Heavy Rains: కుంభవృష్టితో ఉత్తరాది అల్లకల్లోలం.. గత మూడు రోజులుగా దంచికొడుతున్న వానలు

Heavy Rains For The Last Three Days In North India
x

Heavy Rains: కుంభవృష్టితో ఉత్తరాది అల్లకల్లోలం.. గత మూడు రోజులుగా దంచికొడుతున్న వానలు

Highlights

Heavy Rains: మూడు రోజుల వ్యవధిలో 60 మందికి పైగా మృతి

Heavy Rains: ఉత్తరాది రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, యూపీ రాష్ర్టాల్లో గత మూడు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. నగరాలు, పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు, నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల పలు ఇండ్లు, భవనాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. సాధారణ జనజీవనం అతలాకుతలమైంది. ప్రభావిత వేలాది మంది ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. భారీ వర్షాలతో ఆయా రాష్ర్టాల్లోని నదుల్లోకి వరద నీరు పోటెత్తుతున్నది. వరద నీటిలో లారీలు, కార్లు వంటి వాహనాలతో పాటు రోడ్లు కూడా కొట్టుకుపొయిన ఘటనలు పలు ప్రాంతాల్లో చోటుచేసుకొన్నాయి.

కొండచరియలు విరిగిపడటం, వరదలు, ఇతర వర్షం సంబంధిత ఘటనల్లో ఉత్తరాది రాష్ర్టాల్లో గత మూడు రోజుల వ్యవధిలో 60 మందికి పైగా మరణించినట్టు తెలుస్తున్నది. యూపీలో 24 గంటల వ్యవధిలో పిడుగుపాటు, వరదల్లో కొట్టుకుపోవడం, ఇతర ఘటనల కారణంగా 34 మంది మరణించారని అధికారులు తెలిపారు. వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. హిమాచల్‌ వరదల్లో పలు చోట్ల 200 మందికి పైగా చిక్కుకుపోయారని, వారికి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. హర్యానాలోని అంబాలా-యమునానగర్‌ రహదారిపై వరద నీటిలో ఓ బస్సు చిక్కుకొని బోల్తాపడింది. దీంతో బస్సు టాప్‌పైకి ఎక్కిన 27 మంది ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది క్రేన్‌, తాడుల సాయంతో కాపాడారు.

గత 50 ఏండ్లలో రాష్ట్రం ఇంతటి వర్షాలను చూడలేదని హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సుఖు పేర్కొన్నారు. ఒక్క హిమాచల్‌లోనే 17 మంది చనిపోయారని తెలిపారు.4 వేల కోట్ల మేర ఆస్తి నష్టం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. హిమాచల్‌లో వెయ్యికి పైగా రహదారులను మూసివేశారు. పలు జిల్లాల్లో సాధారణం కంటే అనేక రెట్లు అధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. లాహౌల్‌ అండ్‌ స్పితి జిల్లాలో 37 రెట్లు అధికంగా వర్షం పడిందని ఐఎండీ తెలిపింది.

వర్షాల ప్రభావంతో పలు రాష్ర్టాల్లో బడులకు సెలవులు ప్రకటించారు. హిమాచల్‌లో ఈనెల 11 వరకు, పంజాబ్‌లో 13 వరకు పాఠశాలకు మూసివేస్తున్నట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో మంగళ, బుధవారాలు బడులు ఉండవని అధికారులు తెలిపారు.వర్ష విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ర్టాల్లో 39 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించినట్టు అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా రాష్ర్టాల యంత్రాల సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు.ఉత్తరాదితోపాటు దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నైరుతి రుతుపవనాల కాలంలో జూన్‌లో దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాత లోటును పూడ్చాయని ఐఎండీ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories