Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్‌ మెట్రో.. ఎల్‌ అండ్‌ టీ కీలక నిర్ణయం?

L&T has Decided to Sell its Equity in Hyderabad Metro
x

Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్‌ మెట్రో.. ఎల్‌ అండ్‌ టీ కీలక నిర్ణయం?

Highlights

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు చెందిన తన వాటాను ఎల్ అండ్ టీ విక్రయించబోతుందా..?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు చెందిన తన వాటాను ఎల్ అండ్ టీ విక్రయించబోతుందా..? ఆ సంస్థ ప్రతినిధుల ప్రకటనల ఆంతర్యమేంటి..? కొవిడ్ విజృంభణతో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు ఎల్ అండ్ టీ ని కోలుకోలేకుండా చేశాయా..?

భాగ్యనగరానికి మణిహారమంటూ సిటీ జనాల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్‌. అయితే ఈ ప్రాజెక్టు అనుకున్న స్థాయిలో లాభాలు సాధించలేకపోయింది. అంచనా వ్యయం పెరిగిపోవటం ఓ సమస్య అయితే దాని నిర్వహణ మరో సమస్యగా మారింది. కొంచెం పుంజుకుంటుందన్న సమయంలో కొవిడ్ వరుస లాక్ డౌన్‌లతో మెట్రో ఆదాయం మరింత కుదేలైంది.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటైన హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌ అండ్‌ టీకి 90 శాతం వాటా ఉండగా, తెలంగాణ ప్రభుత్వానికి 10 శాతం వాటా ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 16 వేల 5 వందల 71 కోట్లు కాగా, వివిధ కారణాలతో ఇది 18 వేల 9 వందల 71 కోట్లకు చేరింది. ఇందులో 13 వేల 5 వందల కోట్లను ఎల్‌ అండ్‌ టీ అప్పుల ద్వారా సేకరించింది. దీనికి తోడు 2019-20లో 3 వందల 83.20 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఇక 2020-21లో ఈ నష్టాలు ఏకంగా 17 వందల 66 కోట్లకు చేరాయి. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 23 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు ఆరు నెలల పాటు మెట్రో రైల్‌ సేవలు పూర్తిగా నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

అయితే ఈ క్రమంలో ఎల్‌ అండ్‌ టీ వాటాను ఆ సంస్థ విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీకే సేన్‌ ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఉత్తరాఖండ్‌లో ఎల్‌ అండ్‌ టీకి చెందిన 99 మెగావాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టును రెన్యూ పవర్‌ కంపెనీకి విక్రయించిన విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన ప్రకటనలో సేన్‌ ఈ విషయం తెలిపారు. అయితే తమ పూర్తి వాటాను అమ్ముతారా లేక కొంత షేర్ అమ్ముతారా అనే విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు. ఇక హైదరాబాద్ మెట్రో వాటాతో పాటు పంజాబ్‌లోని నభా థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు ఇతర ప్లేసుల్లో ఉన్న ఎల్ అండ్ టీ ఇతర ఆస్తుల్ని కూడా విక్రయిస్తున్నట్లు డీకే సేన్ తన ప్రకటనలో తెలిపారు. ఆర్థిక కష్టాల నుంచి తమను ఆదుకోవాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఇక ప్రభుత్వం ఎల్ అండ్ టీకి ఆర్థిక సాయం చేస్తుందా లేదా చూడాలి మరి.


Show Full Article
Print Article
Next Story
More Stories