కరోనా కట్టడికి వ్యూహం : దేశాన్ని మూడు జోన్లుగా..

Arun Chilukuri
Published on: 13 April 2020 1:11 PM IST
కరోనా కట్టడికి వ్యూహం : దేశాన్ని మూడు జోన్లుగా..
X

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. నమోదైన కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్‌-19ను ధీటుగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

కరోనా కేసులు 15కంటే ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్‌‌జోన్‌గా ప్రకటిస్తారు. ఇలా ప్రకటించిన జోన్లలో ఏప్రిల్‌ 14 తరవాత కూడా పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం ఉంటుంది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాల్సి ఉంటుంది.

ఇక15 కంటే తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి కొన్ని సర్వీసులు నడపడం, వ్యవసాయ పనులు చేసేందుకు అనుమతులు ఇస్తారు.

ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతాలను గ్రీన్‌‌జోన్లుగా గుర్తిస్తారు. గ్రీన్‌‌జోన్ల పరిధిలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. దేశంలో దాదాపు 430 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఈ ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా పరిగణించి అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.

లాక్‌డౌన్‌ అమలులో ఉంటే ఆంక్షల నుంచి ఏయే రంగాలను మినహాయించాలన్నదానిపై కేంద్ర హోంశాఖ జాబితా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత దూరాన్ని కచ్చితంగా పాటించే నిబంధనతో వ్యవసాయం, చిన్న-మధ్య తరహా, మౌలిక వసతుల రంగాలకు సంబంధించి కొన్ని ఆంక్షలను మినహాయించే అవకాశం ఉండనున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story