Heavy Rains: 48 గంటలుగా ఎడతెరిపి లేని వాన.. మరో నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

Heavy Rains In Telugu States
x

Heavy Rains: 48 గంటలుగా ఎడతెరిపి లేని వాన.. మరో నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

Highlights

Heavy Rains: తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు కుండపోత

Heavy Rains: అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్‌, 7 జిల్లాలకు ఆరెంజ్‌, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. సియర్‌ సూన్‌ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెంలో 11.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గార్ల సమీపంలోని పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాంపురం-మద్దివంచ గ్రామ పంచాయతీల మధ్య రాకపోకలు నిలిపివేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పాలెం ప్రాజెక్ట్‌ ప్రధాన కాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది. అధికారులు గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ సంతరించుకున్నది.

భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. 38.50 అడుగులకు నీటిమట్టం చేరింది. తుపాకులగూడెంలో 49 గేట్లు ఎత్తివేతి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క-సాగర్ బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 7.20 లక్షల క్యూసెక్కులకు నీటిమట్టం చేరింది. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ వద్ద పంపింగ్ నిలిపివేశారు. తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. 17 గేట్లు ఎత్తి 47,437 క్యూసెక్స్ నీటిని విడుదల చేశారు. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులన్నీ నిండుకుండలా మారి జలకళ సంతరించుకున్నాయి.

సింగూరు ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. సింగూరు ఇన్ ఫ్లో- 2వేల 847 క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో- 405 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి సామర్థ్యం- 18.640 టీఎంసీలకు చేరుకుంది. కడెం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 4వేల 280 క్యూసెక్కులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 689.42 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు.

ఇటు ఏపీలో వానలు ఊపందుకున్నాయి.. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడు రుతుపవనాలు కూడా స్పీడ్ అందుకున్నాయి. అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలోనే అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటు రుతపవన ద్రోణి తూర్పు భాగం కటక్‌ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఈ ప్రభావంతో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల.. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి, రెండు చోట్ల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు 7.8 సెంటీమీటర్లు.. పాడేరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 6, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 5.8, పాలకొండలో 5.4, ఏలూరు జిల్లా కుక్కనూరుల 5.3, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్ కోటలో 4.9, పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో 4.8, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories