హైదరాబాద్‌కు క్యూ కట్టనున్న బీజేపీ పెద్దలు

హైదరాబాద్‌కు క్యూ కట్టనున్న బీజేపీ పెద్దలు
x
Highlights

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ ప్రచార బరిలో అగ్రనేతలను దింపుతోంది. ఎన్నికల ప్రచారానికి కేవలం నవంబర్ 29 వరకే గడువు...

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ ప్రచార బరిలో అగ్రనేతలను దింపుతోంది. ఎన్నికల ప్రచారానికి కేవలం నవంబర్ 29 వరకే గడువు ఉంది. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు వరుసగా హైదరాబాద్‌కు క్యూ కట్టనున్నారు. చివరి ఘట్టంలో అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తే ఆ జోష్ హైలో ఉంటుందని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి జోష్ మీద ఉన్న బీజేపీ ఆ జోష్‌ను గ్రేటర్‌లో కూడా కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శల దాడి పెంచుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలను కూడా బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని కమలనాధులు భావిస్తున్నారు. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన భూపేంద్ర యాదవ్ రంగంలోకి దిగి మొదటిదశలో పరిస్థితిని చక్కబెట్టారు. ఆ తర్వాత మరికొందరు పెద్దలు రంగంలోకి దిగనున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్‌, బీజేపీల మధ్యనే ఉండనున్నాయన్నది స్పష్టమవుతోంది. గ్రేటర్‌లో ప్రజలు బీజేపీ వైపే నిలుస్తారని ఆపార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బల్దియాలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గ్రేటర్‌లో సాధ్యమైనంత ఎక్కువ బలం ప్రదర్శించాలంటే బలమైన నాయకులతో ప్రచారం చేయించాలని రాష్ట్ర బీజేపీ నేతల యోచన. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రచార బరిలోకి దింపనున్నారు. వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులచే జీహెచ్‌ఎంసీలో ప్రచారం చేయించేలా రాష్ట్ర నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర నేతలు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య హైదరాబాద్‌కు వచ్చి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి కేవలం నవంబర్ 29 వరకే గడువు ఉంది. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు వరుసగా హైదరాబాద్‌కు క్యూ కట్టనున్నారు. అందరు నేతలు ఒకే రోజు కాకుండా, రోజుకో నేత ప్రచారానికి రానున్నట్టు సమాచారం. చివరి ఘట్టంలో అమిత్ షా ప్రచారానికి రానున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు రెండు రోజుల ముందు అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించి ప్రచారం చేస్తే ఆ జోష్ పీక్స్‌లో ఉంటుందని, అది ఎన్నికలకు పనికొస్తుందని ఇక్కడి బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే పొలిటికల్ హీట్‌ తారాస్థాయికి చేరింది. టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ ప్రచారం తారాస్థాయికి చేరింది. దుబ్బాక విజయం తర్వాత జోష్‌ పెంచిన కమలం నేతలు బల్దియా ప్రచారంలో కాంగ్రెస్‌ను వెనక్కునెట్టి ముందుకు దూసుకొచ్చారు. గులాబీ నేతలకు ధీటుగా వ్యూహప్రతివ్యూహాలతో గ్రేటర్‌ పీఠమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలందరినీ భాగ్యనగరంలో మోహరింపచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories