Nathu Singh: కన్న పిల్లలు వదిలేయడంతో కఠిన నిర్ణయం.. రూ.1.5 కోట్ల ఆస్తి ప్రభుత్వానికి...

Nathu Singh: ఓ తండ్రి జీవితంలో ఓడిపోయాడు.

Arun Chilukuri
Published on: 7 March 2023 11:05 AM IST
Nathu Singh Donated Land Worth Rs 1.5 Crore To UP Government
X

Nathu Singh: కన్న పిల్లలు వదిలేయడంతో కఠిన నిర్ణయం.. రూ.1.5 కోట్ల ఆస్తి ప్రభుత్వానికి...

Nathu Singh: ఓ తండ్రి జీవితంలో ఓడిపోయాడు. కనీ, పెంచి పెద్దచేసిన పిల్లలు కన్న తండ్రిని వదిలేశారు. పేరుకు ఒక కొడుకు, నలుగులు కుమార్తెలున్నా ఆ వృద్దుడికి అనాథాశ్రమమే తోడు, నీడగా నిలిచింది. ఇన్నాళ్లూ కనిపెంచిన పిల్లలు... వదిలేయడంతో ఆ వృద్ధుడు కోటిన్నర విలువచేసే తన ఆస్తిని సర్కార్‌కు దానంగా రాసిచ్చాడు. పిల్లలపై కోపంతో ఆ కన్నతండ్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దేశంలో వృద్దుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కాటికి కాలు చాపిన వయసులో కృష్ణా రామా అనుకుంటూ జీవించాల్సిన వృద్దులు నానా కష్టాలు పడుతున్నారు. కన్నవాళ్లు కన్నతండ్రిని దగ్గరికి తీయకపోవడంతో వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. కనీ పెంచిన పిల్లలు కాదు పొమ్మనడంతో దిక్కులేక అనాథాశ్రయంవైపు ధీనంగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ కన్పిస్తున్న ఈ 85 ఏళ్ల వృద్ధునిది కూడా అలాంటి పరిస్థితే. కనీపెంచిన పిల్లలు కన్నతండ్రిని దూరం చేయడంతో ఆ వృద్ధుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కన్నపిల్లలు తనను వదిలేశారన్న బాధ, కోపంతో నాధూ సింగ్ అనే ఈ వృద్దుడు కోటిన్నర విలువైన తన ఆస్తిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వీలునామాగా రాసిచ్చాడు. అంతేకాదు..తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేశాడు. తాను చనిపోయిన తర్వాత తన కొడుకు, నలుగురు కుమార్తెలు అంత్యక్రియలకు హాజరుకానివ్వకూడదని తేల్చిచెప్పాడు.

ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో నివసిస్తున్న నాథూ సింగ్‌కు కోటిన్నర విలువైన ఇల్లు, స్థలం ఉంది. ఒక్కగానొక్క కొడుకు స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ సహరాన్‌పూర్‌లో నివసిస్తున్నాడు. నలుగురు కుమార్తెలకు వివాహం జరిగింది. భార్య చనిపోవడంతో వృద్ధుడు ఒంటరిగా ఉంటున్నాడు. 7నెలల క్రితం స్వగ్రామంలోని ఓ వృద్ధాశ్రమానికి వెళ్లిన 85 ఏళ్ల వృద్దుడు నాథూ సింగ్ అక్కడే జీవిస్తున్నాడు. తన పెద్ద కుటుంబం నుండి ఎవరూ తనను కలవడానికి రాకపోవడంతో గుండెలు బాదుకున్నాడు. పేరుకు ఓ కొడుకు, నలుగురు కుమార్తెలు ఉన్నా కూడా అనాధశ్రమంలో ఉన్న తనను చూసేందుకు ఒక్కరు కూడా రాకపోవడంతో..తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. దీంతో కోటిన్నర విలువచేసే తన భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి వీలునామాగా రాసిచ్చాడు. తాను మరణించిన తర్వాత అక్కడ ఆసుపత్రి లేదా పాఠశాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరాడు.

ఈ వయస్సులో, నేను నా కొడుకు, కోడలితో కలిసి జీవించాలి, కానీ వారు నన్ను బాగా చూసుకోలేదు. అందుకే ఆస్తిని ప్రభుత్వానికి రాసివ్వాలనుకుంటున్నానన్నాడు. వైద్య విద్యార్థుల పరిశోధన కోసం తన శరీరాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా వీలునామాలో రాశాడు. 6 నెలల క్రితం నుంచి తాను వృద్ధాశ్రమంలోనే ఉంటున్నానని..అయినా తనను చూసేందుకు కొడుకు, కూతుళ్లు ఎవరూ రాకపోవడంతో చాలా బాధపడ్డానని నాథూ సింగ్ తెలిపారు. అందుకే తన ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. నాథూసింగ్ అఫిడవిట్ తమకు అందిందని, ఆయన మరణానంతరం అది అమల్లోకి వస్తుందని ఏరియా సబ్-రిజిస్ట్రార్ తెలిపారు.

పండు వయసులో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నవాళ్లు కాదు పొమ్మనడంతో ఇలాంటి వృద్దులకు వృద్ధాశ్రమాలే తోడు, నీడలా నిలుస్తున్నాయి. ఏ దిక్కులేని వారికి దిక్సూచిలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండగా నిలుస్తున్నాయి. ఒక్క నాధూ సింగే కాదు..దేశంలో ఇలాంటి వృద్ధులు వందలు, వేలల్లోనే ఉన్నారు. అలాంటి వారందరికి నేనున్నానంటూ అనాథాశ్రమాలు ఆసరాగా ఉంటున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story