ధరణిపై కేసీఆర్ రివ్యూ : అధికారులకు కీలక సూచనలు

ధరణిపై కేసీఆర్ రివ్యూ : అధికారులకు కీలక సూచనలు
x
Highlights

ధరణి పోర్టల్‌లో ఆప్షన్లు పెంచి మరింత మెరుగుపరుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పోర్టల్ నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు కీలక సూచనలు...

ధరణి పోర్టల్‌లో ఆప్షన్లు పెంచి మరింత మెరుగుపరుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పోర్టల్ నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. సాగుభూముల అంశాల్లో నెలకొన్న సందిగ్దతలకు రెండు నెలల్లో పరిష్కారం చూపాలని అన్నారు.

ధరణి పోరటల్ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఎవరి దగ్గరా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 2నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్‌బుక్ చేసుకొని వారిలో 80వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని చెప్పారు. తెలంగాణలో 90శాతం మంది రైతులు 5ఎకరాల లోపు వారేనని అలాంటివారు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న సందిగ్దతలను రెండు నెలల వ్యవధిలో జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారని ప్రకటించారు.

ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి మెరుగు పరుస్తున్నట్లు సీఎం తెలిపారు. పోర్టల్ నిర్వహణ, మెరుగుపర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులకు కీలక సూచనలు చేశారు. పోర్టల్ రాకముందు రిజిస్ట్రేషన్ పూర్తయిన భూములను రిజిష్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్నవారి పేరుతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలన్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్లు యాజమాన్య హక్కులను ఖరారు చేయాలని సూచించారు. కోర్టు విచారణలో ఉన్నవి మినహా భూరికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్ బీలో పెట్టిన వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు.

రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకొకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సరిహద్దు వివాదాలున్న ప్రాంతాల్లో కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. కొన్ని చోట్ల ఒకే సర్వే నెంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నాయని అలాంటి ప్రాంతాల్లో కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమో, ఏది ప్రైవేటు భూమో నిర్ణయించాలన్నారు. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories