సరిహద్దుల్లో చైనా చిల్లర చేష్టలు..!

సరిహద్దుల్లో చైనా చిల్లర చేష్టలు..!
x
Highlights

చైనా... మళ్లీ చిల్లరమల్లర చేష్టలు చేస్తోంది. గిల్లి కయ్యం పెట్టుకునే పిచ్చి వేషాలు వేస్తోంది. సరిహద్దుల్లో ఉడుకుతున్న రక్తాన్ని మరింతగా సలసలా...

చైనా... మళ్లీ చిల్లరమల్లర చేష్టలు చేస్తోంది. గిల్లి కయ్యం పెట్టుకునే పిచ్చి వేషాలు వేస్తోంది. సరిహద్దుల్లో ఉడుకుతున్న రక్తాన్ని మరింతగా సలసలా కాగిస్తోంది. మన సైనికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది. దైపాక్షిక పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వేళ వెర్రి పనులు చేస్తూ మనల్ని కవ్వించాలని చూస్తోంది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. భారత జవాన్లను రెచ్చగొడుతూ వారి ఏకాగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. మొన్నటికి మొన్నే వార్నింగ్ షాట్ ఫైరింగ్‌కు దిగిన చైనా ఈసారి తన రూటు మార్చింది. వాస్తవాధీన రేఖ వెంబడి కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తోన్న మన భారత జవాన్లతో మైండ్‌గేమ్‌ మొదలుపెట్టింది. ఇంతకీ డ్రాగన్‌ కంట్రీ చేస్తున్న డర్టీ వేషాలేంటి? వాచ్‌ దిస్‌ స్టోరీ.

మన సరిహద్దులో చైనా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోంది. పిచ్చిపట్టినట్టు వేషాలు వేస్తోంది. దాదాపు ఐదు నెలలుగా భారత్, చైనా బోర్డర్‌లో ఉన్న ఉద్రిక్తతలను పట్టించుకోకుండా చెలరేగిపోతోంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రాకపోగా మరింతగా కవ్వించేందుకు రెడీ అవుతోంది. మొత్తంగా మనతో మైండ్‌గేమ్‌ ఆడుతూ వార్‌ ఆఫ్‌ ఆర్ట్‌ను ఆర్డర్‌లో పెడుతోంది.

సరిహద్దుల్లో తూర్పు లడఖ్ వద్ద చైనా సైన్యం కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల వాస్తవాధీన రేఖ వద్ద 45 ఏళ్ల తర్వాత కాల్పులకు తెగబడ్డ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈసారి తన వ్యూహాన్ని మార్చింది. కీలక స్థానాలపై మన సైన్యం పట్టుసాధించడంతో చైనాకు కంటగింపుగా మారింది. అందుకే మన జవాన్ల ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో డ్రాగన్ మైండ్‌గేమ్‌ను ఆరంభించింది.

వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగాంగ్ సరస్సు సౌత్‌జోన్, ఫింగర్-4, మోల్డో గ్యారిసన్, చుషుల్ సెక్టార్‌లో చైనా లౌడ్ స్పీకర్లను ఏర్పాటుచేసింది. అక్కడి నుంచి నెగెటివ్ వైబ్రేషన్స్ కలిగించే పంజాబీ పాటలను ప్లే చేస్తూ భారత సైనికుల సహనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. శత్రువులపై మానసిక యుద్ధానికి దిగడం వెన్నతో పెట్టిన విద్యగా పెట్టుకున్న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 1990 దశకం నాటి పంజాబీ పాటలను వినిపిస్తూ రెచ్చగొడుతోంది.

ఎత్తయిన ప్రాంతాల్లో భారత సైనికులు పాగావేయడంతో ఏకాగ్రతను దెబ్బతీయడానికి లౌడ్ స్పీకర్లలో పంజాబీ పాటలు వినిపించడమే కాదు, హిందీలో వార్నింగ్‌లు ఇస్తోంది. అయితే, మన సైనికులు శత్రు సైన్యం వినిపిస్తున్న సంగీతాన్ని విని ఆస్వాదిస్తున్నారట. సీపీఎల్ఏ అంటే చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ మన దళాలలో అసంతృప్తిని కలిగించడానికి ఇలా ప్రయత్నిస్తోందని భారత సైన్యం అంటోంది. అయితే ఇలాంటి మానసిక కార్యకలాపాలు కఠినమైన యుద్ధ సైనికులను ఇబ్బంది పెట్టలేవంటూ ధైర్యంగా చెబుతోంది.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా.. ప్రస్తుతం అదే విధానాన్ని అవలంభిస్తోంది. ఆగస్టు 29, 30లో వార్నింగ్ షాట్ ఫైరింగ్‌కు పాల్పడిన తరువాత, కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను భారత జవాన్లు స్వాధీనం చేసుకోవడంతో లౌడ్ స్పీకర్లతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చైనా ప్రారంభించింది. చైనా సైనికుల తాజా చర్యను ఆర్ట్ ఆఫ్ వార్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బకొట్టి, అశాంతికి గురి చేయడానికి ఈ పిచ్చి పనులు చేస్తుంటుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఆయుధాలతో యుద్ధం చేయకుండా శత్రువులపై మానసికంగా పైచేయి సాధించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుండటం చైనాకు అలవాటే.

చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి, భారీ ఎత్తున ఆయుధాలతో ఉన్న రెండుదేశాల సైన్యాల మధ్య తరచూ గాల్లోకి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చైనా పీపుల్స్ ఆర్మీ కొత్త ఎత్తులు వేస్తోంది. ప్రస్తుతం సరిహద్దులకు ఆవల చైనా సైనికులు, ఇటువైపున భారత బలగాల వద్ద యుద్ధ ట్యాంకులు, హోవిట్జర్ గన్స్, భుజాలపై ఉంచుకుని ఫైరింగ్ చేయగల మిసైల్స్ భారీగానే ఉన్నా.. సైకాలాజికల్‌ మైండ్‌ గేమ్‌తో మనల్ని రెచ్చగొట్టేందుకు చైనా ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.

ఆగస్టు 29 నుంచి కనీసం నాలుగుసార్లు ఇరువైపులా నుంచి గాల్లోకి తూటాలు పేలాయి. ఆరో విడత కమాండర్ స్థాయి చర్చల ఫలితాల కోసం రెండు దేశాల సైన్యం ఎదురు చూస్తోంది. ఈ సమస్యకు ద్వైపాక్షిక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు సాగుతున్న వేళ, చైనా ఆర్మీ కొత్త ఎత్తుగడలకు దిగుతూ వ్యూహాన్ని మార్చింది.

మన భారత సైన్యం చెబుతున్న వివరాల ప్రకారం... సరిహద్దులకు లౌడ్ స్పీకర్లను తీసుకుని వచ్చిన చైనా సైనికులు పంజాబీ పాటలను వినిపిస్తూ, ఆపై హిందీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారట. అయితే, మన సైనికులు ఆ సంగీతాన్ని విని ఆస్వాదిస్తున్నారట. వాస్తవానికి మన జవాన్లలో అసంతృప్తిని పెంచి, మనల్ని రెచ్చగొట్టాలని చైనా సైన్యం చూస్తోంది. అయితే, ఎంతో యుద్ధతంత్రం తెలిసిన మన జవాన్ల మానసిక స్థితి అందుకు లొంగడం లేదు సరికదా వారి సంగీతాన్ని విని ఆనందిస్తుండటం చైనీయులకు మరింత పిచ్చెక్కిస్తోందట.

ప్రస్తుతం రెండు దేశాల సైనికులూ, సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉన్నారు. సైనికాధికారుల స్థాయి చర్చలకు భారత్ సిద్ధంగానే ఉన్నా, సీపీఎల్ఏ మాత్రం ఇంకా తేదీని నిర్ణయించడం లేదు. రోజులు గడుస్తున్నా, చైనా నుంచి చర్చల దిశగా అడుగులు పడటంలేదు. భారత సైన్యం మంచు కొండల్లోని అత్యంత ఎత్తయిన ప్రాంతాలను ఆక్రమించి, అక్కడికి ఆయుధ సామాగ్రిని తరలించడంతో, చైనా దళాలు వెనుకంజ వేసి ఉంటాయన్నది మన అంచనా. ముఖ్యంగా పాంగాంగ్, ట్సో-చుసుల్ ప్రాంతాల్లో మన సైన్యం, చైనా కన్నా ఎంతో ఎత్తులో మకాం వేయడం వారిపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపిస్తోందన్నది విశ్లేషకుల మాట.

ఈ ప్రాంతాల్లో మరింత ఎత్తయిన ప్రాంతాలకు చేరేందుకు చైనా జవాన్లు తీవ్రంగా శ్రమిస్తూ, గాల్లోకి కాల్పులు జరుపుతూ, దూకుడుగా వ్యవహరిస్తూ, ఇండియాను రెచ్చగొడుతున్నారని, భారత జవాన్లు సంయమనంతో వ్యవహరిస్తూ, వారికి అదే రీతిలో సమాధానాన్ని ఇచ్చి అడ్డుకుంటున్నారు. కమ్యూనిజం భావజాలంతో కూడుకున్న రెచ్చగొట్టే విధానాలను చైనా తరచూ అనుసరిస్తుంటుంది. తాజాగా సరిహద్దుల్లో అదే వ్యూహంతో భారత జవాన్లపై మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నాలకు తెర తీసింది.

నేరుగా యుద్ధానికి దిగకుండానే శత్రువును మానసికంగా దెబ్బతీయడమనే పద్ధతిని చైనా 1962లోనే భారత్‌పై ప్రయోగించింది. ఇప్పుడు మరోసారి అదే పద్ధతిని అవలంభిస్తోంది. పూర్తిగా కమ్యూనిజం భావజాలంతో రెచ్చగొట్టే విధానాన్ని అనుసరిస్తోంది. నెగెటివ్ ఇంపాక్ట్ కలిగే పంజాబీ పాటల్ని విన్పించడం ద్వారా సరిహద్దు వద్ద ఉన్న భారతీయ సైనికుల ఏకాగ్రతను దెబ్బకొట్టడమే చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది. కాకపోతే మనకున్న వార్‌ నాలెడ్జ్‌తో వారిని సైడ్‌ చేయడం పక్కానే కనిపిస్తోంది. చూద్దాం. రేపు రేపు ఇంకేం జరగబోతోందో!!

Show Full Article
Print Article
Next Story
More Stories