లాక్ డౌన్ ఉంటే ప్రభుత్వం ప్రకటిస్తుంది: తలసాని కార్యాలయం స్పష్టీకరణ
ప్రధానంగా హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక రోజు ఓ అధికారి ప్రకటించారని, మరో రోజు ఇంకో మంత్రి అన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారని, లాక్ డౌన్ విధించడం ఖాయమని పుకారు రేగింది. అయితే దీనిపై తలసాని కార్యాలయం వివరణ ఇచ్చింది. లాక్ డౌన్ ఉంటుందని మేము చెప్పడం లేదని, అలాంటిదేమైనా ఉంటే ప్రభుత్వమే ప్రకటిస్తుందని వివరణ ఇచ్చింది.
తెలంగాణలో మళ్ళీ లాక్ డౌన్ విధించబోతున్నారా…?కేసులు ఎక్కువగా ఉన్నందున గ్రేటర్ లో అయినా సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారా…? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అవును అన్నారు అంటూ న్యూస్ హల్ చల్ చేసింది. తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ అంటూ వార్త వ్యాపించింది.
అయితే దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్ స్పందించింది. తెలంగాణ లో మరోసారి లాక్ డౌన్ ప్రతిపాదన అయితే ఇప్పటి వరకు లేదని…. అలాంటిది ఏమైనా ఉంటే ప్రభుత్వం ప్రకటిస్తుందని స్పష్టం చేసింది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ వేస్తారని… కనీసం గ్రేటర్ హైదరాబాద్ వరకు అయినా ఉంటుంది అని, ఒకటి రెండు రోజుల్లో సర్కార్ ప్రకటన చేస్తుందని వ్యాఖ్యానించారు అని ప్రచారం జరిగింది. దీనిపై మంత్రి ఆఫీస్ వివరణ ఇచ్చింది.




