అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం : సీఎం కేసీఆర్
పరిస్థితులను బట్టి 20 వ తేదీ తర్వాత ఏమి చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కరోనా పరిస్థితుల పై ఈరోజు (బుధవారం) ప్రగతి భవన్ లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా అయన
కరోనా వైరస్ సోకిన వారు ఎంతమందైనా పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 514 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 8 మందిని ఇవాళ డిశ్చార్జ్ చేశామని.. రేపు మరో 128 మందిని డిశ్చార్జ్ చేయనున్నట్లు అధికారులు కేసీఆర్‌కు వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు యథావిధిగా లాక్‌డౌన్ కొనసాగుతుందని.. 20వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌లో మార్పులు, చేర్పులు ఉండవచ్చని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు.
వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 259 కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. కరోనా వ్యాధి నిర్ధారించే టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయన్న కేసీఆర్, ఎంతమందికైనా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఇబ్బంది లేదని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో ఐదు లక్షల పీపీఈ కిట్లకు ఇప్పటికే ఆర్టర్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్-95 మాస్కులున్నాయని.. మరో 5 లక్షల ఎన్-95 మాస్కులకు ఆర్డర్ చేశామన్నారు. కరోనా చికిత్స నిమిత్తం రాష్ట్రంలో ఆస్పత్రులు, పడకలు, వెంటిలేటర్లు, వైద్య పరికరాలు, వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా సిద్ధంగా ఉంచినట్టు కేసీఆర్ వెల్లడించారు.




