ఒకే వేదికపై కేసీఆర్, తమిళిసై.. రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం, గవర్నర్..

Droupadi Murmu: శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.

Arun Chilukuri
Published on: 26 Dec 2022 5:59 PM IST
Cm KCR Governor Tamilisai Welcome President Droupadi Murmu
X

ఒకే వేదికపై కేసీఆర్, తమిళిసై.. రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం, గవర్నర్..

Droupadi Murmu: శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత గవర్నర్, సీఎం కేసీఆర్ ఒకే వేదికపై కన్పించారు. పరస్పరం పలకరించుకున్నారు. అంతకుముందు ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి బయల్దేరి భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకున్నారు. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై హకీంపేట ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. ఇక, శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన రాష్ట్రపతి 5 రోజుల పాటు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు.

నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో రాష్ట్రపతి ఈనెల 27న ఉదయం సమావేశమవుతారు. మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతో పాటు భూటాన్, నేపాల్, మాల్దీవులు తదితర దేశాల అధికారులతోనూ సమావేశమవుతారు. భద్రాచలం, రామప్ప ఆలయాలను 28న రాష్ట్రపతి సందర్శించి ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు మిశ్రధాతు నిగం లిమిటెడ్ కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు.

29న ఉదయం షేక్‌పేటలోని నారాయణమ్మ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాలను సందర్శించి విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమవుతారు. సాయంత్రం శంషాబాద్ లోని శ్రీరామ్ నగర్ లో శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని సందర్శిస్తారు. శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 30న రంగారెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంగన్ వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతికశాఖ, శ్రీరామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్న 'హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతికి విందు ఇస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story