సెమీకండక్టర్ల వార్‌లో మూడు అగ్రదేశాలు.. చైనా, అమెరికాకు షాక్ ఇచ్చేందుకు భారత్ ఎంట్రీ
Semiconductor: సెమీకండక్టర్.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.
Semiconductor: సెమీకండక్టర్.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే లేకపోతే మనం వాడే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, కార్లు, కంప్యూటర్ల తయారీ ఆగిపోతుంది. ఇప్పుడా సెమీకండక్టర్ల కొరత ప్రపంచ దేశాలను వేధిస్తోంది. దీనికి కారణంగా ఇటీవల మొబైళ్ల ధరలు పెరిగాయి. కార్ల ఉత్పత్తులు పడిపోయాయి. చిప్స్ తయారీ రంగాన్ని ఇప్పటివరకు చైనా శాసించింది. దానికి పోటీగా భారత్, అమెరికా ఎంట్రీ ఇచ్చాయి. డ్రాగన్‌ను కట్టడి చేయాలంటే.. స్వదేశాల్లోనే సెమీకండక్టర్లను తయారుచేయాలని నిర్ణయించుకున్నాయి. చిప్స్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏకంగా ప్రధాని మోడీ వెయ్యి కోట్ల డాలర్లను ప్రకటించారు. దీంతో చిప్స్ రంగంలోకి భారత్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినట్టయ్యింది. చిప్స్ వార్‌లో సూపర్ పవర్‌గా భావిస్తున్న అమెరికా, చైనాకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది.
ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్స్ కొరత రోజు రోజుకు పెరుగుతోంది. సెమీకండక్టర్‌ను సాధారణంగా సిలికాన్‌తో తయారు చేస్తారు. ఇది రాగి, అల్యూమినియం కంటే.. తక్కువ విద్యుత్‌ను ప్రసరింప చేస్తుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా పలు పేర్లు ఉన్నాయి. సెమీస్, చిప్స్, సెమీ కండక్టర్స్, న్యూ ఆయిల్, 21వ శతాబ్దపు గుర్రపు నాడాగా పిలుస్తారు. ఇప్పుడు ప్రతి ఎలక్ట్రానిక్ పరికరానికి ఇవి అత్యంత కీలకంగా మారాయి. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచ్‌లు, కార్లు, మెడికల్ పరికరాలు.. ఇలా ఒకటేమిటి.. అన్నింటి తయారీలోనూ చిప్స్ అత్యంత కీలకమైనవి. ఈ కారణంగానే సెమీకండక్టర్ల కొరత తీవ్రమైంది. ఇటీవల జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థల్లో ఉత్పత్తి భారీగా పడిపోయింది. సాధారణ స్థాయిలో వాహనతయారీ కంపెనీలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. అందుకు కారణం.. సెమీకండక్టర్లే.. ఈ ఏడాది కార్ల ఉత్పత్తిపై లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిలో టొయాటా, నిస్సాన్ సంస్థలు ఉత్పత్తి చేయలేకపోయాయి. తయారీ కార్యకలాపాలపై చిప్స్ కొరత తీవ్రంగా ఉన్నట్టు ఆయా సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరత ఒక్క జపాన్‌లోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నది. 40 శాతం కార్ల ఉత్పత్తిని హోండా తగ్గించింది. 2023 చివరి వరకు సెమీకండక్టర్ల కొరత ఉంటుందని వోక్స్ వ్యాగన్ చెబుతోంది. చిప్స్ కొరత కారణంగా కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ మోటార్ 310 కోట్ల డాలర్లను నష్టపోయింది. అసలు సెమీకండక్టర్ల కొరత ఎందుకు నెలకొన్నది? అంటే.. ఉత్పత్తి కంటే.. డిమాండ్ అధికమవ్వడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అసలు చిప్స్ కొరత ఎప్పుడు మొదలైంది? మొదట్లోనే ఎందుకు నివారించలేదు?
నిజానికి చిప్స్ కొరత.. 2020లోనే మొదలయ్యింది. కోవిడ్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో గాడ్జెట్స్ డిమాండ్ భారీగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రజలు భారీగా కంప్యూటర్లు, మొబైళ్లు, ట్యాబ్లెట్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో తయారీదారులు సెమీకండక్టర్ల కృత్రిమ కొరతను సృష్టించారు. దీంతో నాటి నుంచి చిప్స్ కొరత అధికమైంది. కృత్రిమ కొరత ఒకటైతే.. అవి కేవలం పరిమిత దేశాల్లోనే తయారవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సెమీకండక్టర్లను సౌత్ కొరియా, జపాన్, చైనా, తైవాన్ దేశాలు మాత్రమే తయారు చేస్తున్నాయి. అయితే కోవిడ్ మహమ్మారి ఆయా దేశాలను ఇప్పటికీ వణికిస్తోంది. మూడేళ్లుగా ఈ నాలుగు దేశాల్లో పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో చిప్స్ ఉత్పత్తి ఆగిపోయింది. సప్లయ్ చైన్ దెబ్బతిన్నది. కోవిడ్ నుంచి కోలుకుంటున్న సమయంలో ఉక్రెయిన్-రష్యా వార్‌తో మరో కుదుపు ఏర్పడింది. దానికి ఆజ్యం పోస్తున్నట్టుగా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంతో చిప్ ఇండస్ట్రీని కోలుకోలేకపోయింది. ఫలితంగా కార్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 3శాతం లావాదేవీలు కార్ల ఎగుమతులతోనే వస్తోంది. సంఖ్య తక్కువగానే కనిపించినా.. పలు దేశాల్లోని ఆటోమొబైల్ రంగాన్ని కార్ల విక్రయాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు చెక్ రిపబ్లిక్‌ను తీసుకుంటే.. ఆ దేశ జీడీపీలో 9 శాతం ఆదాయం ఆటోమొబైల్ రంగం నుంచే వస్తోంది. కార్ల ఉత్పత్తి పడిపోవడంతో ఆ దేశ ఆర్థిక వృద్ధి 4 శాతం నుంచి 1.9 శాతానికి పడిపోయింది. చిప్స్ ప్రభావం భారత్‌పైనా పడింది. దేశ స్థూల జాతీయోత్పత్తి-జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటా.. 6.4 శాతం. ఆటోమొబైల్ రంగంలో 3 కోట్ల మంది పని చేస్తున్నారు.
అయితే చిప్స్ కొరతను అధిగమించడం ఎలా? అంటే.. ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు సెమీకండక్టర్ల తయారీని మరిన్ని దేశాలకు విస్తరించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిప్స్ తయారీ రంగంలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది. మేకిన్ ఇండియాలో భాగంగా.. సెమీకండక్టర్ పరిశ్రమపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. తయారీదారులకు ఏకంగా వెయ్యి కోట్ల డాలర్ల ప్రోత్సహకాలను ప్రకటించారు. దీంతో పలు కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. భారత్‌లోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా.. సెమీకండక్టర్ల తయారీకి సిద్ధమైంది. చిప్స్ తయారీ, ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. అయితే చిప్ప్‌తయారీ దారులను ఆకర్షించడం అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు. కానీ.. దేశీయంగా భారత్ చిప్స్ తయారీ చేయాలని ప్రోత్సహించడం ఆసక్తికర పరిణామం అని విశ్లేషిస్తున్నారు. చిప్ పరిశ్రమను డామినేట్ చేయాలని యత్నిస్తున్న అగ్రదేశాలు అమెరికా, చైనాకు గట్టి పోటీని ఇస్తుందని వివరిస్తున్నారు. ఇటీవల చిప్స్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా 5వేల కోట్ల డాలర్లను ప్రకటించారు. 2 లక్షల కోట్ల డాలర్ల మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా.. సెమీకండక్టర్ పరిశ్రమకు కేటాయించారు. ఉత్పత్తికి.. కొత్త చిప్స్‌పై ప్రయోగాలకు ఈ 5వేల కోట్ల డాలర్లను కేటాయించనున్నారు. అంతేకాదు.. చిప్ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా జాతీయ సెమీకండక్టర్ టెక్నాలజీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అందుకు అవసరమయ్యే నిధులను సేకరించేందుకు.. అమెరికన్ కంపెనీల విదేశీ ఆదాయాలపై పన్నులు పెంచాలని బైడెన్ యోచిస్తున్నారు.
అమెరికాలో నెలకొన్న చిప్స్ కొరతను అధిగమించేందుకు సెమీకండక్టర్ల పరిశ్రమపై దృష్టి పెట్టినట్టు బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరిలోనే సప్లయ్ చైన్ సమస్యలపై అధికార, ప్రతిపక్ష సెనేటర్లతో బైడెన్ సమావేశమయ్యారు. అందులో భాగంగా.. కంప్యూటర్ చిప్స్, పెద్ద బ్యాటరీలపై చర్చ జరిగింది. చిప్స్‌ను 21వ శతాబ్దపు గుర్రపు నాడాగా బైడెన్ పేర్కొన్నారు. ప్రపంచ చిప్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. చిప్ తయారీకి అవసరమైన విడిభాగాలను ఎగుమతికి జపాన్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇప్పటికే సెమీకండక్టర్ల రేసులో దూసుకుపోతున్న చైనాకు చెక్ పెట్టేందుకు బైడెన్ రంగంలోకి దిగారు. అదే సమయంలో పిక్చర్‌లోకి భారత్ కూడా ఎంట్రీ ఇచ్చింది. నిజానికి చైనాను కట్టడి చేసేందుకు అమెరికా, భారత్ రంగంలోకి దిగాయి. ఏటా వేల కోట్ల డాలర్లను డ్రాగన్ కంట్రీ కొల్లగొడుతోంది. ఒక్క 2020లో.. చిప్స్ విషయంలో ఏకంగా 3వేల 500 కోట్ల డాలర్ల నిధులను చైనా కొల్లగొట్టింది. 2019తో పోలిస్తే.. 407 శాతం రెట్టింపు అధికంగా రాబట్టింది. ఒక్క ఏడాదిలోనే అంత భారీగా నిధులు రావడంతో చైనా రెచ్చిపోతోంది. చైనాను కట్టడి చేసేందుకు స్వదేశంలోనే చిప్స్ తయారీ చేయడమే పరిష్కార మార్గమని.. భారత్, అమెరికా భావిస్తున్నాయి. అందులో భాగంగా సెమీకండక్టర్ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. చైనా తరువాత ప్రపంచంలోనే అత్యధిక మొబైళ్లను తయారుచేస్తున్న దేశం భారతే.. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్స్ ఇక్కడే తయారైతే.. ఆయా డివైజ్‌ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు రెండు సూపర్ పవర్ కంట్రీస్‌తో భారత్ పోటీ పడుతూ.. రేసులో నేనూ ఉన్నానంటూ నిరూపిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్.. సెమీకండక్టర్లలోనూ సత్తా చాటి.. అమెరికా, చైనాకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire