Chhattisgarh Encounter: ఒక్క సెల్ఫీ మావోయిస్టు పార్టీని మట్టుబెట్టిందా?

Chhattisgarh Encounter: ఒకప్పుడు రాజ్యాన్నే వణికించిన బలం వారిది. కాని ఇప్పుడు రాజ్యం వాళ్లపై దండయాత్ర చేస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 May 2025 4:27 PM IST
Did a Single Selfie Destroy the Maoist Party
X

Chhattisgarh Encounter: ఒక్క సెల్ఫీ మావోయిస్టు పార్టీని మట్టుబెట్టిందా? 

Chhattisgarh Encounter: ఒకప్పుడు రాజ్యాన్నే వణికించిన బలం వారిది. కాని ఇప్పుడు రాజ్యం వాళ్లపై దండయాత్ర చేస్తోంది. చెట్లనకా.. పుట్లనకా జల్లెడపడుతోంది. దండై కదలి దండకారణ్యాన్ని చుట్టుముట్టింది. రాజ్యం చేస్తున్న ఈ దండయాత్రతో దళం కకావికలమైయింది. ఏటికో దళపతిని చొప్పున మట్టుబెడుతూ ముందుకు సాగుతోంది. నాడు ఎర్రజెండా పట్టిన దేహాలు... నేడు నెత్తుటి ఎరుపుతో మృతదేహాలుగా మారుతున్నాయి. చిట్టడవిపై సేనలు పట్టుబిగిస్తుండగా...దళసభ్యులు చెట్టుకొకరు,పుట్టకొకరుగా చెల్లాచెదురు అయిపోతున్నారు. మరి దశాబ్ధాల చరిత్ర కలిగిన మావోయిస్టు పార్టీ పతనానికి కారణం ఏంటి? ఏ పొరపాటు వారి ఉనికిని ప్రశ్నార్ధకం చేసింది? ఏ ఏమరపాటు అన్నలను అంతం వైపు నడిపిస్తోంది..?

ఒక్క సెల్ఫీ మావోయిస్టుల ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ఔను మీరు విన్నది నిజమే...! ఓకే ఒక్క ఫోటో ఇప్పుడు మావోయిస్టు పార్టీ కకావికాలం కావడానికి కారణమైంది. ఒరిస్సా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రరెడ్డి. రామచంద్రారెడ్డి దిగిన ఈ సెల్ఫీ ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా ముఖ్యనేతలు సంచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు తెలిసేలా చేసింది.

ఒరిస్సా మావోయిస్టు పార్టీ ఏడుగురు అగ్రనేతల్లో ఒకరు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి. ఎప్పుడో 1990 సమయంలో పీపుల్స్ వార్‌లో చేరారు. ఆ తర్వాతి కాలంలో మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఏవోబీ మిలటరీ ఆపరేషన్స్ చీఫ్‌గా ఎదిగారు. దీంతో సుమారు 35 ఏళ్ల పాటు చలపతి ఎలా ఉంటారన్నది పోలీసులకు తెలియలేదు. అంత అప్రమత్తంగా వ్యవహరించారు చలపతి. ఒకరకంగా చెప్పాలంటే ధైర్యంగానే జనంలోకి వచ్చారు చలపతి. అయితే ఆయన దిగిన ఒకే ఒక్క సెల్ఫీ పరిస్థితిని మార్చేసింది.

చలపతి ఏవోబీ ఆంధ్రా-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్‌గా ఉన్న సమయంలో తన భార్యతో దిగిన సెల్ఫీ బయటపడటంతో ఆయనపై భద్రతా బలగాల ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సెల్ఫీ ద్వారా చలపతి ఎలా ఉంటాడో గుర్తించిన పోలీసులు ఆయనపై కోటి రివార్డు ప్రకటించారు. తాజాగా ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో చలపతి మృతి చెందడంతో సెల్ఫీ విషయం బయటకు వచ్చింది.

చలపతి, అరుణ అలియాస్ చైతన్యను ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఓ సమయంలో భార్యతో కలిసి సెల్ఫీ దిగారు. ఆ ఫొటో ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ 2016లో ఏపీలో ఓ ఎదురుకాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులకు దొరికింది. చలపతి ఎవరో.. ఎలా ఉంటారన్నది అప్పుడే పోలీసులు తెలిసిపోయింది. దీనితో పోలీసులు ఆయనపై తీవ్రంగా నిఘా పెట్టారు. కోటి రూపాయలు రివార్డు కూడా ప్రకటించారు. దీనితో చలపతి కదలికలు కష్టమైపోయాయి. ఎక్కడికి వెళ్లినా కనీసం 10, 12 మంది సాయుధ మావోయిస్టుల రక్షణ మధ్యే వెళ్లేవారు. గత మూడేళ్ళుగా నిఘా పెంచిన పోలీసులు ఫోన్‌లో ఉన్న డేటా ఆధారంగా చలపతి సంచరించే ప్రాంతాలుపై కుంబింగ్ నిర్వహించడంతో తాజాగా ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో చలపతి పోలీసుల చేతికి చిక్కి కాల్పుల్లో మృతి చెందారు.

ఇలా ఒక్క సెల్ఫీతో మావోయిస్టు అగ్రనేతను వెతుక్కుంటూ భద్రతా దళాలు సాగించిన వేటలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. దండాకారణ్యంలో సాగిన ఈ దండయాత్రతో దళం ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story