డెంటిస్ట్‌ హుస్సేన్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం

డెంటిస్ట్‌ హుస్సేన్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం
x
Highlights

హైదరాబాద్‌ ఎక్సైజ్‌ కాలనీలో డెంటిస్ట్ హుస్సేన్‌ కిడ్నాప్‌ కేసును ఛేదించారు పోలీసులు. విషయం తెలియగానే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం నిందితులను...

హైదరాబాద్‌ ఎక్సైజ్‌ కాలనీలో డెంటిస్ట్ హుస్సేన్‌ కిడ్నాప్‌ కేసును ఛేదించారు పోలీసులు. విషయం తెలియగానే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం నిందితులను పట్టుకోవడంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. కిడ్నాప్‌ అయిన కొన్ని గంటల్లోనే గ్యాంగ్‌లోని కొందరు నిందితులను అరెస్ట్ చేశారు.

నిన్న సాయంత్రం హైదరాబాద్‌ ఎక్సైజ్‌ కాలనీలో డెంటిస్ట్‌ హుస్సేన్‌ను కిడ్నాప్ చేసింది ఓ ముఠా. రాత్రి అయినా ఇంటికి హుస్సేన్ తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్లు అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబుకు సమాచారమిచ్చారు హైదరాబాద్‌ పోలీసులు.

ఎస్పీ సత్యయేసుబాబు కిడ్నాపర్ల కదలికపై జిల్లా పోలీసులను అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. తపోవనం దగ్గర తనిఖీలు చేస్తుండగా ఓ వాహనం ఆగకుండా వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు దానిని వెంబడించారు. రాప్తాడు మండలం బుక్కచర్ల దగ్గర చేజ్ చేసి వాహనాన్ని పట్టుకున్నారు పోలీసులు.

ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి డెంటిస్ట్‌ హుస్సేన్‌ను రక్షించారు అనంత పోలీసులు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. కిడ్నాపర్‌ నుంచి రివాల్వర్, కత్తి, మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకకు చెందిన కిడ్నాప్‌ గ్యాంగ్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు పరారైనవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ ఎక్సైజ్‌ అకాడమీ దగ్గరలోని క్లినిక్‌ నుంచి తనను ఎత్తుకెళ్లారని అంటున్నారు బాధితుడు హుస్సేన్. తొలుత ఓ గదిలో నిర్బంధించారని ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించారు. కొంత సమయం తర్వాత చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి ముఖానికి ముసుగు వేసి కారులో ఎక్కించారన్నారు. అసలు ఎవరు ఎందుకోసం కిడ్నాప్‌ చేశారో తెలీదని చెబుతున్నారు బాధిత డాక్టర్ హుస్సేన్.

Show Full Article
Print Article
Next Story
More Stories