గాంధీభవన్ మెట్లు ఎక్కనన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మనసు మార్చుకున్నారా..?

Congress MP Komatireddy Venkat Reddy Stepped into Gandhi Bhavan
x

గాంధీభవన్ మెట్లు ఎక్కనన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మనసు మార్చుకున్నారా..?

Highlights

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయనొక ఫైర్ బ్రాండ్‌. నల్గొండ జిల్లా రాజకీయాలను శాసించే వారిలో కీలక నేత.

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయనొక ఫైర్ బ్రాండ్‌. నల్గొండ జిల్లా రాజకీయాలను శాసించే వారిలో కీలక నేత. విద్యార్థి దశ నుండే పార్టీలో కీలకంగా ఎదిగిన వ్యక్తి. పిసిసి అధ్యక్ష పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. పదవి రాకపోవడంతో గాంధీ భవన్ మెట్లు ఎక్కనంటూ శపథం చేశారు. ఇప్పుడా నేత తన మనసు మార్చుకున్నారా..? మళ్ళీ కాంగ్రెస్‌లో యాక్టివ్‌ రోల్‌ పోషించబోతున్నారా? ఇంతకీ ఎవరానేత..?

ఉత్తమ్‌కుమార్‌ తర్వాత తెలంగాణ పిసిస్ చీఫ్ పదవి కోసం చాలా మంది పోటీపడ్డారు. గాంధీభవన్‌ బాస్‌ను ఎంపిక చేయడంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీవ్ర కసరత్తే చేసింది. అనేకానేక చర్చోపచర్చల తరువాత పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించారు. రేవంత్ పీసీసీ చీఫ్‌ కావడాన్నిఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అధిస్థానం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ 50 కోట్లకు పీసీసీ చీఫ్‌ పదవిని అమ్ముకున్నారని బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇక జీవితంలో గాంధీ భవన్ మెట్లు ఎక్కనని, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోనని శపథం చేశారు. దీంతో పార్టీలో గ్రూపు రాజకీయాలు తీవ్రమయ్యాయి. గాంధీభవన్‌ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, సీనియర్ల వర్గాలుగా చీలింది.

కట్ చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హఠాత్తుగా గాంధీ భవన్‌లో వాలిపోయారు. అక్కడ అప్పటికే ధరణి పోర్టల్‌ మీద నడుస్తున్న సమావేశంలో సీనియర్లు ఎవరూ మాట్లాడకుండానే మీడియా సమావేశం నిర్వహించారు. ఒక్కసారిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఫార్మా సిటీ భూములపై తాడో పేడో తేల్చుకుంటామని ప్రభుత్వానికి సవాలు విసిరారు. కేసీఆర్‌ని నడ్డా ఏటీఎం అంటున్నరని..తాను ఎప్పుడో చెప్పానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ప్రధానిని కలిసి ఆధారాలు సమర్పిస్తానని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

మంగళవారం జరిగిన టీ.కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు సీనియర్లకు కొత్త ఉత్సాహాన్ని నింపాయంటున్నారు. ఆ ప్రభావంతోనే గాంధీభవన్‌ సీనియర్‌ నేతలతో కలకళలాడినట్లు కనిపిస్తోంది. ఇకపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ సమస్యలతో పాటు కాంగ్రెస్ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories