BRS: ఎన్నికలు సమీపిస్తుండటంతో.. దూకుడు పెంచిన బీఆర్ఎస్‌..

BRS: ప్రజా సమస్యలు, పథకాల అమలుపై మంత్రి హరీశ్ రావు ఫోకస్

Shekhar G
Published on: 10 Aug 2023 10:43 AM IST
BRS Increased Focus As Elections Are Approaching
X

BRS: ఎన్నికలు సమీపిస్తుండటంతో.. దూకుడు పెంచిన బీఆర్ఎస్‌..   

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి.. కీలక నేతలిద్దరూ దూకుడు పెంచారు. ఒకరు పార్టీ వ్యవహారాల్లో బిజీబిజీగా గడుపుతుంటే.. మరొకరు అధికారిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ పెట్టారు. రెండు వైపులా ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేస్తున్నారు.

ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రి హరీశ్ రావు.. ఇప్పుడు తన దృష్టి అంతా పరిపాలనపై పెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ బీసీలకు ఆర్ధిక సహాయం, మైనార్టీలకు ఆర్థిక సాయం పథకాలను మంత్రి హరీష్ రావే అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా రేషన్ డీలర్ల సమస్యలపై, మైనార్టీలను ఆదుకోవడంపై మంత్రులతో కలసి వరుస మీటింగ్‌లు పెట్టారు.

ఇక మరో మంత్రి కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీలో విభేదాలు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే కారుపార్టీ పై పూర్తి పట్టు సాధించిన కేటీఆర్... రాష్ట్రంలో మూడోసారి అధికారం రావడానికి అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా ఎమ్మెల్యేలకు సలహాలు సూచనలు ఇస్తూనే.. లైన్ దాటితే వేటు తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నియోజకవర్గాలు జిల్లాల వారీగా వారిగా సమీక్ష నిర్వహిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలతో పార్టీ నేతలు సుతమతమవుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు కొత్తగా వచ్చిన వారికి మధ్య కొన్నిచోట్ల సమన్వయం కుదరడంలేదు. రామగుండం, స్టేషన్ ఘన్‌పూర్‌, కరీంనగర్ నేతలతో సమావేశాలు నిర్వహించి విభేదాలు చక్కదిద్దుతున్నారు.

చాలామంది నేతలు టికెట్లు ఆశిస్తూ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ రచ్చ రగులుతోంది. కొద్దిమంది నేతల వ్యక్తిగత వ్యవహారాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. అలాంటి ఎమ్మెల్యేలను, స్థానిక నేతలను పిలిచి మందలించి సరదిద్దే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. దీంతో నేతలు కూడా కేటీఆర్ దగ్గరకు క్యూ కడుతున్నారు. నేతల మధ్య ఉన్న గ్యాప్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. గులాబీ బాస్‌ కేసీఆర్ జాతీయ రాజకీయాలు, మహారాష్ట్రపై పూర్తి ఫోకస్ పెట్టడంతో... తెలంగాణ వ్యవహారాలు మొత్తం కేటీఆర్ చూసుకుంటున్నారు. అధినేత సూచనలతో పార్టీపై పట్టు పెంచుకున్నారు. అటు ప్రభుత్వం ఇటు పార్టీనీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. భవిష్యత్ నేతగా పార్టీ నేతలకు గట్టి భరోసా కల్పిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story