CM KCR Fire on AP Govt: పిలిచి అన్నం పెడితే, క‌య్యానికి కాలు దువ్వుతారా: ఏపీ సర్కార్ పై కేసీఆర్‌ ఆగ్రహం

CM KCR Fire on AP Govt:  పిలిచి అన్నం పెడితే,  క‌య్యానికి కాలు దువ్వుతారా: ఏపీ సర్కార్ పై కేసీఆర్‌ ఆగ్రహం
x
cm kcr fire on ap govt over objections on telangana projects
Highlights

CM KCR Fire on AP Govt: తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలపై సీఎం కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం అర్థం పర్థంలేని నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, అనవసర రాద్ధాంతం చేస్తోందని వ్యాఖ్యానించారు.

CM KCR Fire on AP Govt: తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలపై సీఎం కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం అర్థం పర్థంలేని నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, అనవసర రాద్ధాంతం చేస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోంద న్నారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థంగా వాదనలను వినిపించాలని సీఎం నిర్ణయించారు. నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాల గురించి సంపూర్ణ వివరాలు సేకరించారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

''నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం. బేసిన్లు, భేషజాలు లేవని రాష్ట్ర వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెబితే.. ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది, ఏపీ అర్థరహిత వాదనలు తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. అంతిమంగా రెండు రాష్ట్రాల రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాము. రాష్ట్ర ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపీకి కల్పిస్తాం''అని కేసీఆర్‌ అన్నారు.

ప్రాజెక్టులపై కేంద్రం త‌ప్పుడు వైఖ‌రి:

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా కేసీఆర్ తప్పుబట్టారు. 'రాష్ట్రానికి ఉన్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. 'శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం చెబుతోంది. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు, అది జల విద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదని కేసీఆర్ అన్నారు.

కేంద్ర వైఖరిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తామని కేసీఆర్ అన్నారు. అన్ని వాస్తవాలు వెల్లడిస్తామని ప్రకటించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామ‌ని, తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరై ఉన్నాయి. వాటికి నీటి కేటాయింపులు జరిగాయ‌ని స్ప‌ష్టం చేశారు. సి.డబ్ల్యు.సి. సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయని, దాదాపు 23 వేల కోట్ల రూపాయల వరకు నిధుల ఖర్చు జరిగింద‌ని, 31,500 ఎకరాల భూ సేకరణ జ‌రిగింద‌ని, ఇప్పు్డు అర్థ ర‌హితంగా మాట్లాడం అవివేకమ‌ని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడం లేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అనంత‌రం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ-డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ-డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్ సాగర్ -ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ-డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ-డిజైన్ చేసి సీతమ్మ సాగర్‌ను నిర్మిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

'పెన్ గంగ ప్రాజెక్టుకు 1975లోనే ఒప్పందం కుదిరి, ట్రిబ్యునల్ అవార్డు కూడా పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏయే అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వెలిబుచ్చిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories