తండ్రి ఇంటి వద్ద అవంతి ఆందోళన

తండ్రి ఇంటి వద్ద అవంతి ఆందోళన
x
Highlights

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు గాను ఓ యువకుడిని అత్యంత దారుణంగా చంపేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ...

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు గాను ఓ యువకుడిని అత్యంత దారుణంగా చంపేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో దారుణ హత్యకు గురైన హేమంత్‌కు, అతని కుటుంబానికి న్యాయం జరగాలంటూ అతని సన్నిహితులు, స్నేహితులు కోరారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా 'జస్టిస్ ఫర్ హేమంత్' కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన కార్యక్రమంలో హేమంత్‌ భార్య అవంతి, సోదరుడు సుమంత్‌, సీపీఐ నారాయణ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అందరూ హేమంత్ ఇంటి వద్ద గుమిగూడి అక్కడి నుంచి అవంతి తండ్రి లక్ష్మారెడ్డి నివాసం వైపు నిరసనకారులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

కాగా చందానగర్ కి చెందిన హేమంత్ ఓ అమ్మాయిని గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు.. ఈ విషయం సదరు యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ అమ్మాయికి గత కొంతకాలంగా ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్‌ 10వ తేదీన వారిద్దరూ బయటకి వచ్చి బీహచ్‌ఈఎల్‌ సంతోషీమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈ పెళ్లిని యువతి తల్లిదండ్రులతో పాటుగా బంధువులు కూడా వ్యతిరేకించారు.. ఈ తరుణంలో వాళ్ళిద్దరూ గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో నివాసం ఉంటున్నారు. అయితే నిన్న(గురువారం) 3 గంటల సమయంలో యువతి బంధువులు మరియి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్‌ ఇంటికి వచ్చి వారిని బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లారు. అందులో హేమంత్ భార్య తప్పించుకోగా, హేమంత్ ని తీసుకువెళ్ళారు.

జరిగిన విషయాన్ని హేమంత్ తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్న క్రమంలో హేమంత్‌ శవమై కనిపించాడు. అయితే ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతోనే యువతి తండ్రి ఈ హత్య చేయించాడని హేమంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కన్నకొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీనిపైన కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హేమంత్ కి తల్లిదండ్రులుతో పాటుగా సుమంత్ అనే సోదరుడు ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories