ప్రపంచవ్యాప్తంగా చైనా బజార్ కు దెబ్బ.. మహోద్యమంగా మారుతున్న స్వదేశీ..

ప్రపంచవ్యాప్తంగా చైనా బజార్ కు దెబ్బ.. మహోద్యమంగా మారుతున్న స్వదేశీ..
x
Highlights

కరోనా కారణంగా స్వదేశీ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో మోడీ చెప్పిన మేడ్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ఇండియా నినాదాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి....

కరోనా కారణంగా స్వదేశీ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో మోడీ చెప్పిన మేడ్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ఇండియా నినాదాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాడు కాంగ్రెస్ హయాంలో గ్లోబలైజేషన్ కు పరుగులు తీసిన భారత్ ఇప్పుడు బీజేపీ హయాంలో లోకలైజేషన్ దిశగా ఉరకలు వేస్తోంది. లోకలైజేషన్ కల నిజమైతే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కూడా నిజమవుతుంది. మరి ఆ దిశగా మనం అడుగులు వేయగలుగుతామా దాని గురించే ఈ రోజు మనం మాట్లాడుకుందాం.

ప్రధాని మోడీ ఏమన్నారో విన్నారుగా ఏ దేశం పేరును ఆయన నేరుగా ప్రస్తావించనప్పటికీ మాటల్లో సారం మాత్రం విదేశీ వస్తు బహిష్కరణనే. స్వాతంత్ర్య పోరాటంలో ఒక వెలుగు వెలిగిన విదేశీ వస్తు బహిష్కరణ మరోసారి తెరపైకి వచ్చింది. లోకల్...వోకల్....ఇదీ తాజాగా మోడీ నినాదం. స్వదేశీ వస్తువులనే కొందాం అనడంతో మాత్రమే ప్రధాని మోడీ ఆగిపోలేదు. మనం కొనే స్వదేశీ వస్తువుల గురించి గర్వంగా చాటిచెబుదాం అని కూడా అన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీయులంతా కూడా స్వదేశీ ఉత్పాదనలకు బ్రాండ్ అంబాసడర్లుగా మారనున్నారు. అదే గనుక నిజమైతే ఏం జరుగనుందో చూద్దాం.

కరోనా నేపథ్యంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ అతలాకుతలమైపోయాయి. ప్రతీ దేశం కూడా ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. ఏ దేశానికి ఆ దేశం తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. భారత్ కూడా అందుకు మినహాయింపు కాదు. తాజాగా కరోనా కష్టకాలంతో భారత్ లో మరోసారి స్వదేశీ వస్తు వినియోగం తెరపైకి వచ్చింది. మొన్నటి దాకా దేశంలో గల్లీకో చైనా బజార్ ను చూశాం. మాల్స్ మొదలుకొని ఇంటి పక్క కిరాణా కొట్టు దాకా అన్ని చోట్లా చైనా వస్తువులనే చూశాం. పిల్లలు ఆడుకునే బొమ్మలు మొదలుకొని స్మార్ట్ ఫోన్ల దాకా టెలికాం ఉపకరణాలు మొదలుకొని వైద్య ఉపకరణాల దాకా అన్నీ చైనా వస్తువులే. పిన్నులు, పెన్నులు, చివరకు పతంగి దారానికి జోడించే మాంజా కూడా చైనా తయారీనే. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా దేశానికి ఓ పెద్ద పాఠం నేర్పింది. కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య ఉపకరణాల లోటు దేశీయంగా వాటిని తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అంతే కాదు దేశీయ పరిశ్రమలను కాపాడుకోవాల్సిన బాధ్యతనూ గుర్తు చేసింది. ఇక త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాల్లో స్వదేశీ బజార్ లు వెల్లువెత్తే అవకాశం ఉంది.

ప్రపంచం లోని అన్ని దేశాలనూ చైనా వస్తువులు ముంచెత్తాయి. భారత్ అని మాత్రమే కాదు అమెరికాతో సహా దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారిపోతున్నది. కరోనా పై చైనా అనుసరించిన ధోరణికి వ్యతిరేకంగా అన్ని దేశాలూ ఒక్కటవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు చైనాతో వాణిజ్య యుద్ధాలు ప్రారంభించాయి. కరోనా నేర్పిన ఆర్థిక పాఠాల నేపథ్యంలో చైనా వస్తువుల బారి నుంచి తమ పరిశ్రమలను కాపాడుకునేందుకు సన్నద్ధమయ్యాయి. భారత్ సైతం అదే బాట పట్టింది. ప్రధాని మోడీ స్వదేశీ పిలుపు ఇచ్చిన 24 గంటలలోపే ఆ ప్రకంపనలు మొదలయ్యాయి. సాయుధ బలగాల క్యాంటీన్లలో ఇకపై దేశీయ ఉత్పాదనలను మాత్రమే విక్రయించనున్నారు. సైనిక సిబ్బంది క్యాంటీన్ల విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాజాగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఒక స్థాయి దాకా గ్లోబల్ టెండర్లు రద్దయిపోయాయి. ఇక ప్రభుత్వంతో కలసి పని చేస్తున్న వివిధ సంస్థలు సైతం ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే దేశంలో కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థలకు మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చు.

ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అవి ఆశాజనకంగానే ఉన్నపప్పటికీ ఆచరణలో ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి.

గతంలోనూ చిన్న, మధ్యతరహా సంస్థలకు అనేక ప్రోత్సహకాలు ఉన్నా అవేవీ ఆచరణలో కనిపించలేదు. నిజానికి మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలే. ఎంఎస్ ఎంఈలుగా వీటిని వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కూడా కుటుంబ వ్యాపారాలుగా కొనసాగుతున్నాయి. ఈ తరహా ఆర్థిక వ్యవస్థనే ఫ్యామిలీ ఎకానమీగా చెబుతున్నారు. జీడీపీలో 50 నుంచి 60 శాతం మేరకు ఇవే సమకూరుస్తున్నాయి. నిజానికి పెద్ద పెద్ద కంపెనీల మొత్తం వాటా జీడీపీలో 5 శాతానికి మించడం లేదు. అయినా కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలకు దక్కుతున్న ప్రాధాన్యం చిన్న, మధ్యతరహా సంస్థలకు దక్కడం లేదు. బ్యాంకుల నిబంధనలు సైతం వీటి పట్ల కఠినంగానే ఉంటున్నాయి. ప్రధాని మోడీ చెబుతున్నట్లుగా స్వదేశీ వస్తు వినియోగం అధికం కావాలంటే ఫ్యామిలీ ఎకానమీలోని సంస్థలను కాపాడుకోవాలి. వాటి ఉత్పాదనలు విదేశీ ఉత్పాదనలతో పోటీపడగలిగేలా చేయాలి. అన్నిటి కంటే ముఖ్యంగా ప్రజల్లో కావాల్సింది దేశభక్తి. స్వదేశీ ఉత్పత్తులను కాపాడుకోవాలనే తపన. అవే గనుక ఉంటే మార్కెట్లో ఎన్ని విదేశీ వస్తువులున్నా స్వదేశీ వస్తువులకు ఆదరణ పెరగడం ఖాయం

స్వదేశీ వస్తు వినియోగం భావనలో ప్రధాని మోడీ కీలక మార్పు తీసుకువచ్చారు. మేక్ ఇన్ ఇండియా...మేడ్ ఫర్ ఇండియా నినాదంతో స్వదేశీ వస్తువుల నిర్వచనం పరిధి పెరిగిపోయింది. ఇక మరో వైపున భారత ఆర్థిక వ్యవస్థ చైనా వస్తువుల పై ఆధారపడకుండా ఉండడం సాధ్యమా అనేది కూడా కీలకంగా మారింది. చైనా నుంచి తరలిపోయే కంపెనీలను ఆకట్టుకునేందుకు సైతం భారత్ ప్రయత్నిస్తోంది. ఆర్థికాంశాలతో చైనా చేస్తున్న రాజకీయం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

