డీఎస్‌ సైలెంట్‌గా ప్లే చేసిన పొలిటికల్‌ స్క్రీన్‌ ప్లే ఏంటి?

డీఎస్‌ సైలెంట్‌గా ప్లే చేసిన పొలిటికల్‌ స్క్రీన్‌ ప్లే ఏంటి?
x
Highlights

ఆయన రాజకీయ కురువృద్దుడు...మూడు దశాబ్దాలుగా జాతీయ స్ధాయిలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షునిగా ఉండి, రెండుసార్లు కాంగ్రెస్...

ఆయన రాజకీయ కురువృద్దుడు...మూడు దశాబ్దాలుగా జాతీయ స్ధాయిలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షునిగా ఉండి, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన రాజకీయ చతురత ఆయనది, అంతటి రాజకీయ చాణక్యం ఉన్న ఆ నాయకున్ని, ఒక పార్టీ అవమానించింది. ఆయన పరువు, ప్రతిష్టను కోల్పోయేలా చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల పేరుతో, పార్టీ నుంచి సాగనంపేలా తీర్మానం చేసింది. దీంతో అవమానభారంతో కుమిలిపోయిన ఆ నేత, సమయం కోసం వేచిచూశారు. అవమానించిన పార్టీకి, నాయకురాలికి తన కుమారుని ద్వారా రిటర్న్ గిప్ట్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా నేతా ఆయన ఇచ్చిన రిటర్న్ గిప్ట్ ఏంటి సైలెంట్‌గా ప్లే చేసిన పొలిటికల్ స్క్రీన్‌ ప్లే ఏంటి?

డి.శ్రీనివాస్..ఒకప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో రాజకీయ చాణక్యం రంగరించిన నాయకుడు, తన కుమారుడు అర్వింద్‌ గెలుపుకు పరోక్షంగా కారణమైన ఫాదర్, తనను అవమానించినవారికి రిటర్న్‌ గిఫ్ట్ ఇచ్చిన పొలిటికల్ చాణక్యుడు. నిజామాబాద్ ఎంపీగా బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ గెలుపులో కీలకపాత్ర పోషించారు, టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి తన కుమారునికి రాజకీయ జీవితం ప్రసాదించారు డి.ఎస్.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన డి.శ్రీనివాస్, తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని కుమిలిపోయారు. దీనికి తోడు, తన కుమారుడు బీజేపీలో చేరడం టీఆర్ఎస్ నేతలను కలవరానికి గురిచేసింది. ఫలితంగా కవిత నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై, డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేస్తూ అధినేతకు లేఖ పంపారు. ఐతే అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. గులాబీ పార్టీలో కవిత చేసిన అవమాన భారంతో కుమిలిపోయిన డి.ఎస్, కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. సమయం కోసం వేచిచూసిన ఆయన ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన రాజకీయ చతురత ప్రదర్శించి కవిత ఓటమికి పరోక్ష కారణమయ్యారు.

ధర్మపురి అర్వింద్ గెలుపులో డి. శ్రీనివాస్ రొటీన్ రాజకీయాలకు భిన్నంగా మంత్రాంగం నడిపారు. పార్టీ మారకుండానే, టీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే కొడుకు విజయం కోసం పనిచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బోధన్ నుంచి జగిత్యాల వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అసంతృప్తులను బుజ్జగించి మంత్రాగం నడిపారు. కొడుకును గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న డి.ఎస్, గ్రౌండ్ వర్క్ మొత్తం అన్నీ తానై చూసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. మున్నూరు కాపు సామాజికవర్గాన్ని ఏకం చేయడంతో పాటు కాంగ్రెస్ ఓటు బీజేపీకి డైవర్ట్ అయ్యేలా ఆయన వేసిన స్కెచ్ వర్కౌట్ అయ్యింది. ఫలితంగా, నిజామాబాద్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది.

ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితను ఓడించి, ధర్మపురి అర్వింద్ కమలం పార్టీలో జాతీయస్ధాయి నేతల ప్రశంసలు అందుకున్నారు. తండ్రికి తగ్గ వారసునిగా గుర్తింపు పొందారు. కేసీఆర్ కూతురు కవితను ఓడించిన అర్వింద్‌కు ఎంత పేరు వచ్చిందో, అర్వింద్ గెలవడంలో ప్రధాన పాత్రధారునిగా ఉన్న డి.ఎస్.కూ అంతే పేరొచ్చింది. కవిత పని గట్టుకుని పార్టీ నుంచి సాగనంపేందుకు తీర్మానం చేయించారని రగిలిపోయిన డి.ఎస్, తన కొడుకు ద్వారా కవితను ఓడించి, ఆ పార్టీకి రిటర్న్ గిప్ట్ ఇచ్చారని ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

కుమారుడు ధర్మపురి అర్వింద్ దూకుడుకు తోడు, తండ్రి రాజకీయ చతురత ఆయన్ను విజయతీరాల వైపు చేర్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనను అవమానించిన టీఆర్ఎస్ పార్టీకి కొడుకు ద్వారా డి.ఎస్. గుణపాఠం చెప్పారని, ఇటు టీఆర్ఎస్‌లో ఉన్న కోవర్టులూ సంబర పడుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యునిగా ఉన్న డి. శ్రీనివాస్, త్వరలో బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అనుకుంది అనుకున్నట్లు జరిగితే ఆయన కాషాయ జెండా కప్పు కోవడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. రాజ్యసభ పదవికి సమానంగా బీజేపీలో కీలక పదవి అప్పగిస్తే, పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమికి, అనేక కారణాలు ఉండగా, ధర్మపురి అర్వింద్ గెలుపులో ఆయన తండ్రి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడి పాత్ర కీలకం అన్నది జగమెరిగిన సత్యం. టీఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీ ఎంపీగా తన కుమారున్ని గెలిపించుకున్న డి.ఎస్. రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories