భారత్‌పై కంత్రీ కంట్రీ ఎందుకు హద్దులు దాటుతోంది.. భారత మిలటరీ ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది..?

Is China Crossing the Line, Will India Retort Strongly
x

భారత్‌పై కంత్రీ కంట్రీ ఎందుకు హద్దులు దాటుతోంది.. భారత మిలటరీ ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది..?

Highlights

LAC: సరిహద్దుల్లో కంత్రీ కంట్రీ కవ్వింపులకు హద్దే లేకుండా పోతోంది.

LAC: సరిహద్దుల్లో కంత్రీ కంట్రీ కవ్వింపులకు హద్దే లేకుండా పోతోంది. మొన్నటికి మొన్న రెండు భారీ వంతెనలను నిర్మించిన చైనా రీసెంట్‌గా ఓ గ్రామాన్నే నిర్మించి భారత్‌తో ఢీ అంటోంది. అక్కడితో ఆగలేదు గ్రేజోన్ ఆపరేషన్లతో ఎల్ఏసీ దగ్గర యుద్ధవిమానాలతో రచ్చ రేపుతోంది. అయితే, చైనాకు ఇదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు భారత్ సైతం సిద్ధమంటోంది. ఇంతకూ, భారత్‌పై కంత్రీ కంట్రీ ఎందుకు హద్దులు దాటుతోంది..? తైవాన్‌ను బెదిరించినట్టే భారత్‌ను భయపెట్టాలనుకుంటోందా..? జిన్‌పింగ్ సేనలకు భారత మిలటరీ ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది..?

చర్చలు కొలిక్కి రానివ్వదు సరిహద్దుల్లో కుదురుగా ఉండదు అలా అని ప్రత్యక్ష యుద్ధానికి దిగే దమ్మూలేదు. పదే పదే కవ్వించి, అదునుచూసి వెన్నుపోటు పొడవటం మాత్రమే తెలుసు. ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి ఎల్‌ఏసీ వెంబడి ఉద్రిక్తతలు రేపుతోంది. శాంతి మాట ఏమాత్రం వశపట్టని కంత్రీ కంట్రీ భారత్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కొత్త కుట్రలకు తెరలేపుతోంది. ఎల్‌ఏసీ వెంబడి ఇప్పటి వరకూ సైనికపరమైన నిర్మాణాలు చేపడుతూ రెచ్చిపోయిన జిన్‌పింగ్ సర్కార్ రీసెంట్‌గా ఓ గ్రామాన్నే నిర్మించేసింది. అంతేనా, గ్రేజోన్ ఆపరేషన్స్‌కు తెరలేపి సరిహద్దుల్లో యుద్ధవాతావరణం సృష్టిస్తోంది. తైవాన్‌పై కాలుదువ్వడం, భూటాన్ భూభాగాన్ని ఆక్రమించడం, నేపాల్‌ సరిహద్దులపై కన్నేయడం లాంటి పరిణామాలతో ఇంటర్నేషనల్ విలన్‌గా మారిన చైనా తన తాజా తీరుతో పూర్తిగా బరితెగించినట్టు సంకేతాలిస్తోంది.

భారత్‌పై ట్రిగ్గర్ గురిపెట్టేందుకు ఉన్న మార్గాలన్నింటిపైనా జిన్‌పింగ్ సర్కార్ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇండియాను ఓవైపు కవ్విస్తూనే మరోవైపు యుద్ధం అంటూ వస్తే భారత్‌ సైన్యాన్ని ఎదుర్కొనేందుకున్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. రీసెంట్‌గా డోక్లాం సమీపంలో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించడం, అక్కడికి తమ దేశ పౌరులను తరలించడం లాంటి అంశాలు డ్రాగన్ కంట్రీ కుట్రకోణాన్ని బయట పెడుతున్నాయి. ఇప్పటికైతే ఆ గ్రామంలో ఉన్నది చైనా పౌరులే కానీ రానున్న రోజుల్లో డ్రాగన్ తన మిలటరీని అక్కడ దించబోతోందా అన్న ప్రశ్నే టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే డోక్లాం ప్రాంతంలో చైనా మిలటరీ చేరితే పరిస్థితులు దారుణంగా మారడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

నిజానికి డోక్లాం ప్రాంతంలో డ్రాగన్ నిర్మించిన గ్రామం చైనా భూభాగంలోనిది కాదు. భూటాన్ భూభాగంలోనిది. దాదాపు 10 కిలోమీటర్ల మేరకు భూటాన్‌ భూభాగాన్ని చైనా మింగేసింది. తాజాగా నిర్మించిన గ్రామానికి పాంగ్డా అని పేరు కూడా పెట్టింది. ఈ గ్రామం కార్లతో కిక్కిరిసిపోయి కనిపిస్తుండడంతో ఇప్పటికే అక్కడికి భారీగా పౌరులను తరలించిందని శాటిలైట్ ఇమేజ్‌లలో స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, ఇక్కడి జనావాసాల కోసం ఆల్‌వెదర్‌ క్యారేజ్‌వే నిర్మించారు. అమోచూ సమీపం నుంచి అత్యంత కీలకమైన డోక్లాం పీఠభూమి శిఖరాలపైకి చేరుకోవడం చాలా తేలిక. ఒక వేళ చైనా సైన్యం ఇక్కడకు వస్తే భారత్‌లోని సిలుగుడి కారిడార్‌ నేరుగా డ్రాగన్‌ గురిలోకి వస్తుంది. ఈ కారిడార్‌ భద్రతా పరంగా భారత్‌కు అత్యంత కీలకమైంది. ఈశాన్య రాష్ట్రాలను భారత్‌లోని మిగిలిన భూభాగాలకు కలిపేది ఈ కారిడారే. సరిగ్గా ఇలాంటి సానుకూలతలను దృష్టిలో ఉంచుకునే డ్రాగన్ కంట్రీ అక్కడ గ్రామాన్ని నిర్మించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఎల్ఏసీ వెంబడి గ్రేజోన్ ఆపరేషన్లను తీవ్రతరం చేసేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సరిహద్దుల్లో చైనా యుద్ధవిమానాల రణగొణులు మిన్నంటు తున్నాయి. రీసెంట్‌గా జరిగిన 16వ విడత భారత్‌-చైనాల కోర్‌ కమాండర్ల స్థాయి సమావేశంలో ఈ చర్యలను చైనా ప్రతినిధి సమర్ధించుకోవడం కూడా చైనా కుట్ర తీరుకు అద్ధం పడుతోంది. 16వ సైనిక సమావేశానికి సంబంధించిన అంశాలను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ డెయిలీలో కనీసం ప్రస్తావించలేదు. అదే సమయంలో భారత్‌ సరిహద్దుల్లో నిర్వహించిన చైనా వాయుసేన విన్యాసాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వాస్తవానికి ఈ సైనిక చర్చల్లో భారత్‌ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకపోవడం చైనాకు కంటగింపుగా మారింది. ఇందుకే గ్రేజోన్ ఆపరేషన్లతో సరిహద్దుల్లో రెచ్చిపోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు హాట్‌స్ప్రింగ్స్‌‌లో ఒక్కటైన పెట్రోలింగ్ పాయింట్ 15పైనా తుది నిర్ణయం తీసుకోలేదు. అలాగే, దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌లపై చర్చలకు కూడా చైనా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ, భారత్‌ మాత్రం వీటి వద్ద సైనిక బలగాల ఉపసంహరణ జరగాలని తేల్చిచెప్పడంతో ఈ మిలటరీ స్థాయి చర్చలు ఎలాంటి రిజల్ట్ తేలకుండానే ముగిశాయి. తాజాగా పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి వెళ్లే అంశంలో కొంత సానుకూల సంకేతాలు వస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, అక్కడి నుంచి డ్రాగన్ బలగాలు వెనక్కి మళ్లీతే కానీ నమ్మడానికి వీల్లేదు. ఇక వాస్తవాధీన రేఖ వద్ద సైనిక కార్యకలాపాలు అత్యంత సహజమని చైనా మిలటరీ సమర్ధించుకుంటోంది. జూన్‌, జులై నెలల్లో యుద్ధవిన్యాసాలపై ప్రశ్నించగా భారత్‌తో చేసుకొన్న ఒప్పందం ప్రకారమే వీటిని నిర్వహించినట్లు పేర్కొంది. కానీ వైమానిక దళ యుద్ధవిన్యాసాలపై మాత్రం డ్రాగన్ అధికారులు నీళ్లు నములుతున్నారు.

భారత్‌పై చైనా ఏస్థాయిలో కుట్రలు పన్నుతుందో చెప్పేందుకు మరో ఉదహరణ కనిపిస్తోంది. సరిహద్దుల్లో మోహరించాలని భావిస్తున్న అత్యాధునిక రాకెట్ వ్యవస్థలను ఇప్పటికే పరీక్షించింది. ది పీసీఎల్‌ 191 వ్యవస్థగా పిలిచే దీన్ని పశ్చిమ థియేటర్‌ కమాండ్‌లోని షింజియాంగ్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ ఇప్పటికే ఈ డేంజర్ రాకెటలను ఉపయోగిస్తోంది. తాజాగా పరీక్షించిన ఆయుధాల రేంజి 500 కిలోమీటర్ల వరకూ ఉంటుందని మిలటరీ ఎక్స్‌పర్ట్ అంచనా వేస్తున్నారు. ఇవి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవని పీఎల్‌ఏ చెబుతోంది. సరిహద్దుల్లో చైనా బల ప్రదర్శన కోసమే వీటిని పరీక్షించింది. ఇవి సరిహద్దుల వెంట భారత్‌కు చెందిన కీలక స్థావరాలను ధ్వంసం చేయగలవని జువా ఛెమింగ్‌లోని మిలటరీ సైన్స్‌ పరిశోధకుడు యువాన్‌ వాంగ్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌ దళాలకు అమెరికా అందజేసిన హైమార్స్‌ తరహాలో ఇవి పనిచేస్తాయి.

డ్రాగన్ కంట్రీ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి అసలు కారణం అంతర్జాతీయంగా భారత్ అనుసరిస్తున్న విధానాలే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రపంచ పెద్దన్నగా ఎదగాలని కలలు కంటున్న డ్రాగన్‌కు భారత్‌ నుంచే అసలు సవాళ్లు ఎదురవుతున్నాయి. రీసెంట్‌గా ఐ2యూ2 కూటమితో పశ్చిమాసియాలోనే డ్రాగన్‌ను ఇండియా ఢీకొట్టింది. అలాగే, అంతర్జాతీయ సమాజం ముందు వీలుచిక్కిన ప్రతిసారి డ్రాగన్ కంట్రీ కుట్ర సిద్ధాంతాలను బయటపెడుతూనే ఉంది. దీంతో సరిహద్దుల్లో నిర్మాణాలు, ఆయుధాల మోహరింపు, సైనిక విన్యాసాలు చేపడుతూ తైవాన్‌ను భయపెడుతున్నట్టే భారత్‌పు భయపెట్టాలని డ్రాగన్ భావిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, చైనా దూకుడుకు అదే స్థాయిలో చెక్ పెట్టేందుకు భారత్ సైతం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇప్పటికే అత్యాధునిక ఆయుధాలను ఎల్ఏసీకి తరలించడంపై ఫోకస్ చేసిన ఇండియన్ మిలటరీ అత్యాధునిక యుద్ధ విమానాలనూ అందుబాటులో ఉంచింది. అలాగే, సరిహద్దుల నుంచి 100 కిలోమీటర్ల లోపల వరకు నిర్మించే రహదారులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఇటీవలే మోడీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఎల్ఏసీకి చేరువలో నిర్మించే హైవే ప్రాజెక్టులపై చాలా వరకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. ఒక్కమాటలో చైనా ఒక్క అడుగు ముందుకేస్తే.. భారత్ పదడుగులు ముందుకేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చింది. మొత్తంగా డ్రాగన్ కంట్రీ చర్యలకు అంతే దీటుగా రియాక్టవుతూ రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసుకుంటోంది. ఇక రానున్న రోజుల్లో కంత్రీ కంట్రీకి భారత్ ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories