Adilabad: తొలకరి పలకరింపుతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు

Adilabad: ఎరువుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న రైతులు

Shekhar G
Published on: 28 Jun 2023 5:41 PM IST
Farmers Who Started The Cultivation Work With First Greetings
X

Adilabad: తొలకరి పలకరింపుతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు

Adilabad: వానాకాలం మొదలవ్వడంతో సాగుకు సిద్ధమయ్యారు రైతన్నలు. దుక్కులు దున్ని, విత్తనాలు వేసే పనిలో బిజీ అయ్యారు. తొలకరి పలకరింపుతో వ్యవసాయ పనులకు ఉపక్రమించారు. వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమయ్యారు. ఈసారి పత్తి వైపే అధ్యధికులు ఆసక్తి చూపుతున్నారు. గత ఖరీ‌ఫ్ సీజన్ తో పోల్చుకుంటే ఈసారి జిల్లాలో పత్తి పంట విస్తీర్ణం పెరగనుంది. ఈ సీజన్ లో 2లక్షల 55వేల 608 ఎకరాల్లో పలు పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు పడుతుండటంతో పలు పంటలు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో స్పీడ్ పెంచారు. పలువురు రైతులు ఇప్పటికే దక్కులు సిద్ధం చేసుకొని పత్తి సాళ్ల అచ్చులు కొట్టి పెట్టుకున్నారు. కొన్నిచోట్ల రైతులు పత్తి విత్తనాలు విత్తడం కూడా మొదలు పెట్టారు. అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, కాడెద్దులతో దుక్కులు దున్నుతున్నారు. చాలా మంది రైతులు యంత్రాలతోనే వ్యవసాయ పనులు చేపడుతున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, జిల్లాలో రైతులు పత్తి సాగుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు.

వరి సాగు తర్వాత ఆరుతడి పంట అయిన పత్తి వైపే మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటం, వర్షాభావ పరిస్థితులు, కనీస దిగుబడి, మార్కెట్‌ భద్రతా ఇతరత్రా అంశాలన్నింటినీ బేరీజు వేసుకుంటూ.. తెల్ల బంగారాన్ని పండించేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. గత వానాకాలంతో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు అదనంగా 28వేల 955 ఎకరాల విస్తీర్ణం పెరగనుంది.

జిల్లాలో పంటల సాగుకు సరిపడా యూరియా అందుబాటులో లేదని తెలుస్తోంది. ఈ వానాకాలం మొత్తంగా 31వేల 340 టన్నులు అవసరముండగా ఇప్పటి వరకు 4వేల 856 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఏప్రిల్‌, మే నెలల్లోనే జిల్లాకు రావాల్సిన ఎరువులు లక్ష్యం మేరకు చేరలేదు. యూరియాతో పాటు డీఏపీ, పోటాష్‌, కాంప్లెక్స్‌, సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ ఎరువులను ప్రభుత్వం సీజన్‌కు ముందుగానే సిద్ధంగా ఉంచాల్సి ఉండగా వీటిని అవసరమైన మేరకు నిల్వ చేయలేదు. స్వల్ప స్థాయిలో నిల్వ ఉంచడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. త్వరలోనే యూరియా వస్తుందని అధికారులు చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదని రైతులు అంటున్నారు.

ఫర్టిలైజర్‌ షాపుల్లో వ్యాపారులు ఎమ్మార్పీకి మించి ధరలను తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే బిల్లు తప్పని సరిగా ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కూడా అది అమలు కావడం లేదు. ఇక పల్లెల్లో అనుమతులు లేని ఫర్టిలైజర్‌ షాపులను కొందరు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులను విక్రయిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఈ దందా సాగతుండగా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఖరీఫ్ పనులు ప్రారంభమవుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పర్యటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పు సాకుతో దళారులు ఇచ్చే విత్తనాలను, ఎరువులనే రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే రైతులు కోరుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story