logo
జాతీయం

ప్రధాని పీఠంపై మమత, కేజ్రీవాల్‌ దృష్టి.. ఇద్దరిలో ఎవరికి ప్రజామోదం లభించే అవకాశం వుంది?

Mamata Banerjee and Arvind Kejriwal Targets PM Modi
X

ప్రధాని పీఠంపై మమత, కేజ్రీవాల్‌ దృష్టి.. ఇద్దరిలో ఎవరికి ప్రజామోదం లభించే అవకాశం వుంది?

Highlights

Prime Minister: ఇద్దరి గురి ఒక్కటే. ఇరువురి లక్ష్యం ఒక్కటే. గమ్యం, గమనం అత్యున్నత సింహాసనమే.

Prime Minister: ఇద్దరి గురి ఒక్కటే. ఇరువురి లక్ష్యం ఒక్కటే. గమ్యం, గమనం అత్యున్నత సింహాసనమే. ఆ శిఖరాన్ని అందుకునేందుకు ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్నారు. కలివిడిగా కాకుండా విడివిడిగా పరుగులు పెడుతున్నారు. కానీ వారు ఎదుర్కోబోయేది సామాన్య లీడర్‌ను కాదు. మాస్‌ నాయకుడు. మరి ఆ టాప్‌ లీడర్‌ను ఢీకొట్టే నాయకునిగా, ఇద్దరిలో జనం ఎవరిని గుర్తిస్తారు? ఎవరికి వీర తిలకం దిద్ది యుద్ధక్షేత్రంలోకి దింపుతారు?

నేషనల్‌ పాలిటిక్స్ డైనమిక్స్ మారుతున్నాయి. రెండు, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పాపులర్ సీఎంలు, ఇఫ్పుడు ఏకంగా ఢిల్లీ సింహాసనంపై మనసుపడుతున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధాని కాగలిగినది, మనమెందుకు కాకూడదన్న కోణంలో, పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అదే పని మీద వున్నారు.

మొదట అర్వింద్ కేజ్రీవాల్ సంగతి చూద్దాం. ఢిల్లీకే పరిమితమవుతుందనుకున్న ఆమ్‌ ఆద్మీ, పంజాబ్‌‌పై గురిపెట్టింది. పంజాబ్‌లో రాజకీయ గందరగోళం నెలకొని వుండటంతో, ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే మహిళలు, పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు వరాల వాన కురిపించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకూ, నెలకు రూ. 1000 అందివ్వనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం, ఇప్పుడక్కడ చర్చనీయాంశమైంది.

మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు కేజ్రీవాల్. కుటుంబంలో ఎంతమంది మహిళలున్నా, అందరికీ తలా వెయ్యి ఇస్తామన్న కేజ్రీవాల్, ప్రపంచంలోనే ఇదొక అతి పెద్ద మహిళా సాధికారిక కార్యక్రమం అవుతుందన్నారు కేజ్రీవాల్. అంతేకాదు, తాము పవర్‌లోకి వస్తే అందరికీ అందుబాటు ధరలో ఇసుక పాలసీ తెస్తామన్నారు. కరెంటు కోతల్లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేక వరాలు ప్రకటించారు కేజ్రీవాల్.

ఢిల్లీకే పరిమితమవుతుందనుకున్న ఆమ్‌ ఆద్మీ, పంజాబ్‌పై ఆశలు పెట్టుకోవడానికి చాలా కారణాలున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 112 స్థానాల్లో పోటీ చేసిన ఆప్, 20 స్థానాల్లో గెలిచింది. ప్రధాన రాజకీయ పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్ సాధించిన 15 సీట్ల కంటే, ఆప్‌‌కు ఐదు ఎక్కువొచ్చాయి. 77 సీట్లతో కాంగ్రెస్‌లో అధికారంలో వుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తోంది. ఈసారి పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ అధికారంలోకి రావడం ఖాయమని అనేక సర్వేలు ఘోషిస్తున్నాయి. పంజాబ్‌ మీదే అరవింద్ కేజ్రీవాల్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నా, యూపీ, గుజరాత్, గోవాలోనూ చక్రంతిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో వారణాసి నుంచి మోడీపై పోటీ చేసి, నేషనల్ లెవల్లో హైలెట్‌ అయ్యారు కేజ్రీవాల్.

మోడీ, షాల స్ట్రాటజీలను ఎదుర్కొని వరుసగా ఢిల్లీలో ఆప్‌ జెండా ఎగరేశారు. ఇప్పుడు రాష్ట్రాల్లోనూ విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. గోవాలో ఫుల్‌కాన్‌ట్రేట్ చేశారు. గుజరాత్‌లో ఈసారి చెలరేగిపోతామంటున్నారు కేజ్రీవాల్. ఇలా అనేక రాష్ట్రాల్లో విస్తరించి, ఆమ్‌ఆద్మీని జాతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ చెయ్యాలనుకుంటున్నారు కేజ్రీవాల్. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి, మోడీకి దీటైన ప్రత్యామ్నాయలీడర్‌గా‌, జనాల దృష్టిని ఆకర్షించి, పీఎం రేసులో పరుగెత్తాలని తపిస్తున్నారు. అందుకే పంజాబ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో, ఆప్‌ను స్ర్పెడ్‌ చేస్తున్నారు.

అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా పార్టీ విస్తరణపై ఎక్కవగా దృష్టిపెట్టారు. గోవా, యూపీలో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. అలాగే నార్త్ ఈస్ట్‌లోనూ టీఎంసీని విస్తరించాలని ప్రణాళికలు వేస్తున్నారు. మేఘాలయలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చారు దీదీ. ఆ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా ఉన్నారు. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్ర పక్షం తరపున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో కొంతమంది ఆ తర్వాత పార్టీ మారగా కాంగ్రెస్ సంఖ్యా బలం 17కు తగ్గింది. ఇప్పుడు ఇందులోని 12 మంది టీఎంసీ గూటికి చేరడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తృణమూల్ రాత్రికి రాత్రే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ మీద దీదీకి ఇంత కసి ఏంటి? అంతా పీకే డైరెక్షనా?

మమతా బెనర్జీ, ప్రశాంత్‌ కిశోర్‌లు కాంగ్రెస్‌కు వ్యతిరేకులేం కాదు. నరేంద్ర మోడీని సమిష్టిగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తోనే కలిసి ఫైట్‌ చెయ్యాలన్న దృక్పథం వున్నవారు. కానీ కూటమి నాయకత్వంపైనే విభేదాలు బ్లాస్ట్‌ అయ్యాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన పీకే, కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. మంచి పదవి కావాలని పట్టుపట్టారు. మొత్తం తన డైరెక్షన్‌లో పార్టీ సాగాలని కండీషన్ పెట్టారు. రాహుల్‌ను ముందుపెట్టి మోడీపై యుద్ధం చేస్తే, ఎవరూ చూడరని, కూటమి కెప్టెన్సీ బాధ్యతలను మమతలాంటి లీడర్లకు ఇవ్వాలన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఒప్పుకోలేదు.

దీంతో రగిలిపోయిన పీకే, ఏకంగా కాంగ్రెస్‌పైనే యుద్ధం ప్రకటించారు. మోడీని కాంగ్రెస్ ఏం చెయ్యలేదంటూ బీభత్సమైన విమర్శలు చేశారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను, తృణముల్‌ లేదా మరో పార్టీతో రీప్లేస్ చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగానే మేఘాలయాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఎంసీ గూటికి చేర్చి, కాంగ్రెస్‌పై ఎంతగా రగిలిపోతున్నాడో ట్రైలర్ ఇచ్చారు. మమత కూడా పీకే డైరెక్షన్‌లోనే, అనేక రాష్ట్రాల్లో పార్టీని విస్తరించుకుంటూ, మోడీని ఢీకొట్టే లీడర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు తపిస్తున్నారు.

అటు అర్వింద్ కేజ్రీవాల్, ఇటు మమతా బెనర్జీ, ఈ ఇద్దరు ప్రాంతీయ పార్టీల లీడర్లే, ఇప్పుడు జాతీయస్థాయిలో చెలరేగిపోయేందుకు రెడీ అవుతున్నారు. వేర్వేరుగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్వింద్ కేజ్రీవాల్ పంజాబ్‌‌పై కాన్‌సన్‌ట్రేట్ చేశారు. గోవా, యూపీలోనూ కాలు మోపాలనుకుంటున్నారు. ఇటు మమత కూడా గోవా, యూపీలతో పాటు నార్త్ ఈస్ట్ స్టేట్స్‌పై స్ట్రాటజీలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇద్దరికీ ప్రధానమంత్రి కలలున్నాయి. సుప్రీం సింహానంపై మోజుంది. కానీ రెండూ జాతీయ పార్టీలు కాదు. ఒకట్రెండు రాష్ట్రాలకే పరిమితం. అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటే తప్ప, మోడీని ఓడించే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకతను ఒక రూట్‌‌లో పెట్టాలంటే, ఐక్యత అవసరం. కానీ పీఎం కలల్లో విహరిస్తున్న వీరు, కలిసి సాగడం మాత్రం కనిపించడం లేదు. మిగతా

ప్రాంతీయ పార్టీలతో కనీసం మాట్లాడటం లేదు. మమత, కేజ్రీలు తామే అందరికంటే టాప్‌ అన్నట్టుగా హైలెట్ కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను కలుపుకుపోవడం లేదు. అంతేకాదు, కాంగ్రెస్‌‌‌ స్థానంలో తాము నిలదొక్కుకోవాలని ఆయా రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. పంజాబ్‌, గోవాలో కాంగ్రెస్‌ సంక్షోభాన్ని అనుకూలంగా మలచుకోవాలని ఆమ్‌ఆద్మీ ట్రై చేస్తుంటే, మేఘాలయాలో పీకేతో కలిసి, కాంగ్రెస్ మహావృక్షాలనే పీకేస్తున్నారు మమత. కానీ కాంగ్రెస్‌‌తో చేయి కలపకుండా, మోడీని గద్దెదించడం కష్టమన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.

మొత్తానికి మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు కొత్త శక్తులుగా అవతరించే అవకాశం వుంది. కానీ సౌత్‌లో మాత్రం పాగా వెయ్యలేరు. ప్రధానమంత్రి పీఠం అధిరోహించగల సంఖ్యాబలాన్ని ఒంటరిగా సాధించలేరు. సంకీర్ణ శకంపైనే నమ్మకాలు పెట్టుకుని, బలం పెంచుకునేందుకు మాత్రం గట్టిగానే ట్రై చేస్తున్నారు. మరి మోడీని ఎదుర్కొనే లీడర్‌గా జనం ఎవరిని గుర్తిస్తారు? కేజ్రీవాల్‌నా మమతా బెనర్జీనా? ఇద్దరూ కాదంటే మరో నేతనా?

Web TitleMamata Banerjee and Arvind Kejriwal Targets PM Modi
Next Story