తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి!

తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి!
x
Highlights

తెలుగు టైటాన్స్ కు కాలం కలిసిరావడం లేదు. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లలో వరుసగా మూడోసారి ఓటమి పాలైంది. తొలి రెండు మ్యచుల్లోనూ భారీ ఆధిక్యంతో ఓడిపోయిన...

తెలుగు టైటాన్స్ కు కాలం కలిసిరావడం లేదు. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లలో వరుసగా మూడోసారి ఓటమి పాలైంది. తొలి రెండు మ్యచుల్లోనూ భారీ ఆధిక్యంతో ఓడిపోయిన టైటాన్స్ జట్టు ఈసారి తుదికంటూ పోరాడినా ఫలితం దక్కలేదు. మొదటి అర్థ భాగంలో ప్రత్యర్థి దబంగ్ దిల్లీ పై ఆధిక్యం ప్రదర్శించి.. తొమ్మిది నిమిషాల ఆట ఉన్నంతవరకూ ఆధిపత్యం ప్రదర్శించి.. చివరికి ఓడిపోయింది. దీంతో వరుస ఓటములతో హ్యాట్రిక్ నమోదు చేసింది.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 33-34 తేడాతో దబంగ్‌ దిల్లీ చేతిలో పరాజయం చెందింది. భారీ ఆశలు పెట్టుకొన్న సిద్ధార్థ్‌ దేశాయ్‌ (8) ఈ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా.. ఎలాంటి అంచనాలు లేని అతని సోదరుడు సూరజ్‌ దేశాయ్‌ (18) మాత్రం రైడింగ్‌లో చెలరేగాడు. టైటాన్స్‌ తరపున సూరజ్‌, దబంగ్‌ జట్టులో నవీన్‌ కుమార్‌ (14) సత్తాచాటడంతో మ్యాచ్‌ ఆరంభం నుంచే స్కోర్లు సమమౌతూ వచ్చాయి. తొలి అర్ధభాగాన్ని టైటాన్స్‌ 14-13 ఆధిక్యంతో ముగించింది. విరామం తర్వాత కూడా రెండు జట్లు దూకుడుగా ఆడాయి. ఐతే 31వ నిమిషంలో రైడ్‌కు వెళ్లిన సూరజ్‌ నాలుగు పాయింట్లు తేవడంతో టైటాన్స్‌ 28-26తో ఆధిక్యంలో నిలిచింది. ఆ వెంటనే జోగిందర్‌ సూపర్‌ ట్యాకిల్‌ చేసి దిల్లీని 29-28తో ఆధిక్యంలో నిలిపాడు. అక్కడి నుంచి టైటాన్స్‌ పోరాడినా కూడా ప్రత్యర్థిని అందుకోలేకపోయింది. మరో రెండు నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉందనగా 32-33తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ ఆ తర్వాతి రైడ్‌లో టైటాన్స్‌ ఆటగాడు అర్మాన్‌ను జోగిందర్‌ పట్టడంతో దిల్లీ 34-32తో నిలిచింది. చివరి రైడ్‌కు వెళ్లిన సూరజ్‌ ఒక్క పాయింటే తేవడంతో టైటాన్స్‌ నిరాశలో మునిగిపోయింది. ఈ మ్యాచ్‌లో 18 పాయింట్లు సాధించిన సూరజ్‌ పీకేఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో అత్యధిక రైడ్‌ పాయింట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఇక ఐదేరోజు జరిగిన మరో మ్యాచ్‌లో బంగాల్‌ వారియర్స్‌ 48-17తో యూపీ యోధాను చిత్తుచిత్తుగా ఓడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories