Moosapeta Metro Station : మెట్రో స్టేషన్ గోడలకు పగుళ్లు

Moosapeta Metro Station : హైదరాబాద్ నగరానికే మనిహారంగా నిలిచిన మెట్రో ఎంతో మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తూ...
Moosapeta Metro Station : హైదరాబాద్ నగరానికే మనిహారంగా నిలిచిన మెట్రో ఎంతో మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రయాణికుల ఆదరాభిమానాలు పొందింది. అంతటి ఆదరాభిమానాలు పొందిన మెట్రో ఇప్పుడు ప్రజలను కాస్త భయాందోళనకు గురి చేస్తుంది. మెట్రో స్టేషన్లో గోడల మీద ఏర్పడిన పగుళ్లతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మూసాపేటలోని మెట్రో స్టేషన్ గోడలతో పాటు స్టేషన్‌పైకి వెళ్లే మెట్లపై కూడా పగుళ్లు ఏర్పడడంతో ప్రయాణికులు జంకుతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి రావడంతో నిర్మాణ సమయంలో నాణ్యతను పాటించారా లేదా అని నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు రేపుతున్నాయి.
ఇక స్టేషన్ పగుళ్లకు సంబందించిన కొన్ని చిత్రాలు, అలాగే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఓ మెట్రో రైల్వే స్టేషన్ గోడలకు పగుళ్లు రావడంతో అధికారులు పగుళ్లను నామమాత్రంగా పూడ్చేసారు. అప్పుడు కూడా ప్రయాణికులు మెట్రోస్టేషన్లకు వెళ్లేందుకు ఇదే విధంగా జంకారు. అంతే కాక గతంలోనే అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద నిలబడిన ఓ యువతిపై పైనుంచి పెచ్చులు పడి మృతి చెందిన విషయం కూడా తెలిసిందే.
ఇక పోతే కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో అయిదు నెలలుగా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్ల సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి మెట్రో రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇన్ని రోజుల పాటు రైళ్లు నడవకుండా, స్టేషన్ల నిర్వహణ లేమి కారణంగా ఈ పగుళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది.