గాంధీలో పరారైన ఖైదీల కోసం ముమ్మర గాలింపు.. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు

గాంధీలో పరారైన ఖైదీల కోసం ముమ్మర గాలింపు.. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు
x
Highlights

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి నుంచి పారిపోయిన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మొత్తం 16 బృందాలు నిందితుల ఆచూకీ కోసం...

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి నుంచి పారిపోయిన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మొత్తం 16 బృందాలు నిందితుల ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నాయి. తప్పించుకుపోయిన వారు కోవిడ్ పేషెంట్స్ కావటంతో మరింత ఆందోళన వ్యక్తమౌతుంది. వారివల్ల ఇతరులకు వైరస్ సోకే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఖైదీల ఆచూకీ తెలిపిన వారికి నజారానా ప్రకటించారు పోలీసులు. ఇక మరోవైపు గాంధీలో భద్రతాడొల్ల తనం ఈ ఘటనతో మరోసారి తేటతెల్లమయ్యింది.

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్‌ వార్డు నుంచి పరారైన నలుగురు కరోనా పాజిటివ్‌ ఖైదీల కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలింపు మొదలుపెట్టాయి. ప్రిజనర్స్‌ వార్డు సెంట్రీ కానిస్టేబుల్‌ అమిత్‌ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు ఐపీసీ 224 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేశారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్కార్ట్, చిలకలగూడ పోలీస్‌తో పాటు లోకల్‌ స్టేషన్స్ కు చెందిన మొత్తం 16 బృందాలు ఖైదీల ఆచూకీ కోసం నగరం నలుమూలల జల్లెడ పడుతున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడిన నలుగురు ఖైదీలు అబ్దుల్‌ అర్బాజ్, మహ్మద్‌ జావీద్, సోమసుందర్, నర్సయ్యలను జైలు అధికారులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్‌ వార్డులో అడ్మిట్‌ చేయగా, బాత్‌రూం కిటికీ గ్రిల్స్‌ తొలగించి పరారయ్యారు.

ఇక ఆస్పత్రి ప్రాంగణంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఖైదీల పరారీకి సంబంధించిన ఫుటేజీ లభించలేదు. గతంలోనూ ఆస్పత్రి ప్రిజనర్‌ వార్డు నుంచి మైలార్ దేవ్ పల్లికి చెందిన విక్కీ ఇక్కడే రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తూ తప్పించుకుపోయాడు. ప్రిజనరీ వార్డు దగ్గర జైళ్లశాఖకు చెందిన పోలీసులు, ఆసుపత్రి సెక్యూరిటీ భద్రతను పర్యవేక్షిస్తారు. అయినా ఖైదీలు ఈజీగా తప్పించుకోవవటంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలొస్తున్నాయి.

ఇక పారిపోయిన ఖైదీలు కోవిడ్ పాజిటివ్ రోగులు కావటం మరో ఆందోళనకర అంశం. దీంతో నలుగురు ఖైదీల ఫోటోలు విడుదల చేసిన పోలీసులు ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని ప్రకటించారు. సమాచారం తెలిసిన వారు పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ తో పాటు గోపాలపురం ఏసీపీ, చిలకలగూడ సీఐకి ఫోన్‌ చేసి నమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇక గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పైనా ఆందోళన వ్యక్తమౌతుంది. ప్రమాదకర ఖైదీలు చికిత్స పొందే వార్డుల దగ్గర కనీస భద్రత లేదని విమర్శలు వస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories