చంద్రయాన్ 2 ఖర్చు తెలుసా..?
చంద్రయాన్.. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. దాని కోసం ఇస్రో ఎంత ఖర్చు చేసిందో పార్లమెంట్ లో ప్రభుత్వం వెల్లడించింది.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్-2. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు పొందింది. చివరి క్షణాల్లో విక్రమ్ లాండర్ సాంకేతిక సమస్యలతో చంద్రునిపై కాలుపెట్టడం లో విఫలం అయినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ వెనుక మన శాస్త్రవేత్తల కృషిని యావద్దేశమూ అభినందించింది. ఇప్పుడు అదే స్ఫూర్తి తో మరో మారు చంద్రుని చేరడానికి సన్నాహాలు చేస్తోంది ఇస్రో. ఇదిలా ఉంటె, ఈ విషయం పై ఈరోజు పార్లమెంట్ లో ఆసక్తి కర చర్చ జరిగింది. లోక్ సభలో ఈ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఈ ప్రాజెక్టు ఖర్చు ఎంతయిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సవివరంగా సమాధానం ఇచ్చారు. ఆయన చంద్రయాన్ ఖర్చు గురించి ఏమని చెప్పారంటే..
"దేశంలోని ప్రతి భారతీయుడు గర్వపడేలా ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగించింది. జులై 22న GSLV MK III-M1 వాహక నౌక ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపింది. చంద్రయాన్-2 కక్ష్యను పెంచుకుంటూ పోయి 276 X 1,42,075 కి.మీకు చేర్చారు. ఐదు సార్లు కక్ష్యను పెంచారు. సెప్టెంబరు న సాఫ్ట్ ల్యాండింగ్‌లో భాగంగా విక్రమ్ ల్యాండరు చంద్రుడి ఉపరితలం వైపుగా దిగడం మొదలైంది. చంద్రుడి ఉపరితలానికి మరో 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండరులో సాంకేతిక సమస్యల తలెత్తినట్లు ఇస్రో ఛైర్మన్ కె. శివన్ ప్రకటించారు. అయినప్పటికీ ఇస్రో శ్రమను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మన దేశ జెన్నత్యాన్ని మరింత పెంచే విధంగా శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయింది" అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు.


