Black Fungus: హైదరాబాద్‌లో బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్ల బ్లాక్ దందా

Black Fungus Drug Racket in Hyderabad
x

రెప్రెసెంటేషనల్  ఇమేజ్ 


Highlights

Black Fungus: ఓ వైపు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ పెను సవాలుగా మారిన కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బ్లాక్ ఫంగస్ కూడా ప్రజలను భయపెడుతోంది.

Black Fungus: ఓ వైపు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ పెను సవాలుగా మారిన కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బ్లాక్ ఫంగస్ కూడా ప్రజలను భయపెడుతోంది. ఇదే ఆసరాగా చేసుకుని బ్లాక్ ఫంగస్ చికిత్స లో వాడే మందులను బ్లాక్ మార్కెట్ లో విక్రయించడమే కాకుండా నకిలీ మందులు తయారు చేస్తున్న ఓ ముఠా పోలీసులకు చిక్కింది.

ఓ వైపు కోవిడ్ కల్లోలం కొనసాగుతుంటే మరోవైపు బ్లాక్‌ ఫంగస్ విరుచుకుపడుతోంది‌. ఇలాంటి విపత్కర సమయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అక్రమార్కులు. కనీసం మానవత్వం కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్‌లో మందులకు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్మి ఆపదలో ఉన్న వారి అవసరాలను క్యాష్ చేసుకుంటున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ దందాకు ఓ డాక్టరే సూత్రధారి అని గుర్తించారు పోలీసులు.

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో యాంఫిటెరిసిన్-బి ఇంజెక్షన్లు కీలకం. కెపిహెచ్‌బి ప్రగతి నగర్ లోని సెలాన్ ల్యాబ్స్ ఈ మందును తయారు చేస్తోంది. అయితే ఈఎస్ఐలో ఫిజిషియన్‌గా పనిచేస్తున్న ఓబుల్ రెడ్డి కొంత మంది మెడికల్ షాపు యజమానులతో కుమ్మక్కయ్యాడు. ఆస్పత్రికి వస్తున్న ఇంజెక్షన్లను అధికారుల కళ్ళుగప్పి ప్రక్కదారి పట్టించాడు. ఆ ఇంజెక్షన్లను మెడికల్ షాపు నడుపుతున్న వారి సహకారంతో ఒక్కొ ఇంజక్షన్‌ను 38వేల నుంచి 45 వేలకు విక్రయిస్తున్నాడు.

ఇక మార్కెట్‌లో ఈ ఇంజక్షన్లు అమ్మిపెడుతోన్న శ్రీధర్ మరో మెట్టు ఎక్కి యాంటిబయోటిక్ ఇంజెక్షన్లకు సెలాన్ ల్యాబ్స్ స్టిక్కర్లు అంటించి విక్రయాలు మొదలుపెట్టాడు. బ్లాక్ ఫంగస్ కు వాడే సెప్ట్రోయాక్సోన్, టోజోబ్యాక్టమ్ పేరుతో అమ్మకాలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 18లక్షల విలువైన ఇంజెక్షన్లు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీ లో ఉన్న ఈఎస్ఐ వైద్యుడు ఓబుల్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స లో వాడే ఇంజెక్షన్లు బయట అమ్మేందుకు ఎటువంటి అనుమతులు లేవని రోగి ఉన్న ఆస్పత్రి ద్వారానే సరఫరా చేయబడతాయని పోలీసులు వెల్లడించారు. అధిక ధరలకు కొని మోసపోవద్దని ప్రజలకు సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories