డ్రాగన్‌ కంట్రీకి షాక్‌ ఇచ్చిన భారత్‌

India Gave a Big Shock to Dragon Country
x

డ్రాగన్‌ కంట్రీకి షాక్‌ ఇచ్చిన భారత్‌ 

Highlights

India: ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు డ్రాగన్‌ కంట్రీ తహతహలాడుతోంది. మరోవైపు సరిహద్దుల్లోని శత్రుదేశాలతో కయ్యానికి కాలుదువ్వుతోంది.

India: ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు డ్రాగన్‌ కంట్రీ తహతహలాడుతోంది. మరోవైపు సరిహద్దుల్లోని శత్రుదేశాలతో కయ్యానికి కాలుదువ్వుతోంది. సాధ్యమైనంతగా పొరుగు దేశాలకు చెందిన భూభాగాలపై కన్నేసి సొంతం చేసుకోవడానికి యత్నిస్తోంది. తాజాగా భారత సరిహద్దులో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సరిహద్దులో రోడ్లు, వంతెనల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ సన్నద్ధమవుతోంది. దక్షిణాసియా దేశాలతో భారత్‌ బంధాలను బలోపేతం చేస్తోంది. బీజింగ్‌ ఎక్కడి నుంచైతే భారత్‌పై గురి పెట్టాలనుకుంటుందో.. ఆయా ప్రదేశాల నుంచే డ్రాగన్‌కు ముకుతాడు వేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి వియత్నాంలో పర్యటిస్తున్నారు. వియత్నాంతో సైనిక, రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నారు.

ప్రపంచాన్ని శాసించాలని చైనా తహతహలాడుతోంది. పలు దేశాలకు రుణాలకు ఇస్తూ ఆయా దేశాల్లోని పోర్టులను, ఎయిర్ పోర్టులను తన గుప్పిట్లో పెట్టుకుంటోంది. మరోవైపు సరిహద్దు దేశాలతో నిత్యం కయ్యానికి కాలుదువ్వుతోంది. సరిహద్దుల్లో ఉన్న భారత్‌, నేపాల్, మయన్మార్‌, భూటాన్‌ దేశాల భూభాగాలను కబలించేందుకు చైనా యత్నిస్తోంది. పాకిస్థాన్‌ను రెచ్చగొడుతూ నిత్యం భారత్‌పై విషం చిమ్మేందుకు చైనా యత్నిస్తోంది. ఇన్నాళ్లు శ్రీలంక పోర్టులను వాడుకుని భారత్‌ను భయపెట్టాలని చూసిన డ్రాగన్‌ కంట్రీకి అక్కడి పరిస్థితులు ఎదురుదెబ్బ కొట్టాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను చైనా అన్వేషిస్తోంది. ఈ క్రమంలో అండమాన్ నికోబార్‌ దీవులకు సమీపంలోని కాంబోడియాలోనూ డ్రాగన్‌ పాగా వేస్తోంది. అత్యంత రహస్యంగా అక్కడ సైనిక స్థావరాన్ని నిర్మించేందుకు యత్నిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా అమెరికా మీడియా సంస్థ ది వాషింగ్టన్‌ పోస్టు కథనం వెల్లడించింది. దీంతో చైనా రహస్య నిర్మాణం విషయం బయటకు పొక్కింది.

దక్షిణ చైనా సముద్రంలోని తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు ఇటీవల బీజింగ్‌ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో నిత్యం దక్షిణ చైనా సముద్రంలో సైనిక విన్యాసాలను నిర్వహిస్తూ తైవాన్‌ను కలవరపరుస్తోంది. అయితే తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటోంది. తైవాన్‌పై దాడికి దిగితే తమ సైన్యం సమాధానం ఇస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. చైనా సైతం దీటుగా స్పందించింది. తైవాన్ తమ భూభాగమంటూ దబాయిస్తోంది. ఈ క్రమంలో భారత్‌లోని పలు భూభాగాలను కూడా తమవని వాదిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు భూభాగాలకు పేర్లను కూడా పెట్టింది. ఆయా ఘటలనపై భారత్‌ కూడా తరచూ ఘాటుగానే బదులిస్తోంది. అయితే డ్రాగన్‌కు ముకుతాడు వేయాలంటే సరిహద్దు విషయమొక్కటి సరిపోదని భారత్‌ భావిస్తోంది. ఈ క్రమంలో దక్షిణాసియా దేశాలపై గురిపెట్టింది. తాజాగా చైనా సరిహద్దు దేశానికి భారత్‌ స్నేహ హస్తాన్ని చాటింది.

థాయిలాండ్‌ సముద్ర తీరంలోని కంబోడియాలో పాగావేయాలనుకున్న చైనాకు భారత్‌ షాక్‌ ఇచ్చింది. కంబోడియా సరిహద్దు దేశం వియాత్నంతో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్‌ అడుగులు వేసింది. వియత్నాంతో రక్షణ సంబంధాలను బలోపేతానికి ఒప్పందాలను చేసుకుంటోంది. వ్యూహాత్మకంగా వియత్నాంతో ఒప్పందం భారత్‌కు కలిసి రానున్నది. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వియాత్నంలో పర్యటిస్తున్నారు. డ్రాగన్‌ అడుగులకు చెక్‌ పెట్టేందుకు వియత్నాంతో రక్షణ, సైనిక ఒప్పందాలతో పాటు చైనా సముద్రంలోని ఇరు దేశాల వాణిజ్యానికి శ్రీకారం చుట్టారు. హనోయిలో జనరల్‌ ఫాన్‌వాన్‌ గియాంగ్‌తో రెండు పత్రాలపై సంతకాలు చేశారు. దక్షిణాదిలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ వ్యూహాత్మక సంబంధాలు ఇబ్బంది పెట్టేవే అని నిపుణులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య సైనిక సహరానికి, వ్యాపార ఒప్పందాలకు ఇది మరింత తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చైనా ఇన్నాళ్లు చేసిన నిర్వాకాలు ఇప్పుడిప్పుడే బయటపడున్నాయి. శ్రీలంక సంక్షోభానికి చైనానే కారణమని ఆ దేశ నాయకులు ఆరోపిస్తున్నారు. శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనా అప్పుల పాపంతోనే పాకిస్థాన్‌ కూడా అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాసియాలో చైనా అప్పుల వ్యవహారాన్ని గుర్తించిన పలు దేశాలు డ్రాగన్‌కు దూరంగా ఉంటున్నాయి. రుణాల కోసం గత్యంతరం లేక కొన్ని దేశాలు చైనాతో సన్నిహితంగా మెలుగుతున్నాయి. అలాంటి దేశాల్లో ఇప్పుడు కంబోడియా కూడా చేరింది. కంబోడియాలోనూ అచ్చం శ్రీలంకలో అమలు చేసిన ప్లాన్‌నే ప్రయోగిస్తోంది. అప్పులు, అభివృద్ధి పేరుతో అక్కడ పాగా వేసింది. కంబోడియాను పావుగా వాడుకుని దక్షిణాసియా దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని జిన్‌పింగ్ పావులు కదుపుతున్నారు. అయితే జిన్‌పింగ్‌ ఎత్తులను గమనించిన భారత్‌ అందుకు పైఎత్తులను వేస్తోంది.

నమ్మకమైన భాగస్వామ్యం కోసం చూస్తున్న చైనా దేశాలకు భారత్‌ మంచి మిత్ర దేశంగా కనిపిస్తోంది. చైనా తీరుతో తమ ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసుకునే కంటే.. భారత్‌తో స్నేహమే మేలని తలుస్తున్నాయి. అందులో భాగంగానే భారత్‌తో పలు ఒప్పందాలకు మందుకొస్తున్నాయి. దౌత్యపరంగా చైనాకు చెక్‌ పెట్టేందుకు ఇదే అదునుగా ఆయా దేశాలతో భారత్‌ స్నేహ హస్తం చాటుటోంది. చైనాకు ఎక్కడికక్కడ చెక్‌పెడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories