మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం.. అస్త్రశస్త్రాలతో పాలక, విపక్షాలు రెడీ.. సభ దద్దరిల్లడం పక్కా..!

No Confidence Motion 2023: బలం నిరూపించుకునేందుకు బీజేపీకి కావాల్సిన సభ్యుల సంఖ్య 272

Shekhar G
Published on: 7 Aug 2023 6:15 PM IST
Debate On No Confidence Motion In Indian Parliament
X

మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం.. అస్త్రశస్త్రాలతో పాలక, విపక్షాలు రెడీ.. సభ దద్దరిల్లడం పక్కా..!

No Confidence Motion 2023: మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌‌సభలో రేపు చర్చ జరగనుంది. ఇందుకోసం పాలక, విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పాలకవర్గాన్ని గట్టిగా నిలదీస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. మరోవైపు, బీజేపీ.. తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.

ఈ చర్చలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ చర్చను ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపుర్ హింసపై పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. బుధ, గురు వారాల్లోనూ అవిశ్వాస తీర్మానంపై లోక్​సభలో చర్చ కొనసాగనుంది. ఈ నెల 10న ప్రధాని మోడీ తీర్మానంపై మాట్లాడనున్నారు. ఈ నెల 11న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.

అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టింది. గతవారం దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. మణిపుర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోడీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే, సభలో మణిపుర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తద్వారా ప్రధానితో మాట్లాడించవచ్చని భావిస్తున్నాయి. పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్.. సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు.

ప్రభుత్వాన్ని పడగొట్టే బలం విపక్ష కూటమికి లేదు. లోక్‌సభలో ఎన్‌డీఏకు 331 మంది సభ్యుల బలం ఉంది. ఒక్క బీజేపీకే 303 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు, ఇండియా కూటమికి 144 మంది ఎంపీలు ఉన్నారు. తటస్థంగా ఉన్న బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ పార్టీలకు 70 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైసీపీ, బీజేడీ పార్టీల ఎంపీలు.. తీర్మానాన్ని వ్యతిరేకించనున్నట్లు తెలిపారు. ఈ లెక్కన ఎన్​డీఏపై ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అవిశ్వాస తీర్మానం వల్ల మోడీ సర్కారుకు వచ్చిన నష్టమేమీ లేకపోయినా.. ఓటింగ్ సరళి ఎలా ఉంటుందోననే విషయంపై ఆసక్తి నెలకొంది.

Shekhar G

Shekhar G

Next Story