పాపం పసివాడు.. వీధి కుక్కకు చిక్కాడు!
వీధిలో కుక్క కనిపిస్తే తప్పించుకుపోవాలి లేదా చేతిలో ఏదన్నా ఆయుధం ఉంటే దానిని చూపించి గట్టిగా బెదిరించి పారద్రోలాలి. అంతేకానీ, ముద్దుగా కాలెత్తి తన్నుతా అంటే.. ఇదిగో ఇలానే పాపం ఆ చిన్న పిల్లడి పరిస్థితిలానే అవుతుంది.
సాధారణంగా వీధి కుక్కలు కాస్త అడిలిస్తే పారిపోతాయి. కొన్ని ప్రమాదకరమైనవి ఉంటాయి. అవి మాత్రం ఊరికే అలా అడిలిస్తే కండలు ఊడ పెరుకుతాయి. సరిగ్గా అలాగే జరిగింది ఆ పిల్లాడి విషయంలో..
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ఈ సంఘటన జరిగింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమీన్ పూర్ పరిధిలో రెండు రోజుల క్రితం బీ ఎస్ ఆర్ కాలనీలోని ఓ వీధిలో ఓ విద్యార్ధి నడచుకుంటూ వెళుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక కుక్క ఆ పిల్లాడి వద్దకు వచ్చింది. దానిని ఆ విద్యార్థి అడిలించాబోయాడు. దీంతో మీదకు వచ్చింది. కాలితో ఆ కుక్కను అడ్డుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ కుక్క నిలువెత్తున నిలబడి ఆ కుర్రడి పై దాడి చేసి కింద పడేసింది. కింద పడినా ఆ బాలుడ్ని కుక్క వదలలేదు. లేవడానికి ప్రయత్నిస్తున్న అతడిపైకి మరోసారి దాడి చేసి ఆ విద్యార్ధి బుగ్గను పట్టుకుని పీకింది. దీంతో బుగ్గ పై పెద్ద గాయం అయింది. అతి కష్టం మీద ఆ కుక్కను వదిలించుకుని ఆ కుర్రాడు వెనుకకు పరుగులు తీశాడు. ఈ దృశ్యం మొత్తం ఆ వీధిలోని సీసి కెమెరాల్లో రికార్డయింది.
ఇదిలా ఉండగా గాయపడిన ఆ విద్యార్ధిని హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు అతని తల్లిదండ్రులు. అతని బుగ్గ కు ప్లాస్టిక్ సర్జరీ చేసీ అవకాశం కూడా లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం.




