టీమిండియా కోచ్ ఫిక్స్ అయిపోయాడా.. ఇదంతా ఫార్మాలిటీ కోసమేనా?

టీమిండియా కోచ్ ఫిక్స్ అయిపోయాడా.. ఇదంతా ఫార్మాలిటీ కోసమేనా?
x
Highlights

టీమిండియా కోచ్ పదవికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ పదవికి ఆరుగురు రేసులో ఉన్నారు. వారిలో ముగ్గురు విదేశీయులు కాగా, ఇంకొకరు ఇప్పటి కోచ్ రవిశాస్త్రి , మిగిలిన వారు రాబిన్ సింగ్, లాల్ చాంద్ రాజ్ పుట్

ముగ్గురు కమిటీ సభ్యులు.. ఆరుగురు ఆశావహులు.. ఒక చీఫ్ కోచ్. ఫైనల్ ఇంటర్వ్యూ.. సెలక్షనే మిగిలింది. అంతా బాగానే వుంది కానీ, ఎక్కడో తేడా కొడుతోంది. ముందే ఓ వ్యక్తిని ఎంపిక చేసుకుని.. తరువాత ఫార్మాలిటీని నడిపించడం.. ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్ లో ఈ మాటే వినిపిస్తోంది. టీమిండియా చీఫ్ కోచ్ పదవికి ఎంపిక నిర్వహణ జరుగుతోన్న తరుణంలో పలు అనుమానాలు రేగుతున్నాయి.

టీమిండియా కోచ్ ను ఎంపిక చేయడం కోసం కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది బీసీసీఐ. వందల కొలదీ వచ్చిన అప్లికేషన్లలో ఆరుగురిని ఫైనల్ గా ఇంటర్వ్యూ చేయడానికి ఎంపిక చేసింది కమిటీ. పైకి చూడ్డానికి ఇది చాలా బాగా కనిపిస్తోంది. అయితే, ఇప్పుడున్న కోచ్ రవిశాస్త్రినే మళ్లీ ఎంపిక చేయడం ఖాయమంటూ వదంతులు వస్తున్నాయి. దానికి కారణాలూ లేకపోలేదు.

కోచ్ ఫైనల్ ఇంటర్వ్యూకి సెలక్ట్ అయింది ఈ ఆరుగురు!

దాదాపు రెండు వేల మంది టీమిండియా కోచ్ సహా వివిధ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారిలో ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి, టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ లు మాత్రమే తుది జాబితాలో మిగిలారు. ఇప్పుడు వీరు ఈనెల 16న జరిగే ఇంటర్వ్యూకి హాజరు అవుతారు. ఒకవేళ వారు హాజరు కాలేకపోతే.. వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ ఇవ్వవచ్చు.

రవిశాస్త్రి.. టీమిండియాకు 2017, జులై 13 నుంచి కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండేళ్లలో టీమిండియా ఆసీస్ ను వారి దేశంలోనే ఓడించడం.. ఆసియా కప్ గెలుపు, టెస్టుల్లో నెంబర్ వన్ స్థానం ఇలా విజయాల బాటలో నడిచింది. పైగా కెప్టెన్ విరాట్ కోహ్లీకీ, రవిశాస్త్రికి మధ్య చక్కని సమన్వయం ఉంది. జట్టు విజయాల పరంపరకు ఇది కూడా కీలకమైంది. దాంతో మళ్లీ రవిశాస్త్రి కోచ్ గా రావాలని కోహ్లీ కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించాడు కూడా.

ఇక ప్రస్తుతం రేసులో ఉన్నవారిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. కొన్ని వార్తల ప్రకారం టీమిండియాకు విదేశీ కోచ్ లు వద్దని బీసీసీఐ మౌఖికంగా చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే, వారి పేర్ల పరిశీలన..ఇంటర్వ్యూ ప్రాధాన్యత లేనివే. ఇక మిగిలేది ముగ్గురు. లాల్ చంద్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ధోనీ టీం కు మేనేజర్ గా వ్యవహరించారు. అయితే, ఈయనకు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం తక్కువ. అది మైనస్ గా మారే ఛాన్స్ వుంది. ఇక రాబిన్ సింగ్ రవిశాస్త్రికి పోటీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే, అంతర్జాతీయంగా చాలా మ్యాచ్ లు ఆడిన అనుభవం ఆయన సొంతం. అంతేకాకుండా దాదాపు 15 సంవత్సరాల పాటు వివిధ జట్లకు కోచ్ గా వ్యవహరించిన అపార అనుభవమూ ఆయనకు ఉంది.

ఈవిధంగా చూస్తే, రాబిన్ సింగ్, రవిశాస్త్రి మధ్యే పోటీ ఉంది. మొత్తం తతంగం చూస్తే శాస్త్రికి అనుకూలంగా వ్యవహారాన్ని నడిపేందుకు బీసీసీఐ ప్రయత్నించినట్టు కనిపిస్తోంది.

ముఖ్యంగా కోచ్ పదవికి విదేశీయులు వద్దని అనుకోవడమే చాలావరకూ రవిశాస్త్రికి పరిస్థితులు అనుకూలంగా మార్చేశాయి. ఇప్పుడు అందరి మదినీ తొలిచేస్తున్న అతి ముఖ్యమైన ప్రశ్న విదేశీయులు వద్దని అనుకున్నపుడు వారి నుంచి దరఖాస్తులు ఎందుకు ఆహ్వానించారనేదే ఆ ప్రశ్న. కేవలం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే ఈ ఇంటర్వ్యూ తతంగం నడుస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఇవన్నీ ఊహాగానాలే.. వీటిలో నిజానిజాలు తేలాలంటే.. టీమిండియా కోచ్ గా ఎవరు రాబోతున్నారో చూడాలంటే ఎల్లుండి వరకూ ఆగాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories