కరోనా దెబ్బతో గుహలో తలదాచుకున్న విదేశీయులు.. రక్షించి క్వారంటైన్ కు పంపిన పోలీసులు

* మార్చి 24 నుంచి గుహలోనే ఆవాసం * నిత్యావసరాలు కొనుగోలు చేస్తూ కాలక్షేపం * క్వారంటైన్ సెంటర్ కు తరలించిన పోలీసులు

K V D Varma
Updated on: 20 April 2020 10:45 AM IST
కరోనా దెబ్బతో గుహలో తలదాచుకున్న విదేశీయులు.. రక్షించి క్వారంటైన్ కు పంపిన పోలీసులు
X
tourist spot in Rishikesh (file photo)

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఎటూ కదల్లేక పోయిన ఆరుగురు విదేశీయులు, రుషీకేశ్ ప్రాంతంలోని ఓ గుహలో తలదాచుకున్నట్టు గుర్తించిన పోలీసులు, వారిని ఓ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. వీరిలో ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని, 14 రోజుల పాటు వీరిని పరిశీలనలో ఉంచుతామని వెల్లడించారు.

వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వీరు ఫ్రాన్స్, యూఎస్, ఉక్రెయిన్, టర్కీ, నేపాల్ దేశాలకు చెందిన వారు. మార్చి 24 నుంచి వీరు గుహలోనే తలదాచుకున్నారని స్థానిక పోలీసు ఇనస్పెక్టర్ రాజేంద్ర సింగ్ ఖతయిత్ వెల్లడించారు. "లాక్ డౌన్ కు ముందు వీరంతా మునీ కీ రేతి రీజియన్ లోని ఓ హోటల్ లో ఉండేవారు. లాక్ డౌన్ ప్రారంభమైన తరువాత వీరి వద్ద డబ్బులు అయిపోయాయి. తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఆహారం, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేస్తూ వీరు గుహలో కాలం గడుపుతున్నారు. వీరికి నేపాల్ కు చెందిన వ్యక్తి నిత్యావరాల కొనుగోలుకు సాయం చేస్తున్నాడు" అని ఆయన వెల్లడించారు.

కాగా, రుషీకేశ్ లో దాదాపు 700 మంది వరకూ విదేశీ టూరిస్టులు చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. వీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారన్న విషయాన్ని గుర్తించే పనిలో ఉన్నామని రాష్ట్ర టూరిజం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. వీరిని స్వదేశాలకు పంపించేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు తెలిపారు.

K V D Varma

K V D Varma

Next Story