Top
logo

ఆల్‌ఫ్రీ వాగ్దానాలు ఏమేరకు సక్సెస్‌ అవుతాయి?

ఆల్‌ఫ్రీ వాగ్దానాలు ఏమేరకు సక్సెస్‌ అవుతాయి?
X
Highlights

గ్రేటర్‌ ఓటర్లపై కానుకల వాన కురుస్తోంది. వరాల జల్లు పడుతోంది. బల్దియా దంగల్‌లో గెలిచి, పీఠం ఎక్కేందుకు నానా...

గ్రేటర్‌ ఓటర్లపై కానుకల వాన కురుస్తోంది. వరాల జల్లు పడుతోంది. బల్దియా దంగల్‌లో గెలిచి, పీఠం ఎక్కేందుకు నానా పాట్లు పడుతున్న పార్టీలు అన్నీ ఉచితాలనే ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్‌ నుంచి కారుకు గట్టి పోటీ తామే అంటున్న కమలం పార్టీ, ఉనికి కాపాడుకునే యత్నంలో ఉన్న హస్తం పార్టీ వరకూ ఎవరూ తక్కువ తినలేదు. ఉచిత వరాల జాడ్యాన్ని ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ప్రజల మీదికి వదులుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ వాగ్దానాలను తుంగలో తొక్కిన సందర్భాలు ఉన్నా ఈ విషయం ప్రజలు అంతగా నమ్మరని తెలిసినా పార్టీలు కురిపిస్తున్న వరాల జడివానను చూసి తెలంగాణ అంతా నివ్వెరపోతోంది. ఇంతకీ ఏంటీ ఉచితాలు ఏంటీ తాయిలాలు? ఆల్‌ఫ్రీ వాగ్దానాలు ఏమేరకు సక్సెస్‌ అవుతాయి?

ఇదొక ఎన్నికల తంత్రం అంతే. మాఫీలన్నీ గ్రేటర్ పీఠం కోసమే. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే గాలమేయాలి. గాలయమేయాలంటే ఇదే సరైన సమయం. పార్టీల ఆలోచనే ఇది. గ్రేటర్‌ ఎన్నికల వేళ పార్టీలు ప్రకటిస్తున్న తాయిలాలు చూస్తుంటే ముక్కున వేలేసుకోవాలని అనిపిస్తుంది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ఆఫర్ల మీద ఆపర్లను ఇస్తున్నాయి. ఇంటి పన్నులో సగం రాయితీని ప్రకటించడం, గ్రేటర్ ఉద్యోగులకు వేతనాలు పెంచడం, నీటి బిల్లులు మాఫీ చేయడం వంటివి చూస్తూ సగటు హైదరాబాద్ వాసి ఆలోచనలో పడ్డాడు.

ఇప్పుడు బీజేపీ అంతే. అన్నీ ఫ్రీ అనేసింది. విద్యార్థులకు ట్యాబ్‌ ఫ్రీగా ఇచ్చేస్తామన్నది. మహిళలకు మెట్రో, సిటీ బస్సుల్లో ప్రయాణాన్ని ఉచితం చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా గ్రేటర్‌ పీఠమెక్కితే కరోనా టీకాలను అందరికి ఉచితంగా ఇస్తామని ఆఫర్‌ ప్రకటించింది. పదివేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని చెబుతూనే సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని సెంటిమెంట్‌ బాణాన్ని వదిలింది.

ఇక కాంగ్రెస్‌. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నది. అర్హత ఉన్న వారందరికీ రెండు పడకగదుల ఇళ్లు ఉచితంగా నిర్మించి ఇస్తామని చెప్పింది. కేబుల్‌ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాఫీ చేస్తామన్నది. సింగిల్‌ స్క్రీన్‌ సినిమా హాళ్లకు పన్ను మినహాయింపు ఇస్తామని చెబుతూనేమాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తామని హామీనిచ్చింది.

ఇలా.. ఉచిత వరాల జల్లులో గ్రేటర్‌ ఓటరు తడిసిముద్దవుతున్నాడు. రుణభారం, వృద్ధిరేటు అంశాలను పక్కనపెడుతూ ఉచిత కానుకల వర్షంలో మునిగి తేలుతున్నాడు. ప్రజలకు ఉపాధి వ్యాపార అవకాశాలు పెరిగి స్థిరాదాయాలు లభించే ఏర్పాటు చేసి వారి జీవన ప్రమాణాలు, జీవన నాణ్యత పెంచేలా కృషి చేయాల్సిందిపోయి ఈ దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్మరిస్తూ ఎన్నికల్లో గెలవడం కోసం ఇస్తూ తాత్కాలిక లబ్ధి కోసం తాపత్రయపడుతున్నారు.

పౌరుల కోసం సంక్షేమ చర్యలు చేపట్టే అధికారాన్ని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు ఇస్తున్నాయి. కాబట్టి, ఎన్నికల ప్రణాళికలో అలాంటి చర్యలకు హామీ ఇవ్వడం తప్పు కాదు. కానీ, అవి ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఎన్నికల ప్రక్రియను కలుషితం చేసేలా ఉండకూడదు. సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధులు ఎలా సమకూర్చుకునేదీ ఎన్నికల ప్రణాళికలో వివరించాలి. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఓటర్లకు ఇవ్వాలి. దీనివల్ల పారదర్శకతతో పాటు పార్టీల వాగ్దానాలకు విశ్వసనీయత ఏర్పడుతుంది.

ఏ పథకాలైనా ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేవిగా, సామాజిక ఉన్నతికి దోహదపడేలా ఉండాలే కానీ వారిని మరింత బద్ధకస్తులుగా మార్చకూడదు. ఓటర్లకు ఉచిత కానుకలు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కాకపోవచ్చు. కానీ, ఆర్థికంగా దీర్ఘకాలంలో అవి కీడు చేస్తాయి. ఈ ప్రమాదం గురించి తెలిసి కూడా రాజకీయ పార్టీలు ప్రజలకు వరాలు గుప్పించడం నైతికంగా సమర్థనీయం కాదనేదే విశ్లేషకుల మాట.

Web TitleHow Successful are manifesto Promises from leaders for ghmc elections
Next Story