లోక్ సభలో మారిపోతున్న నినాదాలు

లోక్ సభలో మారిపోతున్న నినాదాలు
x
Highlights

జై జవాన్...జైకిసాన్...వందేమాతరం లాంటి నినాదాలు ఒకప్పుడు చట్టసభల్లో వినిపించాయి. యావత్ దేశ ప్రజానీకాన్ని ఉర్రూతలూగించాయి. ఇప్పుడు మాత్రం చట్టసభల్లో...

జై జవాన్...జైకిసాన్...వందేమాతరం లాంటి నినాదాలు ఒకప్పుడు చట్టసభల్లో వినిపించాయి. యావత్ దేశ ప్రజానీకాన్ని ఉర్రూతలూగించాయి. ఇప్పుడు మాత్రం చట్టసభల్లో జైశ్రీరాం భారత్ మాతాకి జై అల్లా హో అక్బర్ లాంటి నినాదాలూ వినవస్తున్నాయి. ఏడు దశాబ్దాల కాలంలో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం ? చట్టసభల నిర్వహణ తీరుతెన్నులు మారిపోనున్నాయా ? కొత్త సంప్రదాయాలు రానున్నాయా ? లాంటి అంశాలపై ఆలోచనలు మొదలయ్యాయి.

దేశ ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం పార్లమెంట్. యావత్ దేశానికీ అది ఒక పవిత్ర స్థలం. ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసే ఘట్టం ఒక మహత్తర సన్నివేశం. అలాంటి సన్నివేశం ఇప్పుడు రచ్చగా మారింది. ప్రమాణ స్వీకారానికి నిర్దిష్ట నియమనిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘించేందుకు ఎంపీలు సిద్ధపడుతున్నారు. మరో వైపున ప్రమాణ స్వీకారం సందర్భంలో చోటు చేసుకుంటున్న నినాదాలు దేశంలో మారిపోతున్న ఆలోచనాధోరణులను ప్రతిబింబిస్తున్నాయి. ఆ నినాదాల్లోకి ఔచిత్యం సంగతి ఎలా ఉన్నా చివరకు అదెక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన ఇప్పుడు మొదలైంది.

ఎన్నికల ప్రక్రియనే కాదు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా సుదీర్ఘంగానే సాగింది. మొదటి రోజు కొందరు ఎంపీలు, మరుసటి రోజు కొందరు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనేది తదుపరి చట్టసభ నిర్వహణలో అతి ముఖ్యమైన ఘట్టం. ఎంతో సరళంగా, హుందాగా సాగిపోవాల్సిన ఆ ఘట్టం వివాదాలకు నిలయం కావడం ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగించేదిగా మారుతోంది.

చట్టసభల్లో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నిర్దిష్ట నియమనిబంధనలు ఉన్నాయి. సభ్యులు తమ ధ్రువపత్రాల్లో ఉన్న పేరు మీదనే ప్రమాణం చేయడం దైవం లేదా అంతరాత్మ సాక్షిగా మాత్రమే ప్రమాణం చేయడం లాంటివి ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అయినా కూడా కొంతమంది సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ఆ నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించారు. ఇలా చేయడం వెనుక వారి ఉద్దేశం చట్టసభల నిర్వహణ తీరుతెన్నుల్లో కొత్త సంప్రదాయాలను సృష్టించడం అనే విషయం స్పష్టమవుతోంది. సంప్రదాయాలు మారుతూ ఉంటాయనేది నిజం. కాకపోతే అవి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేందుకు తోడ్పడేవిగా సభ్యుల మధ్య, ప్రజల మధ్య స్నేహసంబంధాలను పెంచేవిగా మాత్రమే ఉండాలి. అంతే తప్ప వివాదాలను, ప్రజల మధ్య చీలికలను మరింత ప్రోత్సహించేవిగా ఉండకూడదు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా సాధ్వి ప్రగ్నా సింగ్ తన పేరులో గురువుల పేర్లను కూడా చేర్చేందుకు ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఆమె ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. ఇది కాస్తంత చిన్న సంఘటన మాత్రమే. అంతకు మించినవి కూడా చోటు చేసుకున్నాయి. కొందరు విపక్ష సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అధికార పక్ష సభ్యులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ఆ నినాదంలోని మంచి చెడులు పక్కనబెడితే అలాంటి నినాదాలు మాత్రం చట్టసభల్లో చెడు సంప్రదాయాలకు బీజం వేస్తాయనడంలో సందేహం లేదు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మీడియాలో కోట్లాది మంది చూస్తారు. ఆ కార్యక్రమం హుందాగా కొనసాగకపోతే చట్టసభలపై, ఆ సభల సభ్యులపై ప్రజలకు చిన్నచూపు ఏర్పడుతుంది. అంతిమంగా అంది ప్రజాస్వామ్యంపైనే చిన్న చూపు ఏర్పడేందుకు దారి తీస్తుంది.

