కామారెడ్డి కమలంలో ముసలం ఎందుకు?

కామారెడ్డి కమలంలో ముసలం ఎందుకు?
x
Highlights

ఆ జిల్లాలో కమలం పార్టీకి ఎంతో కొంత బలముంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 8 మంది కౌన్సిలర్లు రెండు సార్లు గెలిచిన రికార్డుంది. బలమైన నాయకుడు ముందు నిలబడితే...

ఆ జిల్లాలో కమలం పార్టీకి ఎంతో కొంత బలముంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 8 మంది కౌన్సిలర్లు రెండు సార్లు గెలిచిన రికార్డుంది. బలమైన నాయకుడు ముందు నిలబడితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పీఠం దక్కించుకునే సత్తా కూడా ఉంది. కానీ నాయకత్వ లోపమే ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. ముగ్గురు నేతల కోల్డ్‌వార్‌ రచ్చకెక్కుతోంది. ఏకంగా జిల్లా అధ్యక్షున్ని మార్చాలంటూ కమలం శ్రేణులు ఆందోళన చేసే పరిస్ధితి ఎందుకొచ్చింది.. ? ఆందోళన వెనుక అసలు మతలబు ఏంటి..? క్యాడర్‌కు భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం దృష్టిసారించిందా..? కామారెడ్డి జిల్లా కమలం పార్టీ ముసలం వెనుక, అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.

కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీలో ముసలం రాజుకుంది. ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తోంది. ఒకరు రాష్ట్ర స్ధాయిలో గుర్తింపు ఉన్న నేత కాగా మరొకరు రాష్ట్ర స్ధాయి నాయకులను ప్రభావితం చేయగలిగే నాయకుడు ఇంకొకరు ఇటీవలే మరో పార్టీ నుంచి కాషాయ కండువ కప్పుకున్న నేత..

ఈ ముగ్గురి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. ముగ్గురు కలిసి పనిచేస్తే జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కానీ నేతల మధ్య అనైక్యత, కార్యకర్తల్లో భరోసా నింపే నాయకుడు లేక క్యాడర్ డీలా పడింది. ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకులు పార్టీని గాలికొదిలేశారనే విమర్శలు చెలరేగుతున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో పార్టీ బలంగా ఉన్నా దిశానిర్దేశం చేసే నాయకుడు లేక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధ్యక్షున్ని మార్చాలంటూ కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారంటే, పార్టీ పరిస్ధితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.

కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉన్న బాణాల లక్ష్మారెడ్డిని మార్చాలంటూ మెజార్టీ కార్యకర్తలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే అపవాదు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా వచ్చిపోతుండటం వల్ల, ఆయన వద్దు బలమైన నాయకుడు కావాలంటూ కార్యకర్తలు రోడ్డెక్కారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేశారు.

జిల్లా అధ్యక్షునిగా ఉన్న లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. అధిష్ఠానం అతనికే మళ్లీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలో నిలిపింది. ఆశించిన స్ధాయిలో ప్రచారం చేయకపోవడంతో మరోసారి డిపాజిట్ గల్లంతైంది. ఇలా గత ఎన్నికల్లోనూ ఓడిపోయిన అతనికే మళ్లీ మళ్లీ టికెట్టు ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు కార్యకర్తలు.

మరో నేత హైదరాబాద్‌లో ఉండి కామారెడ్డి పార్టీలో చక్రం తిప్పుతారని క్యాడర్‌లో అసంతృప్తి నెలకొంది. ఆయన చేయరు, చేసే వారికి అడ్డుపడతారనే ఆరోపణలున్నాయి. ఇంకోనేత కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా వ్యవహరించి, బీజేపీలో చేరారు. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బరిలో నిలిచారు. ఓ స్వామీజీ ఆశీస్సులతో పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న సదరు నేత, తన వర్గం ఏర్పాటు చేసుకోవడంతో, ముగ్గురు నేతల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మధన పడుతున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో, ప్రజా సమస్యలపై పోరాటాలు అంతంత మాత్రంగానే మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో 8 మంది కౌన్సిలర్లు గెలిచి రికార్డు సృష్టించగా, ఐదుగురు గులాబీ గూటికి చేరారు. పార్టీ నాయకత్వ లోపం వల్లే నేతలు చేజారుతున్నారనే విమర్శలున్నాయి. కామారెడ్డి జిల్లా అధ్యక్షుని మార్పు కోసం కార్యకర్తలు రోడ్డెక్కే వరకు అధిష్ఠానం వేచి చూడటం వల్లే, పరిస్ధితి చేయిదాటింది. ఇప్పటికైనా జోక్యం చేసుకుని నాయకుల మధ్య సమన్వయం కుదిరి, పగ్గాలు మరొకరికి అప్పగిస్తే కామారెడ్డి మున్సిపాలిటీపై కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని కార్యకర్తలంటున్నారు. ఆ దిశలో బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories