ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు రద్దు : సీఎం కేసీఆర్
తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు చేశామన్నారు. దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలకు భక్తులకు అనుమతి లేదన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా ఉండడమే కరోనా వైరస్‌కు సరైన విరుగుడు అని సీఎం కేసీఆర్ సూచించారు. ముస్లింలు నిర్వహించే జగ్‌నేకే రాత్‌ను రద్దు చేశామని, అలాగే ఉగాది రోజు నిర్వహించే పంచాంగ శ్రవణాన్ని నిర్వహించమని, కేవలం టెలికాస్ట్ ద్వారానే ప్రజలు తమ ఇళ్లల్లో వీక్షించాలని సూచించారు.
కరోనా వైరస్ విషయంలో నిన్న కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించాం. ఎలా ముందుకు పోవాలో అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 14కు చేరుకున్నాయని వీరిలో ఒక్కరు కూడా మన రాష్ట్ర ప్రజలు లేరని అంతా విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వైరస్ పాజిటివ్ వచ్చాయన్నారు. వీరిలో 5గురు విమానల్లో వచ్చారని మిగతా 9 మంది పలు మార్గాల్లో రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. ఇక ప్రజారవాణాకు సంబంధించి బస్సులు, క్యాబ్‌లు, టాక్సీల్లో సానిటేషన్ ఎక్కువగా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో సానిటేషన్ ఎక్కువ మొత్తంలో చేయాలని అది కూడా శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలో జరుగుతున్న టెన్త్ పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పదో తరగతి పరీక్షలు యథాతథంగానే కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే పరీక్షా కేంద్రాల్లో ఎక్కువ శానిటైజ్ చేయాలని ఆయన సూచించారు. మార్చి 1 తేదీ తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు మొత్తం సేకరించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే, తమంతట తామే వచ్చి కలెక్టరేట్‌లో కలవాలని సూచించారు. వారందరినీ క్వారంటైన్‌లో ఉంచాలని సూచించారు. గతంలో వారం రోజుల పాటు బంద్ చేసిన వాటిని (కొన్ని మాల్స్, ధియేటర్లు, జిమ్‌లు, వగైరా..) మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. బహిరంగ సమావేశాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.