స్వదేశీ వస్తు వినియోగం అంటే దేశీయ కంపెనీలు తయారు చేసే వాటిని మాత్రమే కొనడం మాత్రమే కాదు. మన దేశంలో మన కోసం విదేశీ కంపెనీలు స్థానికంగా తయారు చేస్తున్న వాటిని కొనడం కూడా స్వదేశీ వస్తు వినియోగం కిందకే వస్తుంది. ప్రధాని మోడీ ఇచ్చిన మేడ్ ఇన్ ఇండియా....మేక్ ఫర్ ఇండియా నినాదాలతో ఎన్నో విదేశీ కంపెనీలు సైతం స్థానిక ముడిపదార్థాలతో, స్థానిక కార్మికులతో వివిధ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. చైనా తో సంబంధం లేకుండా మన ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించగలదా అన్నదే ఇప్పుడే కీలకంగా మారింది. భారత్ చైనా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటోంది. టెలికాం, ఫార్మా, మొబైల్ ఫోన్స్ లాంటి రంగాలు చైనా పైనే ఆధారపడ్డాయి. వాహన రంగం, ఎలక్ట్రానిక్స్, స్టీల్ లాంటి వాటిల్లో మనకు చైనాయే దిక్కు. ఇక దేశీయ కంపెనీల్లో చైనా పెట్టుబడులను నిరోధించడం కూడా ముఖ్యంగా మారింది. భారత్ ఇప్పటికే ఈ దిశలో చర్యలు తీసుకుంది. నిబంధనలను కఠినతరం చేసింది.

స్వదేశీ వస్తు వినియోగం భావన భారత్ కు మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు అన్ని దేశాలూ ఇదే బాట పడుతున్నాయి. అగ్రరాజ్యాలు ఇప్పటికే చైనాకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు చైనాతో వాణిజ్య యుద్ధం మొదలెట్టాయి. ఇక్కడ కూడా చైనా తన రాజకీయం మొదలెట్టింది. తాజాగా అమెరికా కోరుకుంటున్న విధంగా కొన్ని ఉత్పత్తులపై అదనపు సుంకాలు ఎత్తివేసింది. మరో వైపున ఆస్ట్రేలియాతో మాత్రం వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిపై స్వతంత్ర విచారణ జరపాలని ఆస్ట్రేలియా కోరుతోంది. దాన్ని వ్యతిరేకించిన చైనా ఆస్ట్రేలియా నుంచి మాంసం దిగుమతులను నిషేధించింది. ఇలాంటి సమయంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మిగిలిన అగ్రరాజ్యాలతో చేతులు కలుపుతుందా అనే ప్రశ్న కూడా వస్తోంది. అగ్రరాజ్యాలు చైనాను వ్యతిరేకించేందుకు కరోనా ఒక్కటే కారణం కాదు. యావత్ ప్రపంచంలోనే చైనా అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దాన్ని అడ్డుకోవాలంటే వాణిజ్యయుద్ధాలు తప్పవు. చైనాతో 4 వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన భారత్ అంత తేలిగ్గా చైనాను వ్యతిరేకించలేదు. సరిహద్దు వివాదాల పేరిట చైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అటు మిగిలిన దేశాలకు కోపం తెప్పించకుండా ఇటు చైనాను నొప్పించకుండా మెలగాల్సిన పరిస్థితిలో భారత్ చిక్కుకుంది. అందుకే చైనా వస్తు బహిష్కరణ అని గాకుండా స్వదేశీ వస్తు వినియోగం అనే నినాదం తెరపైకి వచ్చింది. కారణాలు ఎలా ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా మన జీవితాలు మెరుగుపడాలన్నా మనం స్వదేశీ వస్తువులనే కొనాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories