారలమ్మను తీసుకువస్తారు. కడుపు పండాలని కోరుకునేవారు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వేలాది మంది భక్తులు తడి బట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమస్కారాలతో వరం పడతారు. దేవత రూపాన్ని చేతపట్టుకుని గుడి బయటకు వచ్చిన పూజారులు వరం పడుతున్న వారి పైనుంచి నడిచి వెళ్తారు.

కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు నేటి సాయంత్రం మేడారం చేరుకుంటారు. రాత్రి 7 గంటలకల్లా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరనున్నారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను గద్దెలపైకి అత్యంత నియమనిష్టలతో తీసుకొస్తారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం కోసం భక్తులు రాత్రింబవళ్లు తేడా లేకుండా బారులు తీరనున్నారు. ఎత్తుబంగారం మొక్కులు చెల్లించనున్నారు. జాతర చివరి రోజైన శనివారం తల్లుల వనప్రవేశంతో జాతర ముగియనుంది. మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపడుతున్నారు.

మేడారం జాతరలో రాష్ట్ర ప్రభుత్వం 110కోట్లతో ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో సుమారు 6వేల బస్సులు నడుపుతున్నారు. 10వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా దాదాపు కోటీ 50లక్షల మందికి పైగా భక్తులు తల్లుల దర్శనానికి వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. మంగళవారం సాయంత్రం నుంచి భక్తుల రాక పెరిగింది. జంపన్నవాగు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్‌, కొంగలమడుగు ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. పొలాల్లో గుడారాలు వెలిశాయి. కొందరు భక్తులు తమ వాహనాలనే ఆవాసాలుగా మార్చుకొని అమ్మల దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేస్తూ తరించిపోతున్నారు.

జాతర విశేషాలను చూసేందుకు అధికారులు ఎల్‌ఈడీ స్క్రీన్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు.గద్దెల వద్ద సమ్మక్క తల్లి ముఖచిత్రాన్ని పూలతో అలంకరించారు. భక్తులు కానుకలు సమర్పించేందుకు హుండీలు ఏర్పాటు చేశారు. కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. గద్దెల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవార్ల ప్రాంగణం, గద్దెల చుట్టూ ఉన్న సాలహారం, ఆర్చి గేట్లను రకరకాల పూలతో అలంకరించారు.

Jyothi

Jyothi

Next Story