దోస్త్‌ మేరా దోస్త్.. సీఎంల మధ్య గ్యాప్‌ వచ్చిందా... తీసుకున్నారా?

Jagan, KCR Meet for 1st Time After Water Dispute
x

దోస్త్‌ మేరా దోస్త్.. సీఎంల మధ్య గ్యాప్‌ వచ్చిందా... తీసుకున్నారా?

Highlights

Jagan, KCR: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ క్రమంగా రాలేదా వాళ్లు తీసుకోలేదా?

Jagan, KCR: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ క్రమంగా రాలేదా వాళ్లు తీసుకోలేదా? కేసీఆర్‌ వర్సెస్ జగన్ అన్న తీరుగా మారిన పరిస్థితి ఇప్పుడు కనుమరుగైందా? గత ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాల తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని చెప్పుకున్న నేతల మధ్య కృష్ణా జిల్లాలు చిచ్చు పెట్టాయన్న వార్తలు నిజం కావా? అసలు కేసీఆర్‌కు, జగన్‌కు మధ్య వివాదాలు లేవా అంత కల్పితాలేనా? మొన్న ఇద్దరు సీఎంలు కలవడం, ఆప్యాయం మాట్లాడుకోవడం చూస్తుంటే అనిపిస్తుందేమిటి కనిపిస్తుందేమిటి?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కొన్నాళ్లు కలసి అడుగులు వేస్తూ అభివృద్థిలో ఒకరికొకరు సహకరించుకుంటూ పాలన సాగిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఉమ్మడి శత్రువైన చంద్రబాబును దెబ్బతీయడంతో విజయం సాధించారు. అయితే రెండు రాష్ట్ర్రాల జలవివాదాల నేపథ్యంలో ఇద్దరు సీఎంల మధ్య గ్యాప్‌ వచ్చిందన్న చర్చలు నడిచాయి అప్పట్లో. కానీ, అదంతా ఉత్తుత్తిదేనంటున్నారు ఇరు రాష్ట్ర్రాలు నేతలు. అందుకు వేదికగా నిలిచిన ఓ దృశ్యాన్ని వారు చూపిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు హాటాట్‌గా సాగుతున్న సందర్భంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలుసుకోవడమే కాదు ఆప్యాయంగా పలకరించుకోవడం, కలసి కూచొని మాట్లాడుకోవడంపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వేడుకలో చాలాసేపు పక్కపక్కనే కూర్చున్నారు. ఇద్దరి మధ్య గుసగుసలు కూడా నడిచాయి. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉండగా ఇటీవల కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపించింది. జలవివాదంపై రెండు రాష్ట్రాల మధ్య వార్ నడిచింది. ఏపీ, తెలంగాణ మంత్రులు మాటల యుద్ధానికి దిగారు. పరస్పర సవాళ్లు కూడా విసురుకున్నారు. పాలనపైనా సెటైర్లు వేసుకున్నారు. కానీ, తాజాగా జగన్, కేసీఆర్‌లు ఇలా కలుసుకోవడం గుసగుసలాడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందో చూద్దాం. మొన్నీ మధ్య, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలి పెళ్లి శంషాబాద్‌లో జరిగింది. ఏపీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్టారెడ్డి కుమారుడికి పోచారం మనవరాలిని ఇచ్చారు. ఈ వివాహా మహోత్సవానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరయ్యారు. అంతేకాదు, ఇద్దరూ ఒకే సమయంలో రావడమే కాదు వచ్చి పక్కపక్కన్నే కూర్చున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు కలసి మాట్లాడుకున్నారు. జగన్ చెవిలో కేసీఆర్ ఏదో చెబుతూ కనిపించారు కూడా. జగన్ కూడా కేసీఆర్ ఏదో వివరించారు. ఇదే వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కేంద్రం దగ్గర జగన్‌ అడుక్కుంటున్నారంటూ వారం క్రితమే కామెంట్‌ చేసి కాక రాజేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా ఈ వేడుకలో జగన్ దగ్గరే ఉండటం విశేషం.

అసలు కేసీఆర్‌, జగన్‌ ఏం మాట్లాడుకున్నారా? జలవివాదంపై అక్కడ డిస్కస్‌ చేశారా? కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారా? ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాటాట్‌గా జరుగుతున్న చర్చ. మొన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనూహ్య ఘటనలు జరిగాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. తన భార్య భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ, సభలో జరిగిన పరిణామాలపై తాను మనస్తాపం చెందానంటూ ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన వల్ల కాదంటూ, తాను ఇక భరించలేనంటూ కన్నీళ్లు పెట్టడం దేశవ్యాప్తంగా చర్చగా దారితీసింది. ఈ అంశంపై జగన్‌తో కేసీఆర్ ఏమైనా మాట్లాడారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.

ఇటీవల తెరమీదకు వచ్చిన నీటి వివాదాలు, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అనుసరిస్తున్న తీరు వెనుక మరో పెద్ద రాజకీయ కోణం ఉందని ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఉన్న ఆస్తుల రక్షణ కోసం సీఎం జగన్ మౌనంగా ఉంటున్నారు అని, తెలంగాణ ప్రభుత్వ తీరుతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసీఆర్ తీరును ఎండగడుతున్నాయి. గతంలో తెలుగు రాష్ట్రాలు నీటి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని, నదుల అనుసంధాన ప్రక్రియ చేద్దామని కేసీఆర్, జగన్‌తో ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందన్న ఊహాగానాలు తెర మీదికి వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణతో కలిసి ముందుకు సాగే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సీఎం జగన్ భావించారన్న ప్రచారమూ జరిగింది.

ఒకవిధంగా ఆలోచిస్తే సీఎం జగన్, సీఎం కేసీఆర్ ఇద్దరూ మొండివాళ్లే. సమ ఉజ్జీలే, తాము ఏది అనుకుంటే అది జరిగి తీరాలి అనుకునే నేతలే. పట్టిన పట్టు వదలకుండా ప్రయత్నం చేసే వాళ్లే. అలాంటి ఇద్దరి మధ్య సఖ్యత లోపించిందని అనుకోవడం కరెక్ట్‌ కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంటున్న జల వివాదాలు తారాస్థాయికి చేరుతున్నా కేసీఆర్‌, జగన్‌ మధ్య మైత్రికి ఎలాంటి ఢోకా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అన్ని విషయాల్లో ఇరువురు కలిసి నడుస్తున్నారనే ప్రతిపక్షాల వాదనకు ఇరువురి సీఎంల మాటామంతి రుజువు చేసిందన్న టాక్‌ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories