Mother's Milk Bank: తల్లిపాలు అందక ఆకలితో తల్లడిల్లుతున్న పసికందులు.. అండగా నిలుస్తున్న ధాత్రి మిల్క్ సెంటర్..
Mother's Milk Bank: 2017లో నీలోఫర్ హాస్పిటల్ లో ధాత్రి మిల్క్ బ్యాంక్ ప్రారంభం
Mother's Milk Bank: తల్లిపాలు అందక ఆకలితో తల్లడిల్లుతున్న పసికందులు.. అండగా నిలుస్తున్న ధాత్రి మిల్క్ సెంటర్..
Mother's Milk Bank: పిల్లలకు అమ్మపాలు అమృతం లాంటివి. అంతేకాదు ఆరోగ్యం కూడా. అప్పుడే పుట్టిన బేబీకి తల్లిపాలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. అయితే కొంత మంది తల్లులకు అనారోగ్య కారణాలతో పాలు పడకపోవడంతో అప్పుడే పుట్టిన శిశువులకు తల్లిపాలు దూరమవుతున్నాయి. అలా తల్లిపాలు అందని చిన్నారుల కోసం ఏర్పడ్డదే ధాత్రి మిల్క్ సెంటర్.
అనేక కారణాలతో అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలు అందడం లేదు. పురిటిలోనే తల్లి చనిపోవడం... తల్లులకు సరిగా పాలు రాకపోవడం లాంటి కారణాలతో నవజాత శిశువులు అమ్మపాలు అందక అల్లాడుతున్నారు. అలాంటి వారి కోసం నీలోఫర్ హాస్పిటల్‌లో మదర్స్ మిల్క్ సెంటర్ ఏర్పాటు చేశారు. శిశువుల అనారోగ్యం, సిజేరియన్ కారణాల వల్ల తల్లి బిడ్డ వేరు వేరు చోట ఉండవలసి వచ్చిన సమయాల్లోనూ పసికందులకు అండగా నిలుస్తున్నారు.
కొంత మంది తల్లులకు పౌష్టికాహార లోపంతో పాలు పడవు. అలాంటి తల్లులు తమ బిడ్డకు పాలివ్వలేకపోతున్నామని కృంగిపోతారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ధాత్రి మిల్క్ సెంటర్.. మేం అండగా ఉన్నామంటూ తల్లిబిడ్డను అక్కున చేర్చుకుంటోంది. తల్లికి పాలు వచ్చే విధంగా మసాజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలా ఎంతో మందిని ఆదుకొని తల్లుల మొహంలో చిరునవ్వులు నింపుతున్నారు. పసికందుల ఆకలి తీరుస్తున్నారు.
ఏ బిడ్డ ఆకలితో అల్లాడినా... ఓ తల్లి మనసు విలవిలమంటుంది. అందులోనూ అప్పుడే పుట్టిన పసికందు తల్లి పాలు అందక ఆకలితో తల్లడిల్లిపోతుంటే ప్రతీ అమ్మ హృదయం కరిగిపోతుంది. అలాంటి అమ్మల హృదయాన్ని అర్థం చేసుకున్న ధాత్రి మిల్క్ బ్యాంక్ పసికందుల ఆకలిని తీరుస్తుంది. పుట్టగానే అనాధలుగా మారిన పసికందులకు అమ్మ ప్రేమను పంచుతోంది. ఎక్కువ పాలిచ్చే తల్లుల నుంచి పాలు సేకరించి వాటిని పాయిస్చరైజేషన్ చేసి పాలు రాని తల్లుల పిల్లలకు ఇస్తోంది.
అప్పుడే పుట్టి తల్లిపాలకు నోచుకోని నవజాత శిశువుల్లో న్యుమోనియా, డయేరియాతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు అధికం అంటున్నారు డాక్టర్లు. అందుకోసం ఏ బిడ్డా తల్లిపాల కొరతను ఎదుర్కోకూడదని... ఏ నవజాత శిశువూ పోషకాహార లోపంతో అవస్థ పడకూడదనే ఓ గొప్ప ఆలోచనతో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటైంది. నెలలు నిండక ముందే తక్కువ బరువుతో జన్మించి, తల్లికి దూరంగా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందే శిశువుల పాలిట ధాత్రి- తల్లిపాల నిధి ఓ వరంగా మారింది.
మొదట నీలోఫర్ హాస్పిటల్‌లో ప్రారంభించిన ధాత్రి మిల్క్ సెంటర్ సక్సెస్ కావడంతో హైదరాబాద్ లోని పేర్లుబుజ్జు, కోఠి మెటర్నిటి హాస్పిటల్ తో పాటు కొండాపూర్ హాస్పిటల్ లో మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. ఈ ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ అనేది కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ గా కూడా పని చేస్తుంది. చనుబాల సమస్య ఉన్న తల్లులతో ఇక్కడ ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. కాలి బొటనవేలి నుంచి తల వరకూ సున్నితమైన మసాజ్ చేస్తారు. ప్రత్యేకమైన డైట్ సూచిస్తారు. త్వరగా పాలు పడేలా చొరవ తీసుకుంటారు.
నీలోఫర్ హాస్పిటల్ లోని ధాత్రి మిల్క్ బ్యాంకును 2017లో ప్రారంభించారు. అవగాహన లేని తల్లులకు పెద్దవారితో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. మొదట్లో మదర్స్ సెంటర్ పెట్టినప్పుడు తల్లి పాలు ఇవ్వడానికి, తీసుకోవడానికి చాలా ఆలోచించే వారు. కౌన్సిలర్ తో అవగాహన కల్పించడంతో ఇప్పుడు ప్రతీ ఒక్కరు తీసుకునేందుకు సుముకత చూపుతున్నారని డైరెక్టర్ అంటున్నారు. డబ్బా పాల కంటే, తల్లి పాలు ఎంతో శ్రేయస్కరమని వారికి తెలియ చెప్పడానికి చాలా సమయం పట్టిందంటున్నారు. ఇప్పుడు అందరిలో అవగాహన వచ్చి చాలా మంది పాలు పట్టడానికి మదర్స్ సెంటర్ కి వస్తున్నారని చెబుతున్నారు.
అయితే పాలు సేకరించే తల్లులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి... వారికి ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారణ జరిగిన తరువాతే పాలను సేకరించడం ప్రారంభించారు. ఇలా సేకరించిన పాలను ప్రాసెస్ చేసి మైనస్ 20 డిగ్రీల వద్ద భద్రపరుస్తారు. దీంతో వీటిని ఆరు నెలల వరకు వాడుకునే అవకాశం ఉంటుంది.


