గవర్నర్ ఆహ్వానంతో రాజ్‌ భవన్‌ వచ్చిన సీఎం కేసీఆర్.. పంతాలు, పట్టింపులు దూరంచేసిన సీఎం

CM KCR: రాజ్‌ ‎భవన్‌కు ప్రగతి భవన్‌ను దగ్గర చేసిన హైకోర్టు ప్రధానన్యాయమూర్తి ప్రమాణస్వీకారం

Shekhar G
Published on: 24 July 2023 8:59 AM IST
CM KCR Came To Raj Bhavan On The Invitation Of The Governor
X

గవర్నర్ ఆహ్వానంతో రాజ్‌ భవన్‌ వచ్చిన సీఎం కేసీఆర్.. పంతాలు, పట్టింపులు దూరంచేసిన సీఎం

CM KCR: తెలంగాణ రాజకీయాల్లో అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. నిన్న మొన్నటిదాకా గవర్నర్ తమిళిసైతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సీఎం కేసీఆర్.. ఎట్టకేలకు పంతాలు... పట్టింపులను దూరంచేశారు. రాజ్ భవన్ వేదికగా జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. రాజ్ భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానం అందుకున్న కేసీఆర్.. ప్రొటోకాల్ నియమావళిని పాటించి హాజరయ్యారు. గవర్నర్ పక్కనే నిల్చొని నమస్కారంచేస్తున్న సన్నివేశం రాజకీయ ప్రము‌ఖుల్ని ఆశ్చర్యపరచింది.

అధికారికంగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలసమయంలోనూ... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలోనూ... రిపబ్లిక్ వేడుకలను సైతం సీఎం కేసీఆర్.... గవర్నర్‌తో సంబంధంలేకుండా నిర్వహించి సంచలనాలకు నాంది పలికారు. గవర్నర్ తెలంగాణలో పర్యటించిన సందర‌్భంగా ఎక్కడా ప్రొటోకాల్ నిబంధనలు పాటించని కేసీఆర్ రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు.

గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌ భవన్‌ కు సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు అంతరం ఏర్పడిందనే భావన సర్వత్రా వ్యక్తమైంది. ప్రొటోకాల్ గొడవలు, గవర్నర్‌ను విస్మరిస్తున్నారనే అంశంపై తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు, విచారణ, హైకోర్టు తీర్పుతో అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించారు.

ఆ తర్వాత గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ల మధ్య రాజకీయ పరమైన విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై తమిళిసై ప్రత్యేక నివేదికను ఢిల్లీకి స్వయంగా తీసుకెళ్లారు. గవర్నర్ పట్ల సీఎం కేసీఆర్ తరఫున మంత్రులు, ఎమ్మెల్సీలు విమర్శలు, ప్రతివిమర్శలతో వార్తల్లోకెక్కారు. తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ప్రమాణస్వీకారం కార్యక్రమం చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు పెద్దగా దూరంలేదనే సంకేతాలిచ్చింది. ఇన్నాళ్లు మొండిపట్టుతో ఉన్న కేసీఆర్ ఎట్టకేలకు పంతాలను, పట్టింపులను దూరంచేశారు. గవర్నర్ ఆహ్వానం అందుకున్న కేసీఆర్‌ ప్రొటోకాల్ నియమావళిని పాటించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

Shekhar G

Shekhar G

Next Story