Ganja Chocolates: హైదరాబాద్‌లో చాక్లెట్ల రూపంలో భారీగా పట్టుబడుతున్న గంజాయి

Ganja Chocolates: విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు,లేబర్ టార్గెట్‌గా విక్రయం

Shekhar G
Published on: 30 Jan 2024 2:50 PM IST
Cannabis In The Form Of Chocolates Is Being Seized Heavily In Hyderabad
X

Ganja Chocolates: హైదరాబాద్‌లో చాక్లెట్ల రూపంలో భారీగా పట్టుబడుతున్న గంజాయి

Ganja Chocolates: మహానగరంలో మాదకద్రవ్యాల దందా పెచ్చుమీరుతోంది. విద్యార్థులే లక్ష్యంగా జరుగుతోన్న ఈ మత్తు దందా నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. మొన్న షాద్ నగర్, నిన్న రామాంతపూర్ లో గంజాయి చాక్లెట్లు పట్టుబడగా.. తాజాగా మరో చోట గంజాయి చాక్లెట్లు పట్టుబడటం ఆందోళన రేకెత్తిస్తోంది.

డ్రగ్స్ , గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు చేస్తోన్న స్పెషల్ డ్రైవ్ లో మత్తు దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా కోకాపేట్ ప్రాంతంలో గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓ అపార్ట్ మెంట్ లో కార్మికులకు చాక్లెట్లను విక్రయిస్తూ ఒడిశాకు చెందిన సోమ్యా రాజన్ పట్టుబడ్డాడు.

నిన్న ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గాంధీ నగర్ లో ఎక్సైజ్ అధికారులు ఈ గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. గాంధీ నగర్ లో కిరాణం దుకాణం నిర్వహిస్తున్న ఫిరోజ్ జెనా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసర ప్రాంతాల్లో చాక్లెట్లు విక్రయిస్తున్నాడని సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎన్ ఫోర్స్ మెంట్ ఎక్సైజ్ అధికారులు ఫిరోజ్ జెనా కిరణం దుకాణం, అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని 34 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాదీనం చేసుకున్నారు. తాజాగా కార్మికులు, స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తూ మరో వ్యక్తి గంజాయి చాక్లెట్ల విక్రయాలు జరుపుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

కోకాపేట్ రాంకీ కన్ స్ట్రక్షన్ కంపెనీలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేశారు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్స్ గుర్తించారు. మొత్తం 4 కేజీల గంజాయి చాక్లేట్లను సీజ్ చేశారు అధికారులు. పట్టుబడిన సౌమ్యా రాజన్ ఒడిస్సా నుండి గంజాయి చాక్లెట్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు లేబర్ ను టార్గెట్ చేసి విక్రయాలు చేస్తున్నాడు. గంజాయి చాక్లెట్స్ సీజ్ చేసిన నిందితుడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. గంజాయి చాక్లెట్స్ దందాను ఎంత కాలం నుండి కొనసాగిస్తున్నాడు? ఎవరెవరికి విక్రయించాడనే దానిపై విచారణ జరుపుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story