చట్టసభల ప్రమాణ స్వీకారం అనేది కొత్త సభలో అత్యంత సాధారణంగా జరిగిపోవాల్సిన ఘట్టం. అదే నేడు వివాదాలమయం కావడం మాత్రం విచారకరం. ఇలాంటి ఘటనలు అలానే కొనసాగితే సంప్రదాయాలుగా స్థిరపడితే నినాదాలు శృతిమించి సభ్యుల మధ్య ముష్టిఘాతాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మరో వైపున ఈ నినాదాలు వివాదాలు వివిధ అంశాల్లో దేశంలో పెరిగిపోతున్న అసహనానికి ప్రతీకలుగా కూడా నిలుస్తున్నాయి.

నిన్న లోక్ సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తుండగా బీజేపీ సభ్యులు వందేమాతరం జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఒవైసీ తోటి సభ్యుల రెచ్చగొట్టే నినాదాలను పట్టించుకోలేదు. అదే సమయంలో ప్రమాణం ముగియగానే జై భీమ్...జై మీమ్....అల్లాహో అక్బర్ అని కూడా అన్నారు. ఆ విధంగా ఆయన తనను వెంటాడిన నినాదాలకు బదులిచ్చారు. కొంతమంది విపక్ష సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా బీజేపీ సభ్యులు జైశ్రీరాం అంటూ నినదించారు. ఆ విధంగా దేవుళ్ళు సైతం చట్టసభల్లో నినాదాలుగా మారిపోయారు. వసంత్ కుమార్ పాండా శ్రీరాముడి పేరిట ప్రమాణం చేశారు. మరికొందరు బీజేపీ సభ్యులు ప్రమాణ స్వీకారం పూర్తికాగానే భారత్ మాతా కీ జై జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అయితే అలాంటి నినాదాలు రికార్డుల్లోకి ఎక్కవని స్పీకర్ స్థానంలో ఉన్న వారు స్పష్టం చేశారు.

బీజేపీకి జై శ్రీరాం నినాదం ఎంతో ముఖ్యమైంది అనడంలో సందేహం లేదు. కాకపోతే చట్టసభల్లో సైతం ఆ నినాదాన్ని ప్రతిధ్వనింపజేయడం మాత్రం కొత్త సంప్రదాయాలకు తెర తీసినట్లయింది. రేపటి నాడు ఇతర మతస్తులు సైతం తమ దేవుళ్ల నినాదాలు చేస్తే పరిస్థితి ఏమవుతుంది ? అలాంటి సన్నివేశం ఊహించుకోడానికే భయమేస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యమని రాజ్యాంగంలో స్పష్టంగా ప్రకటించుకున్నాం. అలాంటి రాజ్యాంగానికి ప్రతిరూపమైన పార్లమెంట్ లోనూ మతపరమైన నినాదాలు చోటు చేసుకోవడం లౌకికవాదులను కలవరపరిచే అంశం. ఇప్పటి వరకూ పార్లమెంట్ వెలుపలికే పరిమితమైన నినాదాలు ఇప్పుడు పార్లమెంట్ లోనూ ప్రతిధ్వనిస్తున్నాయి.

చట్టసభలు ప్రజస్వామ్య మతానికి ఆలయాలు. ప్రజల అభిమతాలే అక్కడ ప్రాధాన్యం వహించాలి. దేశీయ క్రీడ కాని క్రికెట్ ను సైతం ఒక మతంగా చేసుకున్నప్పుడు క్రికెట్ ఆటగాళ్ళను దేవుళ్ళుగా ఆరాధిస్తున్నప్పుడు ఆ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని మనం ఎందుకు పాటించలేం ? మైనారిటీ భావాలకు రక్షణ ఉండాలి. అదే సమయంలో మెజారిటీ మనోగతాలకూ చెల్లుబాటు ఉండాలి. ఆ రెండూ సమతుల్యంతో ముందు సాగాలి. అప్పుడు మాత్రమే అది నిజమైన ప్రజాస్వామ్యమవుతుంది. ప్రజస్వామ్యానికి ప్రతిరూపాలు నిలిచే ఎంపీల హావభావాల్లో, ప్రసంగాల్లో, చేతల్లో ప్రజాస్వామ్యం ప్రతిబింబించాలి. అది మాత్రమే దేశానికి, దేశంలో ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories