Top
logo

సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ బహిరంగ లేఖ
X
Highlights

Congress MP Revanth Reddy Open Letter To CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మల్కాజ్ ...

Congress MP Revanth Reddy Open Letter To CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మూడు పేజీల లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి రాసిన లేఖ యధాతథంగా..

విషయం : అకాల వర్షాలు- పంట నష్టం- రైతుల కష్టం గురించి...
రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరంగల్‌, భూపాలపల్లి, ములుగు, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్ధిపేట జిల్లాల్లో పంటలు సంపూర్ణంగా దెబ్బతిన్నాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌ లాంటి జిల్లాలు, దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా పంట దెబ్బతిన్న పరిస్థితి ఉంది.

కొడుకు పై ఉన్న ప్రేమ రైతుల పై లేదే...!
క్షేత స్థాయిలో నష్ట తీవ్రత మీకు అర్ధం కావడం లేదో, లేక అర్ధం కానట్టు నటిస్తున్నారో తెలియడం లేదు. బాధ్యత ను పూర్తిగా అధికార యంత్రాంగానికి వదిలేసి మీరు ఫాంహౌస్‌ కే పరిమితం కావడం తీవ్ర ఆక్షేపణీయం. మీ కుమారుడి వారసత్వ ప్రక్రియను. మరింత పటిష్టం చేసుకోవడానికి, భవిష్యత్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడుగా మీ పార్టీ శ్రేణుల్లో అతని గుర్తింపును మరింత పదిలం చేయడానికి ఈ సంక్షోభ సమయాన్ని మీరు, వాడుకున్న తీరు అత్యంత హేయం. మీకు ప్రత్యామ్నాయంగా కేటీఆర్‌ ను చూపించే తాపత్రయం తప్ప, ప్రజల కష్టాలను, రైతుల ఆవేదనను తీర్చే చిత్తశుద్ధి మీ చర్యల్లో ఇసుమంతైనా కనిపించడం లేదు. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ అర్భన్‌ లో షో చేసి, బాధ్యత తీర్చేసుకున్నారు.

రైతు కష్టం తీర్చే ప్రణాళిక ఏదీ...!?
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అన్నదాతకు జరిగిన ఈ నష్టాన్ని పూడ్చేందుకు మీ ముందున్న ప్రణాళిక ఏమిటి? వరి, పత్తి, మిర్చీ, కంది, పెసర, సోయాబీన్‌ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించగా... కిలో కూడా వచ్చే పరిస్థితి లేదని పెసర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు ఈ వర్షాలతో నష్టం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి చేసిన ప్రకటన అత్యంత బాధ్యతారాహిత్యం. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చాలా చోట్ల వరి చేలలో భూమి కోతకు గురైంది. పంట మొత్తం వరదలో కొట్టుకుపోయింది. పొలాలలో ఇసుక మేటలు వేశాయి. ప్రస్తుతం ఆ పొలాలు తిరిగి పంటలు వేసుకోవడానికి కూడా పనికి వచ్చే పరిస్థితుల్లో లేవు. ఇసుక మేటలు తొలగించి, పొలాలను చదను చేసుకుంటే తప్ప తిరిగి వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఓ వైపు పంట నష్టం, మరోవైపు అస్తవ్యస్తమైపోయిన భూములను బాగు చేసుకోవడానికి అయ్యే ఖర్చు రైతుల పాలిట పెనుభారం కాబోతోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్ర పర్యటనకు వెళ్లింది లేదు. మీరు ఘనంగా చెప్పుకునే రైతు సమన్వయ సమితులు ఎక్కడున్నాయో తెలియదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. గతంలో పంటల బీమా పథకం అమలయ్యేది. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కలిసి దాగుడు మూతలు ఆడి ఆ పథకానికి మంగళం పాడాయి. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ప్రస్తుతం రాష్ట్రలో అమలు కావడం లేదు. దీంతో రైతులకు నష్టపరిహారంగా బీమా వచ్చే పరిస్థితి లేదు. రెండేళ్లు రైతులు కట్టిన ప్రీమియం సొమ్ము బీమా కంపెనీ ఖాతాల్లోనే మూలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన రూ. 513.5 కోట్లు చెల్లించనందున బీమా కంపెనీల నుంచి రైతులకు అందాల్సిన రూ.960 కోట్లు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏకంగా పథకాన్నే ఎత్తేశారు. రాష్ట్రంలో ఇన్‌ పుట్‌ సబ్సిడీ అనే మాట విని నాలుగేళ్లవుతోంది.

పూర్తి నష్టం ప్రభుత్వమే చెల్లించాలి...
ప్రస్తుతం జరిగిన నష్టానికి బీమా కంపెనీల నుంచి రైతులకు అణాపైసా వచ్చే పరిస్థితి లేదు. దీనికి పూర్తిగా మీ నిర్వాకమే కారణం. ఫసల్‌ బీమా పథకాన్ని అటకెక్కించారు. దానికి ప్రత్యామ్నాయంగా కొత్త బీమా పథకం ఏదైనా తెచ్చారా అంటే అదీ లేదు. కనుక, ప్రస్తుతం రైతులకు జరిగన నష్టానికి పూర్తి బాధ్యత మీదే. మీ నిర్లక్ష్యం వల్లే పంటల బీమా పథకం అటకెక్కింది. కనుక, మొత్తం నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలి.

డిమాండ్లు :
తక్షణం వ్యవసాయశాఖ మంత్రి క్షేత్ర పర్యటనకు వెళ్లి, త్వరిత గతిన పంట నష్టాన్ని అంచనా వేయించాలి.

నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం అందించాలి.

దీని కోసం రూ.1000 కోట్లు తక్షణం విడుదల చేయాలి.

తిరిగి పంటలు వేసుకోవడానికి విత్తనాలు అందుబాటులోకి తేవాలి.

రాష్ట్రంలో ఎరువుల కొరతను తీర్చాలి.

ఫసల్‌ బీమా పథకాన్ని పునరుద్ధరించాలి లేదా, కొత్త పథకాన్ని అమలు చేయాలి.

ఇసుకమేటతో, భూమి కోతతో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ భూములను బాగు చేసుకోవడానికి ఎకరాకు రూ.5000 ఆర్థిక సాయం చేయాలి.


ఎ రేవంత్‌ రెడ్డి,

ఎంపీ-మల్కాజ్‌ గిరి


Web TitleCongress MP Revanth Reddy Open Letter To CM KCR
Next Story