భాగ్యనగరంలో హై అలర్ట్.. రంగంలోకి దిగిన DRF అండ్ రెస్క్యూ టీమ్స్‌

భాగ్యనగరంలో హై అలర్ట్.. రంగంలోకి దిగిన DRF అండ్ రెస్క్యూ టీమ్స్‌
x
Highlights

హైదరాబాద్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో జోరువాన బీభత్సం సృష్టిస్తోంది. జోరువానకు ఈదురు గాలులు కూడా తోడవడంతో హైదరాబాద్ నగరం...

హైదరాబాద్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో జోరువాన బీభత్సం సృష్టిస్తోంది. జోరువానకు ఈదురు గాలులు కూడా తోడవడంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా కుండపోత వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తోన్న గాలివానకు భాగ్యనగరం కకావికలమవుతోంది. మరోవైపు, భారీ శబ్దాలతో ఉరుములు ఉరమడంతో హైదరాబాదీలు భయంతో బెంబేలెత్తిపోయారు. పిడుగులు పడుతున్నాయేమోనని వణికిపోతున్నారు. ఆకాశం విరిగి మీదపడుతుందన్న రేంజులో ఉరుములు ఉరుముతున్నాయి. ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు కుండపోత వర్షంతో హైదరాబాద్లో జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది.

కుండపోత వర్షంతో హైదరాబాద్ మహానగరం కకావికలమవుతోంది. ఎగతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షంతో హైదరాబాద్‌లో రోడ్లు కాలువలను చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రధాన రహదారులపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్లయితే, రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో వరద నీటిలో వాహనాలు ఇరుక్కుపోయాయి. మరోవైపు, భారీ ట్రాఫిక్ జామ్స్ తో హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. హైదరాబాద్‌లో దాదాపు అన్నిచోట్లా 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడటంతో జనజీవనం స్తంభించిపోయింది.

ఏకధాటిగా కురుస్తోన్న కుండపోత వర్షానికి హైదరాబాద్‌ మహానగరం అల్లాడిపోతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, బోరబండ, అమీర్ పేట్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, హిమాయత్ నగర్, బోయిన్ పల్లి, ఫతేనగర్, మాసబ్ ట్యాంక్, మెహిదీ పట్నం, నాంపల్లి, అబిడ్స్, కోఠి, మలక్ పేట, ముషీరాబాద్ ఇలా నగరమంతటా గాలివాన దంచికొడుతోంది. గాలివానకు పలుచోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. దాంతో, GHMC డీఆర్ఎఫ్ అండ్ రెస్క్యూ టీమ్స్‌ రంగంలోకి దిగాయి.

కుండపోత వర్షంతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ కాలువల్లా మారిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపోయాయి. కూడళ్ల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ కావడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ఇక, పని ముగించుకుని ఇళ్లకు బయల్దేరిన ఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వర్షపు నీరు నిలిచేచోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ పార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా రోడ్లు, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే విద్యుత్ అధికారులకు తెలియచేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్నా వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఉన్నా స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తోపాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories