మతసామరస్యానికి ప్రతీకగా..మసీదులో హిందూ పెళ్లి

మతసామరస్యానికి ప్రతీకగా..మసీదులో హిందూ పెళ్లి
x
Highlights

హిందూ, ముస్లిం భాయి భాయి అనే మాటను నిజం అనడానికి ఈ పెళ్లి వేదికగా నిలిచింది. పసుపు కుంకుమలకు అల్లంత దూరాన ఉండే ముస్లింలు హిందూపెళ్లికి కట్న కానుకలు,...

హిందూ, ముస్లిం భాయి భాయి అనే మాటను నిజం అనడానికి ఈ పెళ్లి వేదికగా నిలిచింది. పసుపు కుంకుమలకు అల్లంత దూరాన ఉండే ముస్లింలు హిందూపెళ్లికి కట్న కానుకలు, లాంచనాలు ఇవ్వడం మాత్రమే కాకుండా మసీదులో హిందూ సాంప్రదాయాలతో పెళ్లి తంతు జరిపించారు. ఈ పెళ్లి కోసం మసీదు ముందు విద్యుత్ లైట్లతో డెకరేషన్ చేసారు. హిందూ పూజారి సమక్షంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి కూతురు అంజు, పెళ్లి కొడుకు శరత్ ను ఒక్కటి చేసారు. పేదింటి అమ్మాయిని అత్తారింటికి తరలించారు. అంగరంగ వైభవంగా జరిపించిన ఈ పెళ్లికి ఇరు మతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

పూర్తివివరాల్లోకెళ్తే కేరళలోని చెరువల్లి ముస్లిం జమాత్‌ మసీదులో ఈ అరుదైన సంఘటన జరిగింది. కేరళకు చెందిన అంజు పేద కుటుంబానికి చెందింది. అంజు తండ్రి గతేడాది గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అంజు కుటుంబం ఆర్థికంగా చాలా వెనుక బడింది. అటు అనుకోకుండా అంజు వివాహం సెట్ అవ్వడంతో ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితిలో అంజు తల్లి బిందు దిక్కు తోచని స్థితిలో మసీదు కమిటీని ఆశ్రయించింది. దీంతో ఆమె బాధను చూసిన మసీదు పెద్దలు ఆర్థిక సాయం చేయడంతో పాటు పెళ్లికి మసీదును కూడా ఇవ్వడానికి అంగీకరించారు. పెళ్లికి 10 సవర్ల బంగారంతో పాటు రెండు లక్షల కట్నం కూడా ఇచ్చారు మసీదు పెద్దలు. అంతే కాక పెళ్లిక హాజరైన బంధుమిత్రులకు పెళ్లి తరువాత 1000 మందికి శాకాహార విందు సైతం ఏర్పాటు చేశామని మసీదు కమిటీ కార్యదర్శి నుజుముదీన్‌ అలుమ్మూట్టిల్‌ చెప్పారు.

ఇక ఈ పెళ్లి విషయం తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్‌ ఫేస్‌బుక్‌ వేదికగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో మత సామరస్యానికి గుర్తుగా ఈ పెళ్లి నిలుస్తోందన్నారు. సీఏఏ, ఎన్నార్సీల పేరుతో దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఈ పెళ్లి ఆదర్శనీయమైనదని చెప్పారు. ''కేరళ ఒకటి…మేమంతా ఐక్యంగా ఉంటాం'' అని ఫేస్ బుక్ పోస్ట్ చేసారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